ఇక బీమాలోకి విదేశీ నిధుల వరద.. | fdis willbe in insurance companies | Sakshi
Sakshi News home page

ఇక బీమాలోకి విదేశీ నిధుల వరద..

Published Fri, Mar 13 2015 2:44 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఇక బీమాలోకి విదేశీ నిధుల వరద.. - Sakshi

ఇక బీమాలోకి విదేశీ నిధుల వరద..

రూ. 60,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా...
భారతి బీమా వెంచర్లో యాక్సా వాటా 49 శాతానికి పెంపు: సునీల్ మిట్టల్
భాగస్వాములతో చర్చిస్తాం: రిలయన్స్ కేపిటల్
పెట్టుబడులకు అదనపు వనరు ఈ పరిమితి పెంపు: చందా కొచర్
వాటా పెంపుపై మా భాగస్వామికి ఆసక్తి: ఎస్‌బీఐ


సాక్షి బిజినెస్ విభాగం: ఎట్టకేలకు బీమా బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడటంతో ఇటు స్వదేశీ బ్యాంకులు, సంస్థలకు, అటు విదేశీ బీమా కంపెనీలకు దీర్ఘకాల నిరీక్షణ ఫలించినట్లయ్యింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు లైన్‌క్లియర్ కావడంతో ఈ రంగంలోకి క్రమేపీ విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో 24 జీవిత బీమా కంపెనీలు సహా 53 కంపెనీలున్నాయి.

వాటిలో పలు దేశీయ బ్యాంకులు, ఆటోమొబైల్, బ్రోకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు విదేశీ భాగస్వామితో కలిసి జాయింట్ వెంచర్ బీమా కంపెనీల్ని అటు జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఏర్పాటుచేశాయి. బీమా వ్యాపారాలకు కొంత మూలధనాన్ని సమకూర్చడంతో పాటు కొత్త బీమా పత్రాలను రూపొందించడం వంటి సాంకేతిక సహకారాన్ని విదేశీ భాగస్వామ్య సంస్థలు అందిస్తూ వస్తున్నాయి. భారత్ బీమా రంగంలో అపార వ్యాపార అవకాశాలున్నందున, పూర్తిస్థాయిలో ద్వారాలు తెరవాలంటూ స్వదేశీ, విదేశీ కంపెనీలు ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెట్టుకుంటూ వస్తున్నాయి.

తాజాగా బిల్లు క్లియరెన్స్‌తో ప్రైవేటు రంగ కంపెనీలు వాటి విదేశీ భాగస్వాముల నుంచి నిధులు సమీకరించడం, స్టాక్ మార్కెట్లో నమోదవటం ద్వారా నిధుల సేకరించడం వంటి ప్రణాళికల్ని హుటాహుటిన సిద్ధం చేస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లతో పాటు కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ తదితర ప్రభుత్వ బ్యాంకులకు వున్న బీమా జాయింట్ వెంచర్లలో సైతం విదేశీ భాగస్వామ్య కంపెనీలున్నాయి. బజాజ్ ఆటో, మహీంద్రా తదితర ఆటోమొబైల్ కంపెనీలకు, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ఫైనాన్షియల్ సంస్థల వెంచర్లకు కూడా భాగస్వాములు విదేశీ సంస్థలే.
 
ప్రయివేటు రంగంలోని ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బీమా కంపెనీలు స్టాక్ మార్కెట్లో వాటి వెంచర్లను లిస్ట్‌చేసేందుకు ఇప్పటికే సంకేతాలివ్వగా మరికొన్ని కంపెనీలు తెరవెనుక కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఈ మూడూ అటు జీవిత బీమా, ఇటు సాధారణ బీమా రెండు రంగాల్లోనూ ఉన్నాయి. ఐసీఐసీఐ సంస్థ దక్షిణాఫ్రికాకు చెందిన లాంబార్డ్‌తో కలిసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన ప్రుడెన్షియల్‌తో కలిసి జీవితబీమా సేవల్ని అందిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ కూడా జర్మనీకి చెందిన ఇర్గోతో కలిసి సాధారణ బీమా సేవల్ని, అమెరికాకు చెందిన స్టాండర్డ్‌తో కలిసి జీవిత  బీమా సేవల్ని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ఎంత వాటాను విక్రయించాలనుకుంటున్నదీ చెప్పకపోయినా... ఐసీఐసీఐ మాత్రం 5% వాటాను విక్రయించే అవకాశం ఉం దని తెలియజేసింది. అధిక ఎఫ్‌డీఐ పరిమితి కలిగిన వెంచర్లను స్టాక్ మార్కెట్లో లిస్ట్‌చేసుకుంటే వాటికి అధిక వాల్యుయేషన్ పలుకుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
 
కంపెనీలు ఖుషీ ఖుషీ..
న్యూఢిల్లీ:  బీమా బిల్లును పార్లమెంటు ఆమోదించడం దేశీ ఇన్సూరెన్స్ రంగ సంస్థల్లో ఉత్సాహం నింపింది. ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు పలు విదేశీ కంపెనీలతో జాయింట్ వెంచర్లు (జేవీ) ఏర్పాటు చేసిన దేశీ బీమా సంస్థలు తెలిపాయి. ఇక, జేవీల్లో విదేశీ భాగస్వామ్య కంపెనీలు వాటాలు పెంచుకోవడానికి మార్గం సుగమమైందని గురువారం బిల్లు ఆమోదం పొందిన కొద్ది సేపటికే ప్రకటించాయి. భారతీ, రిలయన్స్, ఎస్‌బీఐ గ్రూప్, మ్యాక్స్ తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి.

పరిమితి పెంపు ద్వారా బీమా రంగంలోకి 8-10 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 48,000 కోట్లు-రూ. 60 వేల కోట్లు) రాగలవని కంపెనీలు అంచనా వేశాయి. ఇన్సూరెన్స్ రంగానికి ఇది సానుకూల పరిణామమని ఫ్రాన్స్‌కి చెందిన యాక్సాతో జేవీ ఏర్పాటు చేసిన భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభిప్రాయపడ్డారు. జాయింట్ వెంచర్‌లో యాక్సా ఇక తన వాటాలను 49 శాతానికి పెంచుకుంటుందని, ఇందుకోసం త్వరలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బోర్డు (ఎఫ్‌ఐపీబీ)కు దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

‘తాజా పరిణామంతో ఇన్సూరెన్స్ రంగంలోకి 8-10 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశీయంగా బీమాను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. జీవిత బీమా వెంచర్‌లో తమ వాటాలను పెంచుకునేందుకు మా భాగస్వామ్య సంస్థలతో చర్చలు మొదలుపెడతాం’ అని రిలయన్స్ క్యాపిటల్ సీఈవో శామ్ ఘోష్ చెప్పారు. బీమా కంపెనీలు పెట్టుబడులు సమకూర్చుకునేందుకు మరో వనరు లభించినట్లవుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు.
 
అనిశ్చితి తొలగింది..: బీమా బిల్లు ఆమోదంతో అనిశ్చితి తొలగిందని, స్పష్టత వచ్చిందని ఎస్‌బీఐ లైఫ్ ఎండీ అరిజిత్ బసు చెప్పారు. ఎస్‌బీఐ లైఫ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి 74 శాతం,  బీఎన్‌పీ పారిబాకి 26 శాతం వాటాలు ఉన్నాయి. బీఎన్‌పీ తన వాటాలను పెంచుకోవడంపై ఆసక్తిగా ఉందని, ఎంత మేర పెంచుకుంటుందో .. ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని బసు తెలిపారు. మరోవైపు, మ్యాక్స్ బూపా జేవీలో బ్రిటన్ భాగస్వామ్య సంస్థ బూపా కూడా వాటాలు పెంచుకోవాలనుకుంటోందని మ్యాక్స్ ఇండియా చైర్మన్ అనల్జిత్ సింగ్ చెప్పారు.

ప్రస్తుతం దేశీ జీవిత బీమా రంగంలో రూ. 35,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని, ఇందులో ఎఫ్‌డీఐలు (26 శాతం పరిమితిని బట్టి చూస్తే) సుమారు రూ. 8,700 కోట్లు ఉంటాయని పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండీ తరుణ్ చుగ్ చెప్పారు. పరిమితిని పెంచడం వల్ల అదనంగా మరో రూ. 7,800 కోట్ల ఎఫ్‌డీఐలు రాగలవన్నారు.
 
బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఊతం: ఈ బిల్లు ఆమోదం  బీమా రంగంలో నూతన అధ్యాయానికి తెర తీసిందని ఫిక్కీ జనరల్ డెరైక్టర్ అరబింద్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. బీమా బిల్లు ఆమోదంతో దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఐఐ జనరల్ డెరైక్టర్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement