ఈ ఏడాది 5.5% వృద్ధి రేటు | RBI pegs growth rate at 5.5% in current fiscal | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 5.5% వృద్ధి రేటు

Published Fri, Aug 22 2014 12:44 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

ఈ ఏడాది 5.5% వృద్ధి రేటు - Sakshi

ఈ ఏడాది 5.5% వృద్ధి రేటు

 ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న సంకేతాలు కనబడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పేర్కొంది. ప్రస్తుతం 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5.5-6 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. 2013-14 ఏడాదికి సంబంధించి గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాలు పుంజుకుంటుండటం, పెట్టుబడులు కూడా క్రమంగా మెరుగవుతుండటం వంటివి ఇందుకు దోహదం చేయనున్నాయని తెలిపింది. ‘ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం చర్యలతో ప్రైవేటు రంగానికి తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రానున్నాయి.

అంతేకాకుండా.. ఎగుమతుల వృద్ధిబాట, అంతర్జాతీయ కమోడిటీ ధరల స్థిరీకరణ వంటివి కూడా దేశీ ఆర్థిక వ్యవస్థ రికవరీకి చేదోడుగా నిలిచే అంశాలు’ అని ఆర్‌బీఐ వివరించింది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థి రికవరీ నెమ్మదించడం, మిగతా సీజన్‌లో కూడా వర్షాలు ముఖం చాటేయడం, వివిధ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, ఘర్షణలు మరింత పెరగడం వంటివి జరిగితే.. భారత్ వృద్ధి దిగజారే రిస్క్‌లు కూడా పొంచిఉన్నాయని హెచ్చరించింది. 2013-14 ఏడాదికి తాజాగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కూడా ఈ ఏడాది వృద్ధి రేటు 5.4-5.9 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

 ద్రవ్యోల్బణం అంచనాల్లో మార్పు లేదు...
 ఈ ఏడాది ఆరంభంలో తాము నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణం అంచనాల్లో ఎలాంటి మార్పులు లేవని ఆర్‌బీఐ పేర్కొంది. 2015 జనవరి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 8 శాతానికి, 2016 జనవరికల్లా 6 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. ఏప్రిల్, మే నెలల్లో 7.5 శాతం స్థాయికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. జూలైలో మళ్లీ 8 శాతానికి ఎగబాకింది. దీనికి ప్రధానంగా రుతుపవన వర్షపాతంలో కొరత ప్రభావంతో కూరగాయల ధరలు భారీగా పెరగడమే కారణం. అయితే, ఇది తాత్కాలికమేనని.. రానున్న రోజుల్లో రేట్లు దిగొచ్చే సంకేతాలు ఉన్నాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం కట్టడికే తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామని కూడా స్పష్టం చేసింది.

 తగ్గనున్న లోట్లు...
 ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో ద్రవ్యలోటు తగ్గుముఖం పట్టనుందని పేర్కొంది. కొద్ది నెలలుగా విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనే స్థితిలో ఉన్నట్లు నివేదికలో తెలిపింది. ఆగస్టు 6తో ముగిసిన వారాంతానికి దేశ ఫారెక్స్ నిల్వలు అంతక్రితం వారంతో పోలిస్తే కొద్దిగా పెరిగి 319 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ నిల్వలు 282.45 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ద్రవ్యలోటును జీడీపీలో 4.1 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కాగా, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గతేడాదితో పోలిస్తే(జీడీపీలో 1.7 శాతం, 32.4 బిలియన్ డాలర్లు) ఈ సంవత్సరం పెరిగే అవకాశాలున్నాయని.. అయినాకూడా తట్టుకోగల స్థాయిలోనే ఉండొచ్చని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. అమెరికాలో సహాయ ప్యాకేజీల కోత పరిణామాలను ఎదుర్కొనేందుకు వర్ధమాన దేశాలు పాలసీపరంగా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. అదేవిధంగా విధానపరమైన చర్యల విషయంలో దిగ్గజ సెంట్రల్ బ్యాంకుల మధ్య మరింత సమన్వయం ఉండాలన్న వాదనను మరోసారి వినిపించింది.

 సింగిల్ గ్రూప్ రుణ పరిమితిపై సమీక్ష...
 దేశీ బ్యాంకులు ఒక నిర్దిష్ట విభాగానికి(సింగిల్ గ్రూప్) ఇచ్చే రుణ పరిమితి(40 శాతం) చాలా ఎక్కువగా ఉందని.. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించడంపై(బాసెల్ నిబంధనల ప్రకారం టైర్-1 మూలధనంలో 25 శాతానికి) ఈ ఏడాది సమీక్ష జరపనున్నట్లు కూడా ఆర్‌బీఐ పేర్కొంది. 40% మేర ప్రాధాన్య రంగ రుణ కేటాయింపులు జరపాలన్న నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందని నివేదికలో అభిప్రాయపడింది. ఒకే గ్రూపునకు ఇంత భారీగా రుణాలిచ్చినప్పుడు ఒకవేళ అనుకోని ప్రతికూలతలు ఎదురైతే బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. ఈ రిస్క్‌లను తగ్గించేందుకు పరిమితి కుదింపుపై దృష్టిపెడుతున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement