డీల్‌ స్ట్రీట్‌లో డాన్‌.. రిలయన్స్‌ | India records 80 billion dollers of M&A and private equity deals in 2020 | Sakshi
Sakshi News home page

డీల్‌ స్ట్రీట్‌లో డాన్‌.. రిలయన్స్‌

Dec 24 2020 12:53 AM | Updated on Dec 24 2020 4:11 AM

India records 80 billion dollers of M&A and private equity deals in 2020 - Sakshi

ముంబై: కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్‌ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్‌ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. రిలయన్స్‌ కారణంగా భారీ డీల్స్‌ కుదిరాయంటున్న ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే...,  

► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డీల్స్‌ 7 శాతం వృద్ధితో 8,000 కోట్ల డాలర్లకు పెరిగాయి. మొత్తం 1,268 లావాదేవీలు జరిగాయి.  

► దీంట్లో మూడో వంతుకు పైగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డీల్స్‌ ఉన్నాయి.  

► రిలయన్స్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్‌ జియో 1,020 కోట్ల డాలర్లు సాధించింది. ఇక రిటైల్‌ విభాగం కూడా వేల కోట్ల ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లను ఆకర్షించింది.  

► ఈ ఏడాది జరిగిన మొత్తం డీల్స్‌లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్‌ వాటా దాదాపు సగంగా ఉంది. ఇక ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) లావాదేవీలు గత ఏడాది మాదిరిగానే 3,820 కోట్ల డాలర్ల             రేంజ్‌లో ఉన్నాయి.  

► ఈ ఏడాది ఆరంభంలో టెలికం రంగంలో భారీ డీల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత కరోనా కల్లోలం చెలరేగడంతో పలు సంస్థల తమ ఒప్పందాలను వాయిదా వేశాయి. పలు పీఈ ఫండ్స్‌ కూడా వేచి చూసే ధోరణిని అవలంభించాయి.  

► దేశీయ డీల్స్‌ పరంగా చూస్తే, రిలయన్స్‌ రిటైల్‌–ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందమే పెద్దది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌  330 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.  

► విదేశీ సంస్థల డీల్స్‌ ఈ ఏడాది 11 శాతం పెరిగాయి. రిలయన్స్‌ జియోలో 9.9 శాతం వాటా కోసం ఫేస్‌బుక్‌ సంస్థ 570 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. లాక్‌డౌన్‌ కాలంలో జరిగిన అతి పెద్ద     డీల్‌ ఇదే.  

► ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలానికి 3,000 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఎఫ్‌డీఐలతో పోల్చితే ఇది 15 శాతం అధికం.  

► రిలయన్స్‌ వల్లనే అధికంగా పీఈ డీల్స్‌ జరిగాయి. ఫేస్‌బుక్, టీపీజీ, కేకేఆర్, జనరల్‌ అట్లాంటిక్, సిల్వర్‌ లేక్‌ తదితర పీఈ ఫండ్స్, సావరిన్‌ ఫండ్స్‌ రిలయన్స్‌ జియోలో 980 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ ఏడాది పీఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇది 66 శాతానికి సమానం. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌లో 510 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం పీఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌  1,500 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఇది రికార్డ్‌ స్థాయి.  

► ఈ ఏడాది అత్యధిక నిధులు ఆకర్షించిన రంగంగా టెలికం నిలిచింది.  ఈ రంగంలోకి మొత్తం 1,120 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక రిటైల్‌ రంగంలో 650 కోట్ల డాలర్లు, టెక్నాలజీ రంగంలో 600 కోట్ల డాలర్లు, ఫార్మాలో 250 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.

► వాటాలను విక్రయించి వివిధ సంస్థల నుంచి పీఈ సంస్థలు వైదొలగడం గత ఐదేళ్లలోనే అత్యంత కనిష్టానికి ఈ ఏడాది పడిపోయింది. స్టాక్‌ మార్కెట్‌  తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉండటమే దీనికి కారణం. ఈ వాటాల విక్రయం పరంగా చూస్తే, మొత్తం 420 కోట్ల డాలర్ల విలువైన 136 లావాదేవీలు జరిగాయి.  ఇది గత ఏడాది డీల్స్‌తో పోల్చితే 56 శాతం తక్కువ. (విలువ పరంగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement