
న్యూఢిల్లీ: వాతావరణంలో మార్పుల కారణంగా రైతుల ఆదాయం రాబోయే కొన్నేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు తగ్గొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితిని కొంతవరకు అధిగమించొచ్చంది. ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే వ్యవసాయ, సర్కారీ విధానాల్లో సమూల మార్పులు అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయదారుల రాబడిని పెంచడంతోపాటు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం జీఎస్టీ మండలి తరహాలో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఎరువులు, విద్యుత్తుపై రైతులకు ఇస్తున్న రాయితీని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేయాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో 45 శాతం పంట భూమికే సాగునీటి వసతి ఉండగా, ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందంది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో సాగునీటి వసతి ఉన్న భూమి అంతంత మాత్రంగానే ఉందని సర్వే పేర్కొంది. సాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు అధిక నిధులను కేటాయించాలని ఆర్థిక సర్వే సిఫారసు చేసింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మరింత ప్రభావ వంతమైన, సమర్థవంతమైన పంట బీమా సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా, అనుబంధ రంగాలైన పాడి, మత్స్య పరిశ్రమలవైపు కూడా వెళ్లేలా వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత ఆకర్షవంతమైన విధానాలు రూపొందించాలంది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ వారి పాత్ర మరింత పెరగాలనీ, మహిళా రైతులకు రుణాలు, భూమి, విత్తనాలు సులభంగా లభించేలా విధానాలు ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment