నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఐ పాలనాకాలంతో పోల్చిచూస్తే, మోడీ పాలనా కాలంలో దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం 65 శాతం పెరిగి, 500.5 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు.
ఫైనాన్స్ బిల్లు 2022, అప్రాప్రియేషన్ బిల్లు, 2022పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి ఈ మేరకు సమాధానం ఇస్తూ, యూఎన్‌సీటీఏడీ (వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి వేదిక) నివేదిక ప్రకారం, ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించే ఐదు దేశాల్లో భారతదేశం ఒకటిగా కొనసాగుతోందని అన్నారు.2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ఎఫ్‌డీఐల ప్రవాహం 81.72 బిలియన్ డాలర్లయితే, 2019–20లో ఈ విలువ 74.9 బిలియన్ డాలర్లుగా ఉందని అన్నారు. మహమ్మారి సమయంలోనూ ఎఫ్‌డీఐల ప్రవాహం దేశంలోకి కొనసాగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం పన్నుల పెంపు దిశగా ఆలోచించలేదని, ఆర్థిక పునరుద్ధరణకు నిధులు సమకూర్చడానికి ఎటువంటి పన్నును పెంచలేదని ఆమె అన్నారు. ఓఈసీడీ నివేదిక ప్రకారం, 32 దేశాలు తమ ఆర్థిక పునరుద్ధరణలకు నిధులు సమకూర్చడానికి తమ పన్ను రేట్ల పెంపువైపే మొగ్గుచూపాయని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం మహమ్మారి తరహాలోనే అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల నుండి రాష్ట్రాలకు రూ. 8.35 లక్షల కోట్లు కేటాయించామని ఆర్థికమంత్రి పేర్కొంటూ, ఇది 2021–22కి సవరించిన అంచనా రూ. 7.45 లక్షల కోట్ల కంటే అధికమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment