Telangana Govt Survey
-
ఏపీ ఉద్యోగుల అవసరం లేదు: టీఎన్జీవో
హైదరాబాద్: తెలంగాణలో నిరహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అవసరంలేదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సర్వేను పూర్తి చేసే శక్తి తెలంగాణ ఉద్యోగులకు ఉందని ఆయన తెలిపారు. ఈనెల 19న సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంటింటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిబ్బందికి విధులు అప్పగించడమేమిటని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. తమ ఉద్యోగులకు డ్యూటీ వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది. -
'తెలంగాణ సర్వేలో పాల్గొనం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సామాజిక, ఆర్థిక సర్వేలో ఆంధ్ర ఉద్యగోలు పాల్గొనరని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. సర్వేలో పాల్గొనాలని 22 మంది ఆంధ్ర ఉద్యోగులకు జీహెచ్ఎంసీ కమిషనర్ నోటీసులు పంపారని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబితేనే సర్వేలో పాల్గొంటామని చెప్పారు. ఆంధ్ర ఉద్యోగులపై నమ్మకం లేనప్పుడు సర్వేకు హాజరు కావాలని ఎలా కోరుతారని వారు ప్రశ్నించారు. ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి సంగతి తెలిసిందే. -
వివాదాల సుడిగుండంలో ఇంటింటి సర్వే!
* బతుకుదెరువు కోసం వెళ్లిన లక్షలాది జనం * సూరత్, భీవండితోపాటు గల్ఫ్ దేశాలకూ వలసలు * సుదూర ప్రాంతాల్లో గొర్రెలకాపర్లు, కూలీలు * ఒక్కరోజులో సర్వే ఎలా సాధ్యమవుతుంది? * ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ప్రతిపక్షాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఇంటింటి సర్వేను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నెల 19న ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏ గ్రామానికి చెందిన వారు ఆ గ్రామంలో లేకుంటే ప్రభుత్వం, సంక్షేమ పథకాల లెక్కల్లో లేనట్టేనని హెచ్చరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, అత్యవసర విధుల్లో ఉన్నవారు, పొట్టకూటి కోసం వివిధ వృత్తులవారు రోజుల తరబడీ, నెలల తరబడీ ఊరికి దూరంగా వెళ్తుం టారు. ఆ ఒక్కరోజు వ్యక్తిగతంగా వెళ్లలేకపోతే జీవితాంతం నష్టపోవాల్సిందేనా? అని వారు భయాందోళన చెందుతున్నారు. ఉదాహరణకు.. తెలంగాణలో గణనీయంగా గొర్రెల కాపరులు దూరప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు వరుసగా ఐదారు నెలల పాటు వలస వెళ్తారు. మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెల మంద(జీవాల)ను ఇటు కరీంనగర్ నుంచి అటు గుంటూరులాంటి జిల్లాలకు కాలినడకన కొట్టుకుని పోతారు. ఇంటింటి సర్వే విషయంపై వీరికి కనీసం సమాచారం అందే అవకాశమే తక్కువ. ఒకవేళ ఇప్పుడున్న సెల్ఫోన్ల వంటి సమాచార వ్యవస్థ వల్ల సమాచారం అందినా.. గొర్రెల మందను ఎక్కడో విడిచిపెట్టి స్వంత గ్రామాలకు చేరడం సాధ్యం కాదు. హైదరాబాద్, ఇతర పట్టణాలకు కూలీ పనులు, చిన్న జీతాల కోసం వెళ్లినవారికీ ఆ ఒక్కరోజే ఊరికి వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఆస్పత్రుల్లో ఉన్నవారి సంగతి...? అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, వారికి అటెం డెంట్లుగా ఉన్నవారు వ్యక్తిగతంగా హాజరు కావడానికి అవకాశం లేదు. వైద్యం, ఫైరింగ్, పోలీసు వంటి అత్యవసర ఉద్యోగాల్లో ఉన్నవారూ వ్యక్తిగతంగా హాజరు కావడం చాలా కష్టం. మీడియాలో పనిచేస్తున్నవారు కూడా స్వంత గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందే. అందరికీ ఒకేరోజు సెలవు ఇస్తే ఆస్పత్రులు, మీడియా వంటి సంస్థలు ఎలా నడుస్తాయి? స్వంత గ్రామాల్లోనే వీరి వివరాలను నమోదు చేసుకోవాలనుకున్నవారు వీటిపై సతమతమవుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని వారెట్లా..? పొట్ట చేతపట్టుకుని దుబాయ్‌కి వలస వెళ్లినవారు కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల నుంచి ఎందరో ఉన్నారు. సూరత్ (గుజరాత్), భీవండి (మహారాష్ట్ర) లాంటి ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేయడానికి తెలంగాణ జిల్లాల్లోని వేలాది కుటుంబాలు వలస వెళ్లాయి. కాళ్లుచేతుల్లో సత్తువ ఉన్నంతకాలం రెక్కల కష్టంతో కొంత సంపాదించుకుని, సొంత గ్రామంలోనే స్థిరపడాలని చాలామంది కోరుకుంటున్నారు. వీరంతా ఒకేరోజు రావాలంటే రవాణా సదుపాయాలు సాధ్యం కావడం లేదు. వీరిలో కొందరికి సమాచారం లేకపోగా మరికొందరికి ఇదేంటో అర్థం కావడం లేదు. కచ్చితంగా సొంత గ్రామానికి రావాలని కోరుకుంటున్నవారికి రైలు టికెట్లు దొరకడం లేదు. ఇప్పటికే సూరత్ నుంచి వచ్చే రైళ్లకు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇక విదేశాల్లో ఉన్నవారికి విషయం తెలిసినా ఒక్కరోజు కోసం రావడం సాధ్యమేనా? అనే అనుమానాలు ముప్పిరి గొంటున్నాయి. అప్పోసప్పో చేసి విదేశాలకు వెళ్లిన చిరువేతన జీవులు వేలకు వేలు ఖర్చుచేసి ఒక్కరోజుకోసం స్వంత గ్రామానికి రావాలంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా.. ఒక్కరోజే ఈ సర్వే అంటే ఎలా సాధ్యమని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. -
సర్వే రోజు ఇంట్లో ఉండాల్సిందే
-
సర్వే రోజు ఇంట్లో ఉండాల్సిందే
* టీ సర్కార్ స్పష్టీకరణ * హాస్టల్స్‌లో చదువుకుంటున్న * విద్యార్థులకు మాత్రం మినహాయింపు * హైదరాబాద్ సహా... రాష్ట్రమంతటా ఈనెల 19న ఒకే రోజు సర్వే * విదేశాలకు వెళ్లినవారు, వలసలు వెళ్లినవారు అవసరం అనుకుంటే రావచ్చు సాక్షి, హైదరాబాద్: ఈనెల 19న జరిగే సమగ్ర ఇంటింటి సర్వే రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకరో, ఇద్దరో ఉండి వివరాలు చెబుతామంటే కుదరదని వెల్లడించింది. కేవలం హాస్టళ్లలోని విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని, అయితే వారు హాస్టల్లో ఉన్నట్లు రుజువులు ఇవ్వాలని, ఆ విద్యార్థులు ఏ హాస్టల్లో చదువుతున్నారో నమోదు చేసుకుంటామని స్పష్టం చేసింది. శుక్రవారం రెండున్నర గంటలపాటు సర్వేపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ‘సెర్ప్’ సీఈ వో మురళీలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తరువాత రేమండ్ పీటర్ తనను కలసిన విలేకరులతో మాట్లాడారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రయోజనం పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందించడానికి యత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏవిధమైన పథకాలు ప్రవేశపెట్టాలన్నా.. దానికి సమగ్ర సమాచారం ఉంటేనే.. ఆ కార్యక్రమాలు ఫలవంతం అవుతాయని రేమండ్ పీటర్ వివరించారు. రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరయ్యాక... వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల.. వారికి రావాల్సిన పెన్షన్, రేషన్‌ను మధ్య దళారీలు తినేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులున్నా అనేకమంది వివిధ కారణాలతో సరుకులు తీసుకోవడం లేదని, వారిపేరుతో దళారీలు వాటిని దోచుకుంటున్నారని, ఇలాంటి వాటిని తొలగించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. సూరత్, ముంబై వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్న వారికి.. ఇక్కడ సంక్షేమ పథకాలతో అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు మొత్తం సర్వే నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోల సమావేశంలో విడుదల చేసిన సర్వే ఫార్మాట్‌కు ఆ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేశామని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, శనివారం సర్వే తుది ఫార్మాట్‌ను ప్రభుత్వ వెబ్సైట్లో పెడతామని ఆయన వివరించారు. స్థానికతకు.. సర్వేకు సంబంధం లేదు: రేమండ్ పీటర్ సమగ్ర ఇంటింటి సర్వేకు స్థానికతకు ఏమాత్రం సంబంధం లేదని రేమండ్ పీటర్ వెల్లడించారు. సర్వే ఫార్మాట్లో ఏ రాష్ట్రం నుంచి వచ్చారు..? ఎంతకాలం నుంచి ఉంటున్నారు..? వంటి ప్రశ్నలు ఉండబోవని స్పష్టం చేశారు. కాగా, కలెక్టర్ల సదస్సు సమయంలో మహ బూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలంలో బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఎక్కువగా ఉన్నారని, మరి వారి పేర్లను, రాష్ట్రాన్ని నమోదు చేయాలా.? అని జిల్లా కలెక్టర్ సందేహం వ్యక్తం చేయడంతో.. నమోదు చేయాలని భావించి, సవరించిన ఫార్మాట్‌ను జిల్లాలకు పంపించారు. కాని ఆ తరువాత అది వివాదాస్పదమవుతుండటంతో తుది ఫార్మాట్లో ఆ కాలాన్ని తొలగించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని తుది ఫార్మాట్ ఇస్తున్నట్లు రేమండ్ పీటర్ వివరించారు.