11 ఎఫ్డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల కు సంబంధించి 11 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.2,325 కోట్లు. షేర్‌ఖాన్ లిమిటెడ్ వంద శాతం వాటాను బీఎన్‌పీ పారిబాకు విక్రయించే ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్‌డీఐ విలువల రూ.2,060 కోట్లు. ఐడియా సెల్యులర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. రూ.253కోట్ల పెర్రిగో ఇండియా, పెపె జీన్స్, ఐబీఎమ్ తదితర ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్-ఎఫ్‌ఐపీబీ) మొత్తం 18 ఎఫ్‌డీఐ ప్రతిపాదలను పరిశీలించింది. నాలుగు ప్రతిపాదనలను తిరస్కరించింది. మరింత సమాచారం కావాలంటూ ఐడియా, ఫ్లాగ్ టెలికం ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. రూ.95 కోట్ల విలువైన మోర్గాన్ స్టాన్లీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను ఆటోమేటిక్ రూట్‌లో ఆమోదించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3,600 కోట్ల ఎఫ్‌డీఐలు, గత ఆర్థిక సంవత్సరంలో 5,546 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.