
'ప్రతి పనిలోనూ అవినీతి కంపు'
ఆంధ్రప్రదేశ్ లో విదేశీ పెట్టుబడులపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో విదేశీ పెట్టుబడులపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి విమర్శించారు. రెండేళ్లలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పోటీ పడుతూ విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు సాధించింది ఏమీ లేదన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఎంవోయూల ద్వారా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు చేసే ప్రతి పనిలో అవినీతి కంపు కొడుతోందని దుయ్యబట్టారు. ఇంత అవినీతి జరుగుతుంటే విదేశీ పెట్టుబడలు ఎలా వస్తాయని అన్నారు. ఏపీని కాపాడడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే తమ పార్టీపై టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారని పార్థసారధి ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వైఎస్ జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. స్విస్ చాలెంజ్ పేరుతో దోపిడీకి తెర తీశారని మండిపడ్డారు. రాజధాని అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.