ఆడవాళ్లు చేలోకి రాకుండా, ఆడవాళ్ల చేతుల్లోకి పొలాలు రాకుండా మున్ముందు ఈ భూమి బతికి బట్టకట్టడం కష్టమేనని ‘ఎకనమిక్ సర్వే’ తేల్చి చెప్పాక కూడా మన ప్రభుత్వాలింకా మహిళల్ని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు, మైక్రో క్రెడిట్ స్కీములకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి!
రెండు జల్లులు పడితేనే నాలుగ్గింజలు పండుతాయి. ఆ రెండు జల్లులైనా సమయానికి పడాలి. సమయానికి ఆగిపోవాలి. వాన అవసరమైనప్పుడే వచ్చి, అవసరమైనంత వరకే ఉండి వెళ్లిపోవడం రైతుకి దేవుడు చేసే పెద్ద సాయం. అంత సాయం చేశాక కూడా జీవుడు ఆ నాలుగ్గింజలే పండిస్తే ఏం లాభం?! నాలుగు.. గుప్పెడవ్వాలి. గుప్పెడు.. గాదెలవ్వాలి. గాదెలు.. అందరి కడుపులు నింపాలి. కానీ అలా అవ్వట్లేదు. ‘ఇంత ముద్ద ఉంటే పెట్టు తల్లీ’ అని జనాభాలో ఒక్కరైనా భిక్షపాత్ర పట్టకుండా లేరు! ఎలా మరి ఈ దేశాన్ని అక్షయపాత్రగా మార్చి, అందరికీ వడ్డించడం? నీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం.
మంచి విత్తనాలు వేసుకుంటున్నాం. ఎరువుల్ని సాత్వికంగా మార్చుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా ‘ఫార్మర్–ఫ్రెండ్లీ’ అవుతున్నాయి. రుణాలిస్తున్నాయి. తీర్చలేని రైతుల రుణం తీర్చుకుంటున్నాయి. అయినా అవే నాలుగ్గింజలు. కడుపులో అవే ఆకలి మొలకలు. దేవుడు వర్షాలిచ్చినా, ప్రభుత్వాలు వరాలిచ్చినా, భూమి సారాన్నిచ్చినా, రైతు స్వేదాన్నిచ్చినా.. పండుతున్నది ఆ నాలుగే. ఇప్పుడెవరివైపు చూడాలి? దేవుడు చేయాల్సింది చేస్తున్నాడు. ప్రభుత్వాలు ఇవ్వాల్సింది ఇస్తున్నాయి. పరిశోధనలు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ ఎదిగేది ఎదుగుతూనే ఉంది.
రైతుకి ఇంకా ఎవరి సాయం కావాలి? ఎప్పుడతడు ధీమాగా కనిపిస్తాడు? ఎప్పుడతడు తలగుడ్డను విదిలించి భరోసాగా భుజంపై వేసుకుంటాడు? ఎప్పుడతడు ‘రుతుపవనమా.. టేక్ యువర్ టైమ్’ అని చుట్ట వెలిగించుకుంటాడు? ఎప్పుడతడు పెదరాయుడిలా.. ‘లోపలికెళ్లి.. అమ్మనడికి.. ఎన్నికావాలో బియ్యం తెచ్చుకోపో’ అని పనివాళ్లతో అంటాడు? ‘మీవాడు సాఫ్ట్‌వేరా? మావాడు ఫార్మర్’ అని ఎప్పుడతడు బంధువులకు చెప్పుకోగలుగుతాడు? ‘పొలం దున్నే కుర్రాడుంటే చెప్పండి. ఫారిన్ సంబంధం వద్దు’ అని ఎప్పుడతడు ఘనంగా రిజెక్ట్ చెయ్యగలుగుతాడు?
‘ఎప్పుడు?’ అంటే.. ఒక చెయ్యి అతడికి తోడుగా ఉన్నప్పుడు! అదేం అభయహస్తమూ, అదృశ్య హస్తమూ కాదు. చక్కగా పని చేసే చెయ్యి. సొంత పొలం ఉండి, సంతకానికి విలువ ఉన్న చెయ్యి. సాగునీటికి సమృద్ధిగా దోసిలి పట్టగల చెయ్యి. బ్యాంకుకెళ్లి అప్పు పుట్టించుకోగల చెయ్యి, టెక్నాలజీని వెనకాముందూ తిప్పి చూడగల చెయ్యి. శిక్షణతో పదును తిరిగే చెయ్యి. బడ్జెట్‌కి ముందొచ్చే ‘ఎకనమిక్ సర్వే’ మొన్న కుండబద్దలు కొట్టేసింది. ఆడవాళ్లు చేలోకి రాకుండా, ఆడవాళ్ల చేతుల్లోకి పొలాలు రాకుండా మున్ముందు భూమి బతికి బట్టకట్టడం కష్టమేనని చెప్పేసింది.
పండే దగ్గర్నుంచి, పంటను అమ్మే దశ వరకు.. వాళ్లక్కూడా ఒక మాట చెప్పందే, వాళ్ల సలహా తీసుకోందే దిగుబడులు ఇలాగే ఏడుస్తాయని కూడా చెప్పింది. చెప్పడం వరకు చెప్పింది. వినేవాళ్లకు వినిపించాలి. మహిళలకు సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులున్నాయి, మైక్రో క్రెడిట్ స్కీములున్నాయి కదా అంటే.. పైన ఆకాశం ఉంది. కింద భూమి ఉంది. ఇక బతకడానికి ఏమొచ్చింది? అన్నట్లే ఉంటుంది. బతకడం కాదిప్పుడు సమస్య. బతికించడం. తిండిగింజల్ని పెంచడం. సాగుబడిలో మహిళలు ఎంతెక్కువ మంది ఉంటే అంతెక్కువగా ఆకలి మంటలు చల్లారతాయని ఎఫ్.ఎ.ఒ. అంచనా వేసింది.
ఎఫ్.ఏ.ఓ.నే చెబుతున్నట్లు మహిళల వల్ల ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు మహిళలకు ప్రాముఖ్యాన్నిచ్చి, భూమినిచ్చి, పరిజ్ఞానాన్నిచ్చి, పరికరాలనిచ్చి వారి చేయూతను కోరవచ్చు. ఇవేవీ ఇవ్వకుండా ఒక్క ‘అక్టోబర్ 15’ను మాత్రం వాళ్లకిచ్చాయి. అంతర్జాతీయ మహిళారైతు దినోత్సవం అది. మంచిదే. ఆ ఉదారతతోనే కాస్త భూమిని కూడా వాళ్ల సొంతానికి వచ్చేటట్లు చెయ్యగలితే మిగతావి వాళ్లే చూసుకుంటారు. భూమి అంటే పంట. మహిళారైతుకు అది నిర్ణయాధికారం కూడా. నిర్ణయం మహిళల చేతుల్లో ఉంటే.. బియ్యపు గింజపై తన పేరు లేని మనిషే ఉండడు.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment