సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచిందని, కోవిడ్ మరణాల అంచనా ప్రకారం చూస్తే భారీసంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2020–21 స్పష్టం చేసింది. ‘శతాబ్దానికి ఓసారి వచ్చే సంక్షోభంలో ప్రాణాలు, జీవనోపాధిని కాపాడడం’ అన్న శీర్షికన ఆర్థిక సర్వే తన మొదటి చాప్టర్‌లో ఈ అంశాలను ప్రస్తావించింది. అనిశ్చిత పరిస్థితుల మధ్య అత్యధిక జనసాంద్రత ఉన్న దేశంలో నష్టాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యల వల్ల అంచనాల కన్నా సుమారు 37 లక్షల కేసులను తగ్గించగలిగామని, దాదాపు లక్ష ప్రాణాలు కాపాడగలిగామని ఆర్థిక సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్ రాష్ట్రాలు కేసుల వ్యాప్తిని మెరుగ్గా నిరోధించగలిగాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలను కాపాడగలిగాయని తెలిపింది. కేసుల వ్యాప్తి నిరోధం, ప్రాణాలు కాపాడడంలో మహారాష్ట్ర పనితీరు ప్రభావవంతంగా లేదంది. కోవిడ్ పరీక్షల నిర్వహణలో జాతీయ సగటు లక్షకు 14,081గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో లక్ష జనాభాలో 22 వేల మందికి పరీక్షలు జరిపినట్టు తెలిపింది.
రెవెన్యూ వసూళ్లలో వేగం..
► కోవిడ్ మహమ్మారి కారణంగా రెవెన్యూ వసూళ్లలో ‘వీ షేప్’ వృద్ధి కనబడగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెవెన్యూ వసూళ్లు వేగంగా పుంజుకున్నాయని, జూన్ మాసం నాటికే ఈ మార్పు కనిపించిందని సర్వే వెల్లడించింది. గుజరాత్, హరియాణాలో జూలై నాటికి, మహారాష్ట్రలో ఆగస్టు నాటికి ఈ మార్పు కనిపించిందని వివరించింది. ఈవే బిల్స్ ఆధారంగా మార్పులను సర్వే విశ్లేషించింది. దేశీయ టూరిజం గమ్యస్థానాల్లో టాప్–5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 తో పోల్చితే సర్వే–5లోని ఫేజ్–1లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. పిల్లల్లో ఎదుగుదల లోపం(స్టంటింగ్) తగ్గినట్టు తెలిపింది. అలాగే తక్కువ బరువు లోపాలు లేకుండా చూడడంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు చూపిందని పేర్కొంది.
► రాష్ట్ర నికర దేశీయ ఉత్పత్తి(నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్–ఎన్‌ఎస్‌డీపీ) 2018–19లో 8.9 శాతం ఉండగా.. 2019–20లో 12.9 శాతంగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. తలసరి ఆదాయం 2018–19లో రూ.1,51,173గా ఉండగా.. 2019–20 నాటికి రూ.1,69,519కి పెరిగిందని సర్వే తెలిపింది. తలసరి ఆదాయం విషయంలో 2018–19లో 8.2 శాతం వృద్ధి రేటు ఉండగా.. 2019–20లో 12.1 శాతం వృద్ధిరేటు నమోదైందని వివరించింది.
ఆ ఆరేళ్లలో అట్టడుగున...
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహాలకు తాగునీటి లభ్యత సూచీ(ఇండెక్స్) 2012, 2018తో పోల్చితే ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన అనేక రాష్ట్రాలు ప్రగతి కనబరిచాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ అట్టడుగున నిలిచాయంది. 2012తో పోలిస్తే 2018 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతీయ అసమానతలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. జల్‌జీవన్ మిషన్ దీనిపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment