శరణార్థులతో ఆర్థిక వ్యవస్థకు మేలే!
లాస్ ఏంజెలిస్: శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే ఆర్థికంగా భారం అవుతారని పరిగణించటం రివాజు. అయితే.. శరణార్థులు, ప్రత్యేకించి డబ్బు రూపేణా సాయం పొందే వారు.. నిజానికి తమకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి ఆర్థికంగా గణనీయమైన బలాన్నిస్తారని ఓ అధ్యయనంలో గుర్తించారు. శరణార్థుల వల్ల ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలు.. వారికి విరాళమిచ్చిన సాయంకన్నా గణనీయంగా అధికంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్(యూసీ డేవిస్) పరిశోధకులు పేర్కొన్నారు. కాంగో శరణార్థులకు ఆశ్రయమిచ్చిన రువాండాలోని మూడు శరణార్థి శిబిరాల ఆర్థిక ప్రభావాన్నిఅధ్యయనంలో పరిశీలించారు. ఇందులో రెండు శిబిరాల్లోని శరణార్థులకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం నుంచి ఆర్థిక సాయం అందింది.
అలాగే మూడో శిబిరంలోని శరణార్థులకూ అదే మొత్తంలో సాయం ఆహారం రూపంలో అందింది. ఈ మూడు శిబిరాల్లోని శరణార్థుల ప్రభావం ఆశ్రయమిచ్చిన దేశంపై ఎలా ఉందనే అంశంపై ఆ శిబిరాల చుట్టూ పది కి.మీ. పరిధిలో ఆర్థిక సర్వే నిర్వహించారు. ఆహార రూపంలో ఇచ్చిన సాయం కన్నా.. డబ్బు రూపంలో చేసిన సాయం ఆశ్రయమిచ్చిన దేశంపై అత్యధిక సానుకూల ప్రభావం చూపించిందని కనుగొన్నారు. డబ్బు సాయం అందుకున్న శిబిరాల్లోని శరణార్థులు, అక్కడి వ్యాపారులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపారాలు, ఇళ్ల నుంచి వస్తువులు, సేవలు కొనుగోలు చేయటం ద్వారా.. ఆ ప్రాంతంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరగటానికి దోహదపడ్డారని గుర్తించారు. ఈ ప్రాంతంలో వాణిజ్యం పెరగటం ద్వారా.. ఆ ప్రాంతం నుంచి మిగతా దేశంలోని వాణిజ్యానికి కూడా డిమాండ్ పెరిగి వాణిజ్యం పెరిగిందని అధ్యయనంలో వివరించారు.