సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు.. సంక్షేమ పథకాలు అర్హులకే అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సర్వేలో భాగస్వామ్యం అయ్యేందుకు జిల్లా వాసులు కూడా సంసిద్ధంగా ఉన్నారు.
సుదూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలు సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేయించుకునేందుకు స్వస్థలాలకు చేరుకున్నారు. సర్వే కోసం కుటుంబ సభ్యులంతా ఒకేచోటికి చేరడంతో అన్ని నివాసాల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో సోమవారం అన్ని రవాణా వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా సర్వేపైనే చర్చించుకుంటున్నారు. వివరాల నమోదు విషయంలో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫ్రొఫార్మాలు, ఇతర సర్వే సామగ్రీని సోమవారం పంపిణీ చేశారు. ఆయా రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ పంపిణీ జరిగింది.
క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనున్న ఎన్యూమరేటర్లు సోమవారం సాయంత్రమే గ్రామాలకు బయలుదేరి వెళ్లగా, దగ్గర గ్రామాల్లో మంగళవారం ఉదయం బయలుదేరనున్నారు. సర్వే సిబ్బందిని, అధికారులను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు జిల్లా వ్తాప్తంగా 1,797 వాహనాలను ఏర్పాటు చేశారు. సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, వివిధ వర్గాల ప్రజలకు ఆయా డివిజన్ పరిధిలో శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని వర్గాలకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించారు. సర్వే ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ.అశోక్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
32,684 ఎన్యూమరేటర్లు.. 2,492 అధికారులు..
జిల్లాలో 7,89,613 కుటుంబాలు ఉన్నాయని గుర్తించారు. ఈ కుటుంబాలపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు 32,684 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 ఇళ్ల చొప్పున సర్వే చేసి వివరాలు సేకరించనున్నారు. సర్వేను పర్యవేక్షించేందుకు, పకడ్బందీగా నిర్వహించేందుకు 2,492 అధికారులు, సిబ్బందిని నియమించారు. 866 గ్రామ పంచాయతీలలో సర్వే సక్రమంగా జరిగేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో విలేజ్ ప్లానింగ్ అధికారులుగా గుర్తించారు.
ఒక్కో మండలానికి ఒక రిసోర్స్ పర్సన్‌ను, మున్సిపల్ పరిధిలో ఐదుగురు రిసోర్స్ పర్సన్ల చొప్పున నియమించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 295 మంది క్లస్టర్ అధికారులను నియమించారు. అలాగే 52 మండలాలు, ఏడు మున్సిపాలిటీలకు కలిపి ఒక్కొక్కరు చొప్పున 59 మంది అధికారులకు సూపర్‌వైజర్ బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు మరో 1,213 అధికారులు, సిబ్బందిని అదనంగా నియమించారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఎన్యూమరేటర్లు విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానాల్లో సర్వే చేసేందుకు కొందరు ఎన్యూమరేటర్లను రిజర్వులో ఉంచారు. సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 264 ఆర్టీసీ బస్సులు, 391 పాఠశాల బస్సులు, 296 జీపులు, 589 టాటా ఎసీ వాహనాలు, 229 ఆటోలు, 28 ట్రాక్టర్లు మొత్తం 1,797 వాహనాలు వినియోగిస్తున్నారు.
ఇవీ అడుగుతారు..
కుటుంబ సర్వే చేసేందుకు ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఎన్యూమరేటర్ వద్ద 80 అంశాల ఫ్రొఫార్మా ఉంటుంది. ఈ ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి తిరిగి ప్రభుత్వానికి పంపిస్తారు. ఇందుకు గ్రామాల ప్రొఫార్మాలను కలెక్ట్ చేసేందుకు మండలాల్లో సర్వే రోజు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సర్వే ఎన్యూమరేటర్‌కు ఆధార్ కార్డు (ఉన్నట్లైతే), వాహన రిజిస్ట్రేషన్ కార్డు, ఇంటి పన్ను రశీదు, కరెంట్ బిల్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పుస్తకం, బ్యాంకు, పోస్టాఫీసు పాసు పుస్తకం, కులం, జనన ధ్రువీకరణపత్రం, విద్యార్థులకు చెందిన సర్టిఫికెట్లు (మెమో, టీసీ వంటివి), వికలాంగుల ధ్రువీకరణ పత్రం (సదరం సర్టిఫికెట్), పట్టాదారు పాసు పుస్తకం, ఓటర్ ఐడీ, పాన్‌కార్డు, పెన్షనర్ల ఐడీతోపాటు రేషన్ కార్డు, సొంత ఇళ్లు వివరాలు అడుగుతారు.
సర్వేలో అందరు వివరాలు నమోదు చేసుకునేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సర్వే అనంతరం గ్రామాధికారులు, సర్పంచ్‌లు క్రాస్‌చెకింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మండల ప్రత్యేక అధికారులు కూడా క్రాస్‌చెకింగ్ చేస్తారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ జగన్మోహన్ సందేశం
‘‘సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. సర్వేలో పేర్కొన్న అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి. వివరాలు లేనట్లైతే లేనట్లుగా, ఉన్నట్లైతే ఉన్నట్లుగా మాత్రమే ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. ఈ సర్వేతో ప్రజలకు ఎలాంటి నష్టమూ కలగదు. సర్పంచ్‌లతోపాటు, వీఆర్వో నుంచి జిల్లాస్థాయి అధికారులు సర్వే చేస్తున్నారు. కుటుంబంలోని సభ్యులందరి పూర్తి వివరాలు చెబితేనే బాగుంటుంది. ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా సర్వే కోసం మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు మీ కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలు చెబుతారని కోరుతున్నా.’’
కంట్రోల్ రూం ఏర్పాటు
సర్వేపై సమగ్ర సమాచారం కోసం, సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో దీన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వాసులు 08732-222302, 08732-222802, 08732-225529 నెంబర్లకు ఫొన్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
సర్వేమయం
Published Tue, Aug 19 2014 12:50 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement