corpus fund
-
ఆవిష్కరణలకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: యువతరం ఆలోచనలను ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామికవేత్తలుగా రాణించే నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి చేయూతనిచ్చేలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెలెక్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విశాఖ కేంద్రంగా ఐ–స్పేస్ పేరుతో మల్టీ డొమైన్ ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఒక ఆలోచనను పూర్తిస్థాయి వ్యాపార ఆవిష్కరణగా మార్చడానికి అవసరమైన ఆర్ అండ్ డీ, కటింగ్ ఎడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రోడక్ట్ వాలిడేషన్, ఉత్పత్తి పరిశీలన లాంటి వ్యవస్థలన్నీ ఒకచోట ఉండేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐ స్పేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇంక్యుబేటర్స్, కో వర్కింగ్ స్పేస్, ఏంజెల్/వెంచర్ క్యాపిటలిస్ట్‌లను అందుబాటులో ఉంచడంతోపాటు చేయూతనిచ్చే విధంగా మెంటార్స్, టెక్నోప్రెన్యూర్స్ ఉంటారు. వీటితోపాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, పేటెంట్ రిజిస్ట్రేషన్స్, లీగల్ సర్వీసెస్, ఫండ్ సోర్సింగ్, ప్యాకేజింగ్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కార్పస్ ఫండ్ స్టార్టప్‌లకు అవసరమైన సీడ్ క్యాపిటల్ సాయం అందించేందుకు ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ (ఆర్ అండ్ డీ) ఏర్పాటును ప్రోత్సహించనుంది. ఆర్అండ్డీ సెంటర్ల కోసం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఆర్ అండ్ డీ ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్స్ వ్యయంలో 50 శాతం వరకు, గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రీయింబర్స్ చేస్తారు. -
సీఎం జగన్ కలిసిన చెస్ క్రీడాకారిణి కోలగట్ల మీనాక్షి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్, అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం, ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్ ఫండ్ నుంచి రూ.1 కోటి నిధిని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రికార్డులు నెలకొల్పిన మీనాక్షి.. ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2023 పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. వరల్డ్ నెంబర్ 1 అండర్ 12 గర్ల్స్ చెస్ 2023 (ఫిడే ర్యాంకింగ్స్), వరల్డ్ నెంబర్ 1 అండర్ 11 గర్ల్స్ చెస్ 2022, వరల్డ్ నెంబర్ 2 అండర్ 10 గర్ల్స్ చెస్ డిసెంబర్ 2021, ఉమెన్ ఫిడే మాస్టర్ 2022, ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ 2021 టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రితో మీనాక్షి, తల్లిదండ్రులు పంచుకున్నారు. మీనాక్షి ప్రతిభను సీఎం ప్రశంసించారు. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: ఆశా మాలవ్యకు సీఎం జగన్ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం -
సీపీఎస్ రద్దు..రూ.4వేల కోట్లతో రైతు కార్పస్‌ఫండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షే మమే ధ్యేయంగా ఎన్నికల వరాలను ప్రకటిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరో 2 కీలక ప్రకటనలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ మేని ఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వెల్ల డించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా రూ.4వేల కోట్లతో రైతు కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. గాంధీభవన్‌లో రాజనర్సింహ అధ్యక్షతన గురువారం జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్ ఎం.కె.గౌడ్, సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, గంగారాం, కూన శ్రీశైలం గౌడ్, ఇందిరా శోభన్ పాల్గొన్నారు. రాజనర్సింహ విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ వర్గాల్లో చాలా డిమాండ్ ఉందని, ఈ సమస్యపై మేనిఫెస్టో కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సీపీఎస్‌ను రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఉద్యోగులతో చర్చించి మధ్యంతర భృతిని వారికి అనుకూలంగా ప్రకటిస్తామని, పీఆర్సీ విషయంలో న్యాయం చేస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాలు పర్యటించి భాగస్వాములతో మాట్లాడి, నివేదికలు తీసుకున్న తర్వాతే ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. వారం పదిరోజుల్లో మేనిఫెస్టో సిద్ధం చేసి అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తామన్నారు. వందలాది వినతులు వస్తున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ గత మూడు రోజులుగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండి అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తోందని, వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయని రాజనర్సింహ చెప్పారు. ఏపీ కార్మిక సంక్షేమ మండలి తరహాలో అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలని, ఈబీసీ కార్పొరేషన్, వికలాంగులకు పింఛన్లు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, ఇళ్లు, రిజర్వేషన్లు ఇవ్వాలని, విదేశీవిద్యకు నిధుల కేటాయింపు, సాక్షరతా భారత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జూనియర్, డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గురుకుల పాఠశాలల్లో వార్డెన్ వ్యవస్థ ఏర్పాటు, కమలనాథన్ కమిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన 600 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు, 350 మందికి పైగా నాన్‌గెజిటెడ్ అధికారులు మళ్లీ తెలంగాణకు రాక లాంటి అంశాలపై గురువారం మేనిఫెస్టో కమిటీకి వినతిపత్రాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష మేనిఫెస్టో కమిటీ భేటీలో భాగంగా వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష జరిగింది. బీసీ, ఈబీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, పారిశ్రామిక విధానం, మైనార్టీ సంక్షేమంపై ఏర్పాటు చేసిన కమిటీలతో పలు ప్రతిపాదనలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కమిటీలు నివేదికలు సమర్పించిన అనంతరం మరోమారు ఆ ప్రతిపాదనలపై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేనిఫెస్టో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 700 వీఆర్వో పోస్టులకు 11లక్షల మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 4.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ మేనిఫెస్టో తయారవుతోందన్నారు. యువతలోని ప్రతిభను వెలికితీసి వారికి ఉపాధి కల్పించేందుకు గాను మండల స్థాయిలో నైపుణ్య వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న నిర్మాణ రంగ పరిశ్రమలు, ఎంఎన్‌సీలు ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇస్తే ఆయా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా డీఎస్సీ లేక, ఉద్యోగ భర్తీలు లేక యువత అల్లాడిపోతోందని, యువత త్యాగాల పునాదుల మీదే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని టీఆర్ఎస్ మరచిపోయిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. -
‘అగ్రిగోల్డ్ బాధితుల కోసం కార్పస్‌ఫండ్ పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయా లని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో 3లక్షల మంది కి పైగా బాధితులు రూ.465 కోట్ల వరకు ఆ సంస్థలో డిపాజిట్లు చేశారన్నారు. డిపాజిట్లు రాక 70మంది చనిపోయారని వారి కుటుంబాలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
రైతులపై ‘మమత’ చూపారు!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2018–19 వార్షిక బడ్జెట్లో పలు రైతు అనుకూల చర్యలను ప్రకటించింది. రైతులకు పింఛన్లు, రుణ ఊబిలో చిక్కుకున్న వారికి సాయపడేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటును ప్రకటించింది. రైతుల భూములపై మ్యుటేషన్ ఫీజు, గ్రీన్‌టీ ఆకులపై సెస్సు, వ్యవసాయ పన్నును మినహాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్టాంప్‌డ్యూటీని గణనీయంగా తగ్గించింది. దివ్యాంగుల పింఛను నెలకు రూ.750 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళల కోసం రూ.1,500 కోట్లతో కన్యశ్రీ, రూపశ్రీ పథకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రఆర్థికమంత్రి అమిత్ మిత్రా బుధవారం అసెంబ్లీలో రూ.2,14,958 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. -
‘స్టార్టప్ ఇండియా’ ఇంకా స్టార్టింగ్‌లోనే !!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016, జనవరి నెలలో ‘స్టార్టప్ ఇండియా’ పేరిట కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహించి భారత్‌ను అతిపెద్ద పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చేయడం ఈ విధానం లక్ష్యం. దీని కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు మోదీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలతో ఓ కార్పస్ నిధిని కూడా ఏర్పాటు చేసింది. స్టార్టప్ ఇండియా కింద పన్ను మినహాయింపులను ఇవ్వడంతోపాటు అనేక రాయితీలను కల్పించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుగుణంగా నిధులను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్పస్ నిధి నుంచి నిధులను అందించే బాధ్యతను భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు అప్పగించింది. కార్పస్ నిధి కింద ఏర్పాటు చేసిన పదివేల కోట్ల రూపాయలను నాలుగేళ్ల కాలంలో ఖర్చుచేయాల్సి ఉంది. ఈ స్టార్టప్ ఇండియా పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్సాహాన్ని చూపాయి. దీన్ని ప్రారంభించి ఇప్పటికీ దాదాపు రెండేళ్లు కావొస్తుండగా, కేవలం 33 వేల స్టార్టప్‌ల ఏర్పాటుకే ఔత్సాహికవేత్తలు ముందుకు వచ్చారు. వాటిలో డిసెంబర్ 18వ తేదీ నాటికి 75 స్టార్టప్ కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చాయి. వాటికి దాదాపు 605 కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్ కింద విడుదల చేయడానికి అంగీకరించిన బ్యాంకు రూ.90.62 కోట్లను మాత్రమే విడుదల చేసింది. అందుకు బదులుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దాదాపు 337 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఈ వివరాలను వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి ఈనెల 18న లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. నాలుగేళ్ల కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయంగా అందించేందుకు పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించగా, రెండేళ్ల కాలంలో కేవలం రూ. 605 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు అందడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం 33 వేల స్టార్టప్ కంపెనీలు కార్యరూపం దాలుస్తాయని భావిస్తే 75 కంపెనీలే రావడాన్ని ఎలా పరిశీలించాలి? -
తెలంగాణపై బడ్జెట్ ఎఫెక్ట్...
‘ఉపాధి’కి ఊతం ‘ఉపాధి’వేతన చెల్లింపులకు రూ.3,500 కోట్లు మంజూరయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి కేంద్రం తాజా బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్రంలో ఉపాధి పనులకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. గతేడాది కన్నా రూ.10 వేల కోట్లు అధికంగా కేటాయించడం పట్ల గ్రామీణాభివృద్ధి శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజా కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆ శాఖ సిబ్బంది చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీల వేతనాలకు రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తుండగా, వచ్చే ఏడాది రూ.3 వేల కోట్ల నుంచి రూ3,500 కోట్ల దాకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులను అధికంగా చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉన్నందున కేటాయింపులు అధికంగా రావొచ్చని చెబుతున్నారు. పనిదినాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించడం గమనార్హం. నీటి సంరక్షణపైనే ఫోకస్! వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటి సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ కుంటలు, కాంటూర్ ట్యాంక్స్, చెరువుల పూడికతీత.. తదితర నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. శాశ్వత ఆస్తుల కల్పనలో భాగంగా అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిమెంట్‌రోడ్డు, పాఠశాలల్లో కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. – బి.సైదులు, జాయింట్ కమిషనర్ (ఉపాధిహామీ) సాగు ప్రాజెక్టుల రుణాలకు వెసులుబాటు కార్పస్ ఫండ్ పెంపుతో తగిన స్థాయిలో రుణాలు అందే అవకాశం సాక్షి, హైదరాబాద్: కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాగునీటి ప్రాజెక్టులకు చేయూత నిచ్చేలా ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నాబార్డు కింద ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్‌ను రూ.20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచనుండడంతో ఆ మేరకు రాష్ట్రాలకు రుణ వెసులుబాటు కలుగుతుందని పేర్కొంటున్నాయి. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్రం గుర్తించిన 11 తెలంగాణ ప్రాజెక్టుల కోసం తగినన్ని రుణాలు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నాయి. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం కోసం కేంద్రం గతేడాదే దీర్ఘకాలిక సాగునీటి నిధి (ఎల్‌టీఐఎఫ్) కింద రూ.20 వేల కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కానీ దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్ఆర్ఎస్పీ రెండోదశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమ్రం భీమ్, జగన్నాథపూర్, పెద్దవాగు, గొల్లవాగు, వరద కాలువలకు ఎలాంటి రుణాలూ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ కార్పొరేషన్ కు ఎఫ్ఆర్బీఎం పరిమితితో సంబంధం లేకుండా రూ.7,900 కోట్లు రుణాలు ఇవ్వాలని కోరగా.. నాబార్డు అంగీకరించింది కూడా. తాజాగా కార్పస్ ఫండ్‌ను పెంచడంతో కాళేశ్వరం కార్పొరేషన్ కింద రుణాలు తీసుకునే వెసులుబాటు దొరకనుంది. పీఎంకేఎస్‌వై కమిటీలో మంత్రి హరీశ్‌రావు సభ్యుడిగా ఉండటం సైతం రాష్ట్రానికి కలిసిరానుంది. హైదరాబాద్ ఐఐటీకి 75 కోట్లు గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐఐటీకి ఎంప్లాయి అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద రూ. 75 కోట్లు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించింది. విభజన చట్టం హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ. 10 కోట్లు కేటాయించింది. ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్‌లకు (ఈబీబీ) కేటాయించే ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని 317 ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎ్ టీఏ) ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కూడా జేఈఈ మెయిన్ పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే నిర్వహించనున్నారు. గర్భిణులకు రూ.15 వేల ప్రోత్సాహకం రాష్ట్ర ప్రభుత్వం యోచన.. కేంద్ర బడ్జెట్లో రూ.6 వేలు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సా హకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రూపొందిస్తున్నాయి. బుధవారం కేంద్రం తన బడ్జెట్లో గర్భిణులకు రూ. 6 వేలు కేటాయించింది. అంటే కేంద్రం నుంచి రూ.6వేలు వస్తే... రాష్ట్రం రూ.9 వేలు కేటాయిస్తే సరిపోతుంది. గర్భిణులకు ఇంత భారీగా ప్రోత్సాహకం అందించే రాష్ట్రం మనదే కానుండటం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో గర్భిణులకు రూ. వెయ్యి ప్రోత్సాహకంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 347 డెలివరీ పాయింట్లు... రాష్ట్రంలో గుర్తించిన 347 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో ప్రత్యేకంగా కాన్పు కోసం డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని 24 గంటలూ పనిచేసే ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతారు. ముగ్గురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ప్రత్యేక డెలివరీ గదులను అందుబాటులోకి తీసుకొస్తారు. తద్వారా గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఉపకారానికి చేయూత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి నిధులు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్డెట్లో విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటిం చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పాఠశాల (ప్రీమెట్రిక్) విద్యార్థులకు సైతం ఉపకార వేతనాలు అందనున్నాయి. మోదీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇందులో భాగంగా 2017–18 వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసింది. ఉపకార వేతనాల కింద మైనార్టీ సంక్షేమానికి రూ.1500 కోట్లు, ఎస్సీ సంక్షేమం కింద రూ.3,397 కోట్లు, బీసీ విద్యార్థుల కోసం 1,027 కోట్లు, గిరిజన సంక్షేమం కింద రూ.1,612.07 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో బీసీ విద్యార్థులకు పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు దక్కనున్నాయి. -
డ్వాక్రాకు శాపం
- కనిపించని కార్పస్‌ఫండ్ - పెచ్చుమీరిన ‘పది’ వేల అబద్ధాలు! - కొత్తరుణాలు ఇవ్వని బ్యాంకులు - బలవంతపు వసూళ్లలో సక్సెస్ - బాబు ఏడాది పాలనలో డ్వాక్రా కకావికలం చంద్రబాబు ఏడాది పాలన చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు శాపంగా మారింది. ఎన్నికల హామీలు.. రుణమాఫీ దేవుడెరుగు ఒక్కో సభ్యురాలికి ఇస్తామన్న రూ.10వేల హామీ ఇప్పటికీ నెరవేరలేదు. కొత్తరుణాలు పుట్టక.. ఉన్న రుణాలు కట్టలేక డ్వాక్రా మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. సాక్షి,చిత్తూరు: జిల్లాలో డ్వాక్రా సంఘాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బాబు ఎన్నికల హామీల పుణ్యమా అని గత ఏప్రిల్ నుంచి బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయాయి. కొత్త రుణాలు పుట్టక.. పాత రుణాలు కట్టలేక డ్వాక్రా మహిళలు కుమిలిపోతున్నారు. మాఫీ మాయలో.. జిల్లాలో మొత్తం 62,792 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 58,602 గ్రూపులు బ్యాంకుల లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ప్రతినెలా జిల్లాలో 89 శాతం గ్రూపులు * 100 కోట్లు కడుతున్నాయి. చంద్రబాబు రుణమాఫీ ఆశతో చాలా గ్రూపులు బ్యాంకులకు రుణాలు సక్రమంగా చెల్లించక పోవడంతో వడ్డీలు పేరిగాయి. నిబంధనల మేరకు మూడు నెలలపాటు బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీ పడడమేగాక వడ్డీలేని రుణానికి అర్హత కోల్పోతారు. ప్రస్తుతం చాలా గ్రూపులు ఇదేపరిస్థితినెదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,484 గ్రూపులకు సంబంధించి * 58 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 7,436 గ్రూపులు 3 నెలలుగా *147 కోట్లను కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బలవంతపు వసూళ్లు రుణమాఫీ సంగతి పక్కన పెట్టిన ప్రభుత్వం జిల్లాలో బలవంతంగా రుణవసూళ్లకు పాల్పడుతోంది. వెలుగు అధికారులు, బ్యాంకర్లు కలిసి రుణాలు చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తామని నమ్మబలికి డ్వాక్రా మహిళలను బోల్తా కొట్టిస్తున్నారు. కొన్నిగ్రూపుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పాతబకాయిలకు సంబంధించి రీపేమెంట్ చేయకపోతే అధికవడ్డీలు వసూళ్లు చేయాల్సివస్తుందని, కొత్తరుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ భయపెట్టేందుకు తెగబడ్డారు. రూ.5 లక్షలకు నెలకు రూ.5వేల వడ్డీ చెల్లించాల్సందేనంటూ బెదిరింపులకు సైతం దిగి 98 శాతం రుణాలను ముక్కుపిండి వసూలు చేశారు. బకాయిల‘కొండ’ జిల్లాలో మొత్తం 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 కుంబంధించి రూ.1513 కోట్లు ఇవ్వగా 2013-14లకు రూ.1387 కోట్లు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో రూ.157 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గడువులోపు చెల్లించక నిలిచిపోయిన బకాయిలు మరో రూ.55 కోట్లు ఉంది. మొత్తంగా పాత బకాయిలు 1,596 కోట్లు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.10వేలు ఏమైంది బాబూ.. సీఎం హామీలు.. నీటిమూటల్లా మారాయి. ఒక్కో మహిళకు రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికారు. ఆయనపాలన ఏడాదిగడుస్తున్నా పైసా ఇవ్వలేదు. జిల్లాలో 7లక్షల 80 వేల మంది సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల వంతున మొత్తం రూ.780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించలేక టీడీపీ ప్రభుత్వం చతికిల పడింది. పైసా పుడితే ఒట్టు గత ఏడాది జిల్లాలోని 39,225 గ్రూపులకు రూ.1,513 కోట్లు రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 19,377 గ్రూపులకు రుణాలు ఇవ్వలేదు. ఏప్రిల్ తరువాత ఈ ఏడాదికిగాను బ్యాంకులు ఒక్క పైసా రుణం ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గత ఏడాది జిల్లాలోని 39,225 గ్రూపులకు రూ.1,513 కోట్లు రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 19,377 గ్రూపులకు రుణాలు ఇవ్వలేదు. ఏప్రిల్ తరువాత ఈ ఏడాదికి గాను బ్యాంకులు ఒక్క పైసా రుణం ఇవ్వలేదు.