సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ఈనెల 19న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహణ ఏర్పాట్లలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సిన ఎన్యుమరేటర్ల ఎంపిక అస్తవ్యస్తంగా జరిగింది. వికలాంగులకు, ముఖ్యంగా చూపులేని వారికి కూడా ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేశారు. నామమాత్రంగా చదువు వచ్చే కొందరు నాలుగో తరగతి సిబ్బందికి కూడా ఈ విధులు అప్పగించారు.
ఈ ఎన్యుమరేటర్లు ఒక్కో కుటుంబానికి సంబంధించి 80కిపైగా అంశాల సమాచారం సేకరించాలి. సమర్థవంతమైన ఎన్యుమరేటర్లు సర్వే చేస్తేనే సమగ్ర సమాచారం వస్తుంది. సర్వే పకడ్బందీగా జరుగుతుంది. కానీ సర్వేలో ఎంతో కీలకమైన ఈ ఎన్యుమరేటర్ల ఎంపిక ఇష్టారాజ్యంగా జరగడంతో సమగ్ర సర్వే ప్రశ్నార్థకంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని 52 మండలాల పరిధిలోని 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలో జిల్లాలో 6.96 లక్షల కుటుంబాలు ఉన్నాయి.
కానీ ఈ సర్వే నిమిత్తం వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏలు ముందస్తుగా సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు 7.47 లక్షల కుటుంబాలున్నట్లు తేలింది. ఈ సర్వేను నిర్వహించేందుకు అధికారులు 30,800 మంది ఎన్యుమరేటర్లను గుర్తించారు. అలాగే సుమారు 3 వేల మంది అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్యుమరేటర్ల గుర్తింపులో అధికారుల నిర్లక్ష్యానికి పైన పేర్కొన్న ఉదాహరణలు అద్దం పడుతున్నాయి.
ఎంపిక జరిగిందిలా..
అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఈ సర్వే విధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నడూ లేనివిధంగా పోలీసు సిబ్బందిని కూడా ఈ సర్వేలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది జాబితాను ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలందాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరు ఈ సర్వే విధులు సమర్థవంతంగా నిర్వహించగలరా? లేదా? అనే అంశాలేవీ పట్టించుకోకుండానే ఆయా శాఖల అధికారులు ఉద్యోగులు, సిబ్బంది జాబితాను ఉన్నతాధికారులకు పంపారు.
ఈ జాబితా మేరకు రెవెన్యూ అధికారులు ఎన్యుమరేటర్లుగా గుర్తించారు. ఈ మేరకు శిక్షణ తరగతులకు రావాలని వారికి సర్వేకు సంబంధించిన లేఖలను పంపారు. ఈ సర్వేలో అనేక క్లిష్టమైన అంశాలుండటంతో అనేక మంది సిబ్బంది అవాక్కయ్యారు. తమ పరిస్థితులను వివరించడంతో అధికారులు నాలుక కరుచుని ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సర్వే నుంచి మినహాయింపు ఇవ్వండి.. - వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం
సర్వే విధుల నుంచి వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎల్.రాజసమయ్మ, ఎ.నారాయణలు పేర్కొన్నారు. అంగ వైకల్యంతో ఒకేరోజు 25 కుటుంబాలు తిరిగి సర్వే చేయడం ఇబ్బందిగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
వికలాంగులు, అంధులకు ఎన్యుమరేటర్లుగా విధులు
Published Thu, Aug 14 2014 2:42 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement