సాక్షి, అమరావతి: ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు వరుస ప్రకృతి వైపరీత్యాలు.. అయినా, వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధించింది. దిగుబడులు పెరిగాయి. రైతు మోములో నవ్వు విరిసింది. పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో రాష్ట్రంలో రైతన్నలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రం కరువుతో అల్లాడింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవసాయానికి చేయూతనిచ్చారు. రైతన్నకు అండదండగా నిలిచారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో నదీజలాలు పుష్కలంగా లభించాయి.
ఆ నీటిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా వినియోగించింది. ప్రాజెక్టులు, చెరువుల నిండుగా నీరుండేలా చర్యలు తీసుకుంది. రైతులకు పంటలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది. దీంతో రైతులు రికార్డు స్థాయి దిగుబడులతో చరిత్ర సృష్టిస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా వస్తున్న దిగుబడులే ఇందుకు నిదర్శనం. 2021–22 సీజన్‌లో సైతం రికార్డుస్థాయిలో దిగుబడులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆరి్ధక సర్వే వెల్లడించింది.
2019–20 సీజన్‌లో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చాయి. 312 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. ఇవి 2014–18 మధ్య కాలంలో వచ్చిన దిగుబడుల కన్నా చాలా అధికం. కరోనాకు తోడు వైపరీత్యాల ప్రభావంతో 2020–21 సీజన్‌లో కాస్త తగ్గినప్పటికీ, టీడీపీ హయాంతో పోల్చుకుంటే మెరుగ్గానే దిగుబడులొచ్చాయి. ఆ సీజన్‌లో 165.04 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 307 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొచ్చాయి. 2021–22 సీజన్‌లో కూడా వరదలు, వైపరీత్యాలు కలవర పెట్టినప్పటికీ దిగుబడులపై పెద్దగా ప్రభావం చూపలేదు.169.57 లక్షల ఆహారధాన్యాలు, 314 లక్షల టన్నుల ఉద్యాన పంటల దిగుబడులొస్తాయని అంచనావేశారు. ముఖ్యంగా ధాన్యం దిగుబడులు 2020–21లో 130.89 లక్షల టన్నులు కాగా, 2021–22 సీజన్‌లో 135.24 లక్షల టన్నులు వస్తాయని అంచనా.
పాడి ఉత్పత్తులను పరిశీలిస్తే 2019–20లో పాలు 152.63 లక్షల టన్నులు, 8.5 లక్షల టన్నుల మాంసం, 2170.77 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరిగింది. 2020–21 సీజన్‌లో పాల దిగుబడులు 3.60 శాతం తగ్గినప్పటికీ మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో 147.14 లక్షల టన్నుల పాలు, 9.54 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా, 2496.39 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరిగింది. 2021–22 సీజన్‌లో 150 లక్షల టన్నుల పాలు, 10 లక్షల టన్నులు మాంసం, 2600 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి సాధించబోతున్నట్టు అంచనా వేశారు. మత్స్య ఉత్పత్తులు 2019–20 సీజన్‌లో 41.75 లక్షల టన్నుల దిగుబడులురాగా, 2020–21లో 46.23 లక్షల టన్నులు వచ్చాయి. 2021–22 సీజన్‌లో 50.85 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి 36.12లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు వచ్చాయని ఆరి్థక సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment