ఎల్‌ఐసీలోకి విదేశీ పెట్టుబడులు సహించం
-
ఏఓఐ ఎస్‌సీజెడ్ జాతీయ కార్యదర్శి నరసింహారావు
నెల్లూరు(అర్బన్) : ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఎల్‌ఐసీలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించబోమని ఏజెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ (ఏఓఐ) సౌత్ సెంట్రల్ జోన్ జాతీయ కార్యదర్శి నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక మినీబైపాస్‌రోడ్డులోని శ్రీహరి భవన్‌లో నెల్లూరు డివిజన్(నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం) ఏఓఐ ఈసీ మెంబర్ల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నరసింహారావు మాట్లాడారు. ఎల్‌ఐసీ సేకరించిన నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అతి తక్కువ వడ్డీకి ఇస్తుందన్నారు. దేశంలోని లక్షలాది మంది ఏజెంట్ల ఉపాధి భద్రతకు ఏఓఐ కృషి చేస్తుందన్నారు. సంఘం రాష్ట్ర కోశాధికారి అప్పల నాయుడు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఎల్‌ఐసీ ఏఓఐ తరుపున ఏజెంట్ల సంక్షేమం కోసం ఎంపీ సంపత్ ప్రైవేటు బిల్లు పెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, బాలచందర్, డివిజనల్ కార్యదర్శి ఎం నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.