సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షే మమే ధ్యేయంగా ఎన్నికల వరాలను ప్రకటిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరో 2 కీలక ప్రకటనలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ మేని ఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ వెల్ల డించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా రూ.4వేల కోట్లతో రైతు కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
గాంధీభవన్‌లో రాజనర్సింహ అధ్యక్షతన గురువారం జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కన్వీనర్ ఎం.కె.గౌడ్, సభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, గంగారాం, కూన శ్రీశైలం గౌడ్, ఇందిరా శోభన్ పాల్గొన్నారు. రాజనర్సింహ విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగ వర్గాల్లో చాలా డిమాండ్ ఉందని, ఈ సమస్యపై మేనిఫెస్టో కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సీపీఎస్‌ను రద్దు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఉద్యోగులతో చర్చించి మధ్యంతర భృతిని వారికి అనుకూలంగా ప్రకటిస్తామని, పీఆర్సీ విషయంలో న్యాయం చేస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాలు పర్యటించి భాగస్వాములతో మాట్లాడి, నివేదికలు తీసుకున్న తర్వాతే ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తామన్నారు. వారం పదిరోజుల్లో మేనిఫెస్టో సిద్ధం చేసి అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తామన్నారు.
వందలాది వినతులు వస్తున్నాయి
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ గత మూడు రోజులుగా గాంధీభవన్‌లో అందుబాటులో ఉండి అన్ని వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తోందని, వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయని రాజనర్సింహ చెప్పారు. ఏపీ కార్మిక సంక్షేమ మండలి తరహాలో అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలని, ఈబీసీ కార్పొరేషన్, వికలాంగులకు పింఛన్లు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, ఇళ్లు, రిజర్వేషన్లు ఇవ్వాలని, విదేశీవిద్యకు నిధుల కేటాయింపు, సాక్షరతా భారత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జూనియర్, డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గురుకుల పాఠశాలల్లో వార్డెన్ వ్యవస్థ ఏర్పాటు, కమలనాథన్ కమిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణకు చెందిన 600 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు, 350 మందికి పైగా నాన్‌గెజిటెడ్ అధికారులు మళ్లీ తెలంగాణకు రాక లాంటి అంశాలపై గురువారం మేనిఫెస్టో కమిటీకి వినతిపత్రాలు వచ్చినట్టు ఆయన తెలిపారు.
నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష
మేనిఫెస్టో కమిటీ భేటీలో భాగంగా వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన నాలుగు సబ్‌కమిటీలతో సమీక్ష జరిగింది. బీసీ, ఈబీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, పారిశ్రామిక విధానం, మైనార్టీ సంక్షేమంపై ఏర్పాటు చేసిన కమిటీలతో పలు ప్రతిపాదనలపై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కమిటీలు నివేదికలు సమర్పించిన అనంతరం మరోమారు ఆ ప్రతిపాదనలపై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేనిఫెస్టో
తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 700 వీఆర్వో పోస్టులకు 11లక్షల మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 4.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ మేనిఫెస్టో తయారవుతోందన్నారు.
యువతలోని ప్రతిభను వెలికితీసి వారికి ఉపాధి కల్పించేందుకు గాను మండల స్థాయిలో నైపుణ్య వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న నిర్మాణ రంగ పరిశ్రమలు, ఎంఎన్‌సీలు ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇస్తే ఆయా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా డీఎస్సీ లేక, ఉద్యోగ భర్తీలు లేక యువత అల్లాడిపోతోందని, యువత త్యాగాల పునాదుల మీదే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని టీఆర్‌ఎస్ మరచిపోయిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment