సర్వే రోజు ఇంట్లో ఉండాల్సిందే
* టీ సర్కార్ స్పష్టీకరణ
* హాస్టల్స్‌లో చదువుకుంటున్న
* విద్యార్థులకు మాత్రం మినహాయింపు
* హైదరాబాద్ సహా... రాష్ట్రమంతటా ఈనెల 19న ఒకే రోజు సర్వే
* విదేశాలకు వెళ్లినవారు, వలసలు వెళ్లినవారు అవసరం అనుకుంటే రావచ్చు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 19న జరిగే సమగ్ర ఇంటింటి సర్వే రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకరో, ఇద్దరో ఉండి వివరాలు చెబుతామంటే కుదరదని వెల్లడించింది. కేవలం హాస్టళ్లలోని విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని, అయితే వారు హాస్టల్‌లో ఉన్నట్లు రుజువులు ఇవ్వాలని, ఆ విద్యార్థులు ఏ హాస్టల్లో చదువుతున్నారో నమోదు చేసుకుంటామని స్పష్టం చేసింది.
శుక్రవారం రెండున్నర గంటలపాటు సర్వేపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ‘సెర్ప్’ సీఈ వో మురళీలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తరువాత రేమండ్ పీటర్ తనను కలసిన విలేకరులతో మాట్లాడారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రయోజనం పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందించడానికి యత్నిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఏవిధమైన పథకాలు ప్రవేశపెట్టాలన్నా.. దానికి సమగ్ర సమాచారం ఉంటేనే.. ఆ కార్యక్రమాలు ఫలవంతం అవుతాయని రేమండ్ పీటర్ వివరించారు. రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరయ్యాక... వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల.. వారికి రావాల్సిన పెన్షన్, రేషన్‌ను మధ్య దళారీలు తినేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులున్నా అనేకమంది వివిధ కారణాలతో సరుకులు తీసుకోవడం లేదని, వారిపేరుతో దళారీలు వాటిని దోచుకుంటున్నారని, ఇలాంటి వాటిని తొలగించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు.
సూరత్, ముంబై వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్న వారికి.. ఇక్కడ సంక్షేమ పథకాలతో అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు మొత్తం సర్వే నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోల సమావేశంలో విడుదల చేసిన సర్వే ఫార్మాట్‌కు ఆ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేశామని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, శనివారం సర్వే తుది ఫార్మాట్‌ను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడతామని ఆయన వివరించారు.
స్థానికతకు.. సర్వేకు సంబంధం లేదు: రేమండ్ పీటర్
సమగ్ర ఇంటింటి సర్వేకు స్థానికతకు ఏమాత్రం సంబంధం లేదని రేమండ్ పీటర్ వెల్లడించారు. సర్వే ఫార్మాట్‌లో ఏ రాష్ట్రం నుంచి వచ్చారు..? ఎంతకాలం నుంచి ఉంటున్నారు..? వంటి ప్రశ్నలు ఉండబోవని స్పష్టం చేశారు.
కాగా, కలెక్టర్ల సదస్సు సమయంలో మహ బూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలంలో బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఎక్కువగా ఉన్నారని, మరి వారి పేర్లను, రాష్ట్రాన్ని నమోదు చేయాలా.? అని జిల్లా కలెక్టర్ సందేహం వ్యక్తం చేయడంతో.. నమోదు చేయాలని భావించి, సవరించిన ఫార్మాట్‌ను జిల్లాలకు పంపించారు. కాని ఆ తరువాత అది వివాదాస్పదమవుతుండటంతో తుది ఫార్మాట్‌లో ఆ కాలాన్ని తొలగించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని తుది ఫార్మాట్ ఇస్తున్నట్లు రేమండ్ పీటర్ వివరించారు.