తెలంగాణపై బడ్జెట్ ఎఫెక్ట్...
‘ఉపాధి’కి ఊతం
‘ఉపాధి’వేతన చెల్లింపులకు రూ.3,500 కోట్లు మంజూరయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి కేంద్రం తాజా బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్రంలో ఉపాధి పనులకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. గతేడాది కన్నా రూ.10 వేల కోట్లు అధికంగా కేటాయించడం పట్ల గ్రామీణాభివృద్ధి శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజా కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆ శాఖ సిబ్బంది చెబుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీల వేతనాలకు రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తుండగా, వచ్చే ఏడాది రూ.3 వేల కోట్ల నుంచి రూ3,500 కోట్ల దాకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులను అధికంగా చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉన్నందున కేటాయింపులు అధికంగా రావొచ్చని చెబుతున్నారు. పనిదినాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించడం గమనార్హం.
నీటి సంరక్షణపైనే ఫోకస్!
వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటి సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ కుంటలు, కాంటూర్ ట్యాంక్స్, చెరువుల పూడికతీత.. తదితర నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. శాశ్వత ఆస్తుల కల్పనలో భాగంగా అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిమెంట్‌రోడ్డు, పాఠశాలల్లో కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. – బి.సైదులు, జాయింట్ కమిషనర్ (ఉపాధిహామీ)
సాగు ప్రాజెక్టుల రుణాలకు వెసులుబాటు
కార్పస్ ఫండ్ పెంపుతో తగిన స్థాయిలో రుణాలు అందే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాగునీటి ప్రాజెక్టులకు చేయూత నిచ్చేలా ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నాబార్డు కింద ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్‌ను రూ.20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచనుండడంతో ఆ మేరకు రాష్ట్రాలకు రుణ వెసులుబాటు కలుగుతుందని పేర్కొంటున్నాయి. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్రం గుర్తించిన 11 తెలంగాణ ప్రాజెక్టుల కోసం తగినన్ని రుణాలు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నాయి.
వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం కోసం కేంద్రం గతేడాదే దీర్ఘకాలిక సాగునీటి నిధి (ఎల్‌టీఐఎఫ్) కింద రూ.20 వేల కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కానీ దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్‌ఆర్‌ఎస్పీ రెండోదశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమ్రం భీమ్, జగన్నాథపూర్, పెద్దవాగు, గొల్లవాగు, వరద కాలువలకు ఎలాంటి రుణాలూ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ కార్పొరేషన్ కు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితితో సంబంధం లేకుండా రూ.7,900 కోట్లు రుణాలు ఇవ్వాలని కోరగా.. నాబార్డు అంగీకరించింది కూడా. తాజాగా కార్పస్ ఫండ్‌ను పెంచడంతో కాళేశ్వరం కార్పొరేషన్ కింద రుణాలు తీసుకునే వెసులుబాటు దొరకనుంది. పీఎంకేఎస్‌వై కమిటీలో మంత్రి హరీశ్‌రావు సభ్యుడిగా ఉండటం సైతం రాష్ట్రానికి కలిసిరానుంది.
హైదరాబాద్ ఐఐటీకి 75 కోట్లు
గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐఐటీకి ఎంప్లాయి అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద రూ. 75 కోట్లు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించింది. విభజన చట్టం హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ. 10 కోట్లు కేటాయించింది. ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ బ్లాక్‌లకు (ఈబీబీ) కేటాయించే ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని 317 ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎ్ టీఏ) ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కూడా జేఈఈ మెయిన్ పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే నిర్వహించనున్నారు.
గర్భిణులకు రూ.15 వేల ప్రోత్సాహకం
రాష్ట్ర ప్రభుత్వం యోచన.. కేంద్ర బడ్జెట్‌లో రూ.6 వేలు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సా హకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రూపొందిస్తున్నాయి. బుధవారం కేంద్రం తన బడ్జెట్‌లో గర్భిణులకు రూ. 6 వేలు కేటాయించింది. అంటే కేంద్రం నుంచి రూ.6వేలు వస్తే... రాష్ట్రం రూ.9 వేలు కేటాయిస్తే సరిపోతుంది. గర్భిణులకు ఇంత భారీగా ప్రోత్సాహకం అందించే రాష్ట్రం మనదే కానుండటం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో గర్భిణులకు రూ. వెయ్యి ప్రోత్సాహకంగా ఇస్తున్న సంగతి తెలిసిందే.
ప్రత్యేకంగా 347 డెలివరీ పాయింట్లు...
రాష్ట్రంలో గుర్తించిన 347 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో ప్రత్యేకంగా కాన్పు కోసం డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని 24 గంటలూ పనిచేసే ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతారు. ముగ్గురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ప్రత్యేక డెలివరీ గదులను అందుబాటులోకి తీసుకొస్తారు. తద్వారా గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా కృషి చేయాలని నిర్ణయించారు.
ఉపకారానికి చేయూత
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి నిధులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్డెట్‌లో విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటిం చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పాఠశాల (ప్రీమెట్రిక్) విద్యార్థులకు సైతం ఉపకార వేతనాలు అందనున్నాయి. మోదీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇందులో భాగంగా 2017–18 వార్షిక బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసింది. ఉపకార వేతనాల కింద మైనార్టీ సంక్షేమానికి రూ.1500 కోట్లు, ఎస్సీ సంక్షేమం కింద రూ.3,397 కోట్లు, బీసీ విద్యార్థుల కోసం 1,027 కోట్లు, గిరిజన సంక్షేమం కింద రూ.1,612.07 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో బీసీ విద్యార్థులకు పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు దక్కనున్నాయి.