న్యూఢిల్లీ: గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యలోనూ రానున్న కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పుంజుకోనున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తాజాగా అంచనా వేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో పెట్టుబడులు, ఈక్విటీలకు నిధులు తరలి వస్తుంటాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి మన్మీత్ కె.నందా పేర్కొన్నారు.
కాగా.. ఈ ఏడాది(2022–23) తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఎఫ్‌డీఐ ఈక్విటీ నిధులు 14 శాతం క్షీణించి 26.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఈక్విటీ పెట్టుబడులు, రాబడులను తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇతర మూలధనం కలసిన మొత్తం ఎఫ్‌డీఐలు సైతం ఈ కాలంలో 9 శాతం నీరసించి 39 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది(2021–22) తొలి అర్ధభాగంలో ఇవి 42.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమనం కారణంగా 18 నెలలుగా విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడుతున్నట్లు మన్మీత్ తెలియజేశారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఇకపై ఊపందుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment