లోక్‌సభలో బీమా చట్టాల సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సర్కారు
లోక్‌సభలో బీమా చట్టాల సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సర్కారు
రాజ్యసభలో పెండింగ్‌లో ఉండగా లోక్‌సభలో ఎలా ప్రవేశపెడతారంటూ ఉభయసభల్లో విపక్షాల ధ్వజం
గనుల వేలం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫీడీఐల) పరిమితిని ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ రూపొందించిన బీమా చట్టాలు (సవరణ) బిల్లు 2015ను.. వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇదే తరహా బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉండగా.. లోక్‌సభలో ఎలా ప్రవేశపెడతారంటూ ఉభయసభల్లోనూ విపక్షాలు మండిపడ్డాయి. అదే తరహా బిల్లును ప్రవేశపెట్టే హక్కు గానీ అధికారం గానీ ప్రభుత్వానికి లేదన్నాయి. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచుతూ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో చట్టం కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బీమా చట్టం 1938, సాధారణ బీమా వ్యాపారం(జాతీయకరణ)చట్టం 1972, బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ చట్టం 1999లను సవరించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. లోక్‌సభలో వామపక్షాల ఒత్తిడి పై ఓట్ల విభజన జరిపాక ఆర్థిక సహాయమంత్రి జయంత్‌సిన్హా బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా 131 ఓట్లు పోలవగా వ్యతిరేకంగా 45 ఓట్లు పోలయ్యాయి. విపక్షాల ప్రశ్నలకు మంత్రి వెంకయ్య బదులిస్తూ.. ఆర్డినెన్స్ జారీ అయిన క్షణమే అది చట్టమైందని.. కాబట్టి దాని కింద తీసుకున్న చర్య ఆరు వారాల వరకూ చెల్లుబాటవుతుందని ఆర్డినెన్స్ జారీ అయిన ఆరు వారాల్లోగా సంబంధిత బిల్లు ఆమోదం పొందేలా చూడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వానికి ఉందని జయంత్‌సిన్హా చెప్పారు.
అధ్యయనం చేసి రూలింగ్ ఇస్తా..కురియన్.. కాగా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ నేత నరేష్ అగర్వాల్ కోరారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టినపుడు అది సభ ఆస్తి అవుతుందని.. దానిని ఆమోదించటమో, తిరస్కరించటమో, ఉపసంహరించటమో చేయకుండా.. అటువంటి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టటం చెల్లదని పేర్కొన్నారు. ఎగువసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చా లేదా అన్న అంశంపై పార్లమెంటు నిబంధనలను అధ్యయనం చేసి రూలింగ్ ఇస్తానని రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ చెప్పారు.
గిడ్డంగుల సంస్థకు ప్రభుత్వ పూచీ అవసరంలేదు.. గిడ్డంగుల సంస్థ(సీడబ్ల్యూసీ)కు పూచీదారుగా కేంద్ర ప్రభుత్వ బాధ్యతలను తప్పించటానికి ఉద్దేశించిన గిడ్డంగుల సంస్థ(సవరణ) బిల్లును వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌పాశ్వాన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గనులను వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన బిల్లుకు మంగళవారం విపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి గత జనవరిలో జారీ చేసిన ఆర్డెనెన్స్ స్థానంలో చట్టం తెచ్చేందుకు గనులు, ఖనిజములు(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు 2015ను ఉద్దేశించారు.