న్యూఢిల్లీ: మెట్రో ఏజీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ, నిధులు మళ్లించుకునే క్రమంలో ఉందని అఖిల భారత రిటైలర్ల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రో ఆరోపణలు చేసింది. మెట్రో ఏజీ భారత వ్యాపార విభాగం మెట్రో క్యాష్ అండ్ క్యారీ అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఇవి తప్పుడు ఆరోపణలు అని, హాని కలిగించే ఉద్దేశ్యంతో చేస్తున్నవిగా మెట్రో ఏజీ ఖండించింది.
మెట్రో ఏజీ 2003లో భారత్‌లోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా 31 మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నిర్వహిస్తోంది. భారత్‌లో వ్యాపారాన్ని విక్రయించి వెళ్లిపోయే సన్నాహాల్లో ఉంది. అమెజాన్, రిలయన్స్ రిటైల్, సీపీ గ్రూపు తదితర సంస్థలు బిడ్ వేసే యోచనతో ఉన్నాయి. ఈ క్రమంలో సీఏఐటీ ఆరోపణలు, అభ్యంతరాలను వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘మీడియా కథనాల ప్రకారం మెట్రో జర్మనీ భారత వ్యాపారాన్ని విక్రయించి, తన పెట్టుబడులపై రూ.10,000 కోట్లకు పైగా లాభాలను పొందాలనుకుటోంది. భారత్‌లో గత సంవత్సరాల్లో భారీ లాభాలను సమకూర్చుకున్న మొత్తాన్ని దారి మళ్లించడమే ఇది. మెట్రో ఏజీ క్యాష్ అండ్ క్యారీ (హోల్‌సేల్) రూపంలో బీటుసీ (బిజినెస్ టు కస్టమర్/రిటైల్) వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది ఫెమా, జీఎస్‌టీ చట్టాలను ఉల్లంఘించడమే. వ్యవస్థలను అపహాస్యం చేయడం. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే సంస్థలు కస్టమర్ల నుంచి పన్ను రిజిస్ట్రేషన్ ఆధారాన్ని తీసుకోవాలి. కానీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా బోగస్ పన్ను రిజిస్ట్రేషన్ కార్డులను తన స్టోర్లకు వచ్చే కస్టమర్లకు జారీ చేసి నిబంధనలను పాతరేసింది’’అని సీఏఐటీ ప్రకటన విడుదల చేసింది.
ఈడీ దర్యాప్తు
దీనిపై మేము ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేసినట్టు సీఏఐటీ ప్రకటించింది. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఉల్లంఘనలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈడీ త్వరలోనే తన దర్యాప్తు పూర్తి చేసి కనీసం మెట్రో ఇండియాపై రూ.12,000 కోట్ల వరకు జరిమానా విధించొచ్చని పేర్కొంది. సీఏఐటీ ఆరోపణలను మెట్రో ఏజీ ఖండించింది. సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘గత 19 ఏళ్ల భారత కార్యకలాపాల్లో నియంత్రణపరమైన నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ, భారత చట్టాలను అనుసరించడంలో మాకు నిష్కళంకమైన ట్రాక్ రికార్డు ఉంది. కనుక స్వార్థ ప్రయోజనాల కోణంలో చేసిన తప్పుడు, హానికారక ఆరోపణలను ఖండిస్తున్నాం’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment