జియో.. సిక్సర్‌! | Abu Dhabi Fund Mubadala to Invest Rs 9,093 Crore in Jio | Sakshi
Sakshi News home page

జియో.. సిక్సర్‌!

Published Sat, Jun 6 2020 12:51 AM | Last Updated on Sat, Jun 6 2020 5:30 AM

Abu Dhabi Fund Mubadala to Invest Rs 9,093 Crore in Jio - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అబుధాబికి చెందిన సార్వభౌమ సంస్థ ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ (ముబాదలా) జియోలో 1.85 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ. 9,094 కోట్లు. గడిచిన సుమారు నెలన్నర వ్యవధిలో జియోకి ఇది ఆరో డీల్‌. ఇప్పటిదాకా కంపెనీలోకి దాదాపు రూ. 92,202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

‘జియో ప్లాట్‌ఫామ్స్‌లో ముబాదలా రూ. 9,093.60 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. దీని ప్రకారం కంపెనీ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు ఫేస్‌బుక్, సిల్వర్‌ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్‌ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా ఇప్పటిదాకా ఇన్వెస్ట్‌ చేశాయి. టెలికం సేవలు అందించే జియో ఇన్ఫోకామ్‌ సహా డిజిటల్‌ వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియోకు 38.8 కోట్ల పైగా యూజర్లు ఉన్నారు.  

వాటాలు ఇలా..
ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జియోలో అమెరికాకు చెందిన సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 9.99% వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ. 43,574 కోట్లు. ఆ తర్వాత కొద్ది రోజులకే సిల్వర్‌ లేక్‌ రూ. 5,666 కోట్లతో 1.15% వాటాలు దక్కించుకుంది. మే 8న అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌ రూ. 11,367 కోట్లు వెచ్చించి 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇక, మే 17న అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ 1.34 శాతం వాటాలను రూ. 6,598 కోట్లకు దక్కించుకుంది.

అటుపైన మరో ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ కూడా రూ. 11,367 కోట్లతో 2.32 శాతం వాటాలు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే వివిధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ జరుపుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్దేశించుకున్న గడువులోగానే లక్ష్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. చేతిలో ఉన్న నగదు నిల్వలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రిలయన్స్‌ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది.  

పటిష్టమైన ముబాదలా పోర్ట్‌ఫోలియో.. .
వినూత్న వ్యాపారాలకు తోడ్పాటు అందించేందుకు ముబాదలా 2017లో కొత్తగా వెంచర్స్‌ విభాగం ప్రారంభించింది. ఇది ప్రస్తుతం అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాల్లో పలు వెంచర్‌ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. ముబాదలా పోర్ట్‌ఫోలియో లో అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్, మెటల్స్, మైనింగ్, ఫార్మా, మెడికల్‌ టెక్, పునరుత్పాదక విద్యుత్‌ తదితర సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి.  

సిల్వర్‌ లేక్‌ మరో రూ.4,546 కోట్లు
జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్‌ లేక్‌ కొత్తగా రూ. 4,547 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ సంస్థ జియోలో ఇప్పటికే రూ. 5,656 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. అంతా కలిపి 2.08% వాటా కోసం సిల్వర్‌ లేక్‌ సుమారు రూ. 10,203 కోట్లు వెచ్చించినట్లవుతుంది. తాజా పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌ సుమారు 19.90% వాటాలు విక్రయించి రూ. 92,202.15 కోట్లు సమీకరించినట్లవుతుంది. టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు 1999లో ఏర్పాటైన సిల్వర్‌ లేక్‌ ఇప్పటిదాకా ట్విటర్, ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా వంటి దిగ్గజ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.

అబుధాబితో నాకు దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలకు యూఏఈని మరింతగా అనుసంధానించడంలో ముబాదలా ప్రభావవంతంగా పనిచేయడం నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థల వృద్ధిలో కీలకపాత్ర పోషించిన ముబాదలా అనుభవం మాకు ఉపయోగపడుతుంది.
– ముకేశ్‌ అంబానీ

కీలక సవాళ్లను అధిగమించే దిశగా కొంగొత్త టెక్నాలజీలను తయారు చేస్తున్న అధిక వృద్ధి స్థాయి కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు మేము కట్టుబడి ఉన్నాం. క్రియాశీలకంగా కలిసి పనిచేస్తాం.
– ముబాదలా గ్రూప్‌ సీఈవో ఖల్దూన్‌ అల్‌ ముబారక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement