సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016, జనవరి నెలలో ‘స్టార్టప్ ఇండియా’ పేరిట కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో ఔత్సాహికులను అన్ని విధాలుగా ప్రోత్సహించి భారత్‌ను అతిపెద్ద పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చేయడం ఈ విధానం లక్ష్యం. దీని కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు మోదీ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలతో ఓ కార్పస్ నిధిని కూడా ఏర్పాటు చేసింది.
స్టార్టప్ ఇండియా కింద పన్ను మినహాయింపులను ఇవ్వడంతోపాటు అనేక రాయితీలను కల్పించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుగుణంగా నిధులను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన కార్పస్ నిధి నుంచి నిధులను అందించే బాధ్యతను భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు అప్పగించింది. కార్పస్ నిధి కింద ఏర్పాటు చేసిన పదివేల కోట్ల రూపాయలను నాలుగేళ్ల కాలంలో ఖర్చుచేయాల్సి ఉంది. ఈ స్టార్టప్ ఇండియా పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్సాహాన్ని చూపాయి. దీన్ని ప్రారంభించి ఇప్పటికీ దాదాపు రెండేళ్లు కావొస్తుండగా, కేవలం 33 వేల స్టార్టప్‌ల ఏర్పాటుకే ఔత్సాహికవేత్తలు ముందుకు వచ్చారు.
వాటిలో డిసెంబర్ 18వ తేదీ నాటికి 75 స్టార్టప్ కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చాయి. వాటికి దాదాపు 605 కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్ కింద విడుదల చేయడానికి అంగీకరించిన బ్యాంకు రూ.90.62 కోట్లను మాత్రమే విడుదల చేసింది. అందుకు బదులుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దాదాపు 337 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఈ వివరాలను వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి ఈనెల 18న లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. నాలుగేళ్ల కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయంగా అందించేందుకు పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించగా, రెండేళ్ల కాలంలో కేవలం రూ. 605 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు అందడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం 33 వేల స్టార్టప్ కంపెనీలు కార్యరూపం దాలుస్తాయని భావిస్తే 75 కంపెనీలే రావడాన్ని ఎలా పరిశీలించాలి?
Comments
Please login to add a commentAdd a comment