సాక్షి, అమరావతి: యువతరం ఆలోచనలను ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామికవేత్తలుగా రాణించే నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి చేయూతనిచ్చేలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెలెక్ట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ లాంటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు.
ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విశాఖ కేంద్రంగా ఐ–స్పేస్ పేరుతో మల్టీ డొమైన్ ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఒక ఆలోచనను పూర్తిస్థాయి వ్యాపార ఆవిష్కరణగా మార్చడానికి అవసరమైన ఆర్ అండ్ డీ, కటింగ్ ఎడ్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రోడక్ట్ వాలిడేషన్, ఉత్పత్తి పరిశీలన లాంటి వ్యవస్థలన్నీ ఒకచోట ఉండేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
తొలిదశలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐ స్పేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇంక్యుబేటర్స్, కో వర్కింగ్ స్పేస్, ఏంజెల్/వెంచర్ క్యాపిటలిస్ట్‌లను అందుబాటులో ఉంచడంతోపాటు చేయూతనిచ్చే విధంగా మెంటార్స్, టెక్నోప్రెన్యూర్స్ ఉంటారు. వీటితోపాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, పేటెంట్ రిజిస్ట్రేషన్స్, లీగల్ సర్వీసెస్, ఫండ్ సోర్సింగ్, ప్యాకేజింగ్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
కార్పస్ ఫండ్
స్టార్టప్‌లకు అవసరమైన సీడ్ క్యాపిటల్ సాయం అందించేందుకు ప్రభుత్వం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ (ఆర్ అండ్ డీ) ఏర్పాటును ప్రోత్సహించనుంది. ఆర్‌అండ్‌డీ సెంటర్ల కోసం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఆర్ అండ్ డీ ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్స్ వ్యయంలో 50 శాతం వరకు, గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రీయింబర్స్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment