దిశ మార్పుతో దశ మారేనా?
విశ్లేషణ
2016, ఫిబ్రవరి 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 19.78 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు నేపథ్యంగా, స్వయానా దేశీయ ఆర్థిక సర్వే, జైట్లీయే అంగీకరించి నట్లుగా అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ ఆర్థికరంగంలో మార్కెట్కు డిమాండ్ పతనమైన పరిస్థితులున్నాయి. మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.) బాగానే వృద్ధి చెందు తోందని (2015-2016లో 7.6 శాతంగా) పాలకులు తమ గణాంకాలతో నమ్మింప చూస్తున్నప్పటికీ ఇతర గణాం కాలూ, నేలబారు వాస్తవాలూ దీనికి భిన్నమైన స్థితిని సూచి స్తున్నాయి. పలువురు ఆర్థికవేత్తలూ, కడకు ఆర్.బి.ఐ. గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా మన జి.డి.పి, గణాంకాలు సరైనవేనా? అని సందేహించడం మనం మరువరాదు.
కాగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పతనం వలన మన కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్లో అట్టహాసంగా ఆరంభించిన ‘‘మేకిన్ ఇండియా’’ కార్యక్రమం పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్న తీరుగా మిగిలి పోయింది. ఇక, 2014 నుంచీ అంతర్జాతీయ మార్కెట్లలో సరుకులు, చమురు ధరల భారీ పతనం కారణంగా మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అయితే, ఈ ధరల పతనం తాలూకు వాస్తవ ఫలితాలు చిల్లర ధరల తగ్గుదల రూపంలో జనసామాన్యానికి చేరడంలేదు. మొత్తంమీద అంతర్జాతీయంగా ఈ సరుకులు, చమురుధరల తగ్గుదల తాలూకు సానుకూల ఫలితాలు వాణిజ్య సమతుల్యత, విదేశీమారకం నిల్వల సానుకూలత రూపంలో మోదీ ప్రభుత్వానికి మాత్రం కలసి వచ్చాయి.
ఈ మొత్తం కథ నేపథ్యంలోనే నేటి మన కేంద్ర బడ్జెట్ తయారైంది. ఈ బడ్జెట్లో సుమారు రెండు దశాబ్దాల అనంతరం వ్యవసాయానికి కాస్తంత ప్రాధాన్యత లభిం చింది. 1990లలో ప్రపంచీకరణ విధానాల అమలు ఆరంభం అయిన తరువాత మనదేశ పాలకుల ప్రాధాన్యతలు ప్రధానంగా దేశంలోని కులీన, విద్యాధిక వర్గాలకు అనుకూల మైన సేవారంగం చుట్టూరానే తిరుగాడాయి. సరుకు ఉత్పత్తి రంగం సవతి తల్లి ప్రేమనే పొందింది. కాగా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా చిదిమివేశారు. అందువల్లనే దేశీయంగా 60% పైగా జనాభాకు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగానికి నేడు మన జి.డి.పి.లో కేవలం 15- 16% వాటా మాత్రమే ఉంది.
ఇక సరుకు ఉత్పత్తిరంగం పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కాగా, దేశ ప్రజలలోని సుమారు 20% మందికి జీవనోపాధిని కల్పిస్తోన్న సేవారంగానికి జి.డి.పి.లో 60% మేరన వాటా ఉంది. ఆర్థిక రంగంలో ఈ సమతుల్యతా లోపాన్ని సరిదిద్దే పేరిట మేకిన్ ఇండియా కార్యక్రమం ముందుకు వచ్చింది. కాగా, వ్యవసాయానికి మాత్రం ఎటు వంటి సానుకూల విధానం ఇప్పటివరకూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే నేడు నలువైపులా ఆర్థిక సంక్షోభ వాతావరణం చుట్టుముడుతోన్న పరిస్థితులలో దేశీయంగా మన ప్రజల కొనుగోలు శక్తినీ, మార్కెట్ డిమాండ్లను పెంచగలిగేదిగా 2016-2017 బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేసే ప్రయత్నం జరిగింది. అలాగే, గ్రామీణ వ్యవసాయ కార్మికులకోసం ఉద్దేశించిన జాతీయ ఉపాధి హామీ పథకం నిధులనూ రికార్డు స్థాయిలో మంజూరు చేశామని ఈ బడ్జెట్ ప్రకటించుకుంది.
కాగా, ఇంత సుదీర్ఘకాల విరామం తరువాత మన ప్రభుత్వం, వ్యవసాయరంగం పట్ల తన శ్రద్ధను ప్రకటిం చడం సంతోషకరమే. కానీ, నేటి ఆర్థిక గడ్డుకాలంలో వ్యవసాయం పట్ల చూపిన ఈ శ్రద్ధ వ్యూహాత్మకమైనదా? లేకుంటే కేవలం ఎత్తుగడలపరమైనదేనా? అనే ప్రశ్నలు మన ముందు ఇంకా మిగిలే ఉన్నాయి! అలాగే, ప్రస్తుత బడ్జెట్లోని వ్యవసాయ, గ్రామీణరంగ కేటాయింపుల తీరు తెన్నులు నిజ జీవితంలో ఎంతవరకూ సమర్థవంతంగా దేశీయ ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించగలవు? అన్నది కూడా మరో ప్రశ్న. ఈ బడ్జెట్లోనే, ఎరువుల సబ్సిడీల పట్ల చూపిన ప్రతికూల దృక్పథం ఇక్కడ గమనార్హం. ఇది, వ్యవసాయ రంగానికీ, రైతాంగానికి ఇబ్బంది కలిగించే నిర్ణయమే. అలాగే, బడ్జెట్ ప్రతిపాదనల నాడే డీజిల్ ధరలను పెంచడం మోటార్లతో సాగే వ్యవసాయంపై ఎంతో కొంత అదనపు భారమే. ఇక జాతీయ ఉపాధి హామీకి గత బడ్జెట్లో 34,699 కోట్ల రూపాయలను కేటాయించారు.
కాగా, ఆ బడ్జెట్ కాలవ్యవధి ముగిసిపోనున్న నేటి తరుణంలో ఇప్పటికీ, ఈ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు, మొత్తం కేటాయింపులో 16 శాతం మేరకు (రూ.5,595 కోట్లు) బకాయి ఇంకా చెల్లింపు జరగకుండా మిగిలి ఉండటం గమనార్హం. కాబట్టి నేటి సరికొత్త బడ్జెట్లో ఈ పథకానికి రికార్డు స్థాయిలో (రూ. 38,500 కోట్లు) కేటాయించామని చెబుతున్న అంశం భవిష్యత్ ఆచరణలో మాత్రమే రుజువుకు నోచుకోగలదు. అంతే కాకుండా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జాతీయ ఉపాధి హామీ పథకం అనేది యు.పి.ఎ. ప్రభుత్వం తాలూకూ అతిపెద్ద తప్పిదంగా మోదీ అభివర్ణించడాన్ని కూడా మనం మరువరాదు.
కాబట్టి, ఈ పథకం అమలులో నేటికీ కనబడుతున్న 3% లోపు గ్రామీణ కుటుంబాలకు మాత్రమే పూర్తిస్థాయిలో 100 రోజులపాటు మాత్రమే ఉపాధిని కల్పించగలగడం, 70% శాతం పైగా కూలీల వేతనాల చెల్లింపులలో జాప్యాలు వంటి బలహీనతలను అధిగమించకుండా మన గ్రామీణ రైతు కూలీల కొనుగోలు శక్తిని పెంచలేరు. అలాగే ధనవం తులపై పన్నులూ, సెస్లూ విధించడం ద్వారా ఈ బడ్జెట్ గ్రామీణ రంగానికి అదనంగా నిధులను సమకూర్చేందుకు చేసిన ప్రయత్నం ముదావహమే కానీ రైతాంగం, వ్యవసాయ రంగాల తాలూకు మౌలిక సమస్యలను పరిష్కరించడానికి కేవలం ఇదొక్కటే సరిపోదు. నేటి వ్యవసాయ సంక్షోభానికీ, రైతాంగం కడగండ్లకూ మూల కారణాలుగా ఉన్న ఉత్పాదకాల వ్యయాలు అధికంగా ఉండటం, నకిలీల సమస్య, అరకొర నిల్వ సదుపాయాలు, బ్యాంకు రుణాల అందుబాటు, విద్యుత్ సబ్సిడీలు, నిరంతర సరఫరాలు, మార్కెట్ అందుబాటు వంటి అనేకానేక సమస్యల పరిష్కారం దిశగా కూడా తగిన శ్రద్ధ అవసరం.
కాబట్టి, కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ తాలూకు వాస్తవ ఫలితాలు ఈ దిశగా ప్రభుత్వ చిత్తశుద్ధీ, అలాగే పరిపాలనా చర్యల వంటి పలు రోజువారీ అంశాలపై కూడా పెద్ద స్థాయిలో ఆధారపడి ఉంటాయి. అంతిమంగా, ఆర్థికంగా అగాథం అంచుకు చేరుతోన్న అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక స్థితిగతులలో, ఈ బడ్జెట్ ఏ మేరకు మనలను ఆదుకోగలదు? ఇదంతా కేవలం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమేనా? అన్న ప్రశ్నలకు రానున్న ఆర్థిక సంవత్సరకాలం మాత్రమే తగిన జవాబులను ఇవ్వగలదు.
వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు, డి. పాపారావు మొబైల్ : 9866179615