కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. మప విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 132 ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.
మాడుగుల: మాడుగులలో 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పుట్టిన హల్వా నేడు విదేశాల్లో సైతం నోరూరిస్తోంది. మాడుగుల అంటే హల్వాగానే ఖ్యాతి పెరిగింది. గతంలో హల్వా మాడుగులలోనే లభ్యమయ్యేది. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ కూడా విస్తరించింది. ఆన్‌లైన్ ఆర్డరిస్తే ఎంత దూరమైనా హల్వా పంపించే స్థాయికి మార్కెట్..నెట్‌వర్క్ అభివృద్ధి చెందింది. జీడి, బాదం పలుకులతో పాటు కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే..గోధుమ పాలుతోపాటు రాతి రుబ్బి రాయితో గంటలు పాటు సాన పట్టి కర్రలు పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపట్టగానే పుట్టుకొచ్చేదే మాడుగుల హల్వా.
సినీతారలు ఫిదా
అరకు, పాడేరు ప్రాంతాల్లో జరిగే సినీ షూటింగ్‌లకు ప్రముఖ హీరోహీరోయిన్లు మాడుగుల హల్వా రుచికి ఫిదా అయినవాళ్లే. హల్వాను లొట్టలేసుకుని తిన్నవారే..అందుకే ఈ ప్రాంతానికి సినీ తారలు ఎవరొచ్చినా కచ్చితంగా హల్వా రుచి చూడకుండా వెళ్లరు. పర్యాటక ప్రాంతాలు వీక్షించేందుకు వచ్చే పర్యటకులు మాడుగుల హల్వా రుచి చూడకుండా వెళ్లరు. విశాఖ అందాలను చూసేందుకు ఎంత ఉవ్విళ్లూరతారో.. మాడుగుల హల్వా తినేందుకు కూడా అంతే ఆసక్తి కనబరుస్తారు.
అందుబాటులో ధరలు
మాడుగులలో మేలు రకం కిలో రూ 500కాగా రెండో రకం కిలో రూ.400. స్థానిక వ్యాపారంతో పాటు పార్సిల్ ద్వారా ఇతర ప్రాంతాలకు ప్రతి రోజు ఎగుమతి జరుగుతోంది. మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబం మాత్రమే తయారీ చేసేవారు. తయారీ గుట్టురట్టవ్వడంతో మాడుగుల పట్టణానికి చెందిన దాసరి కుటుంబీకులు కూడా హల్వా పాకం, పదునును కనిపెట్టడంతో ప్రస్తుతం సుమారు 20 షాపులకుపైగా ఏర్పాటయ్యాయి.
విదేశాలకు హల్వా రుచులు
మాడుగులకు చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగలకు, శుభకార్యాలకు మాడుగుల వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు విదేశీ స్నేహితుల కోసం హల్వా తీసుకువెళ్లడం..ఆ రుచికి వారు మైమరచిపోవడం ఈ స్వీటుకున్న క్రేజ్ తెలియజేస్తుంది. హైదరాబాద్ చిత్రపురి హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీ, సినీ నటుడు కాదంబరి కిరణ్‌కు మాడుగుల హల్వా అంటే చెప్పలేని ఇష్టం. అంతేకాదు చిత్రపురి కార్మికులకు తన స్నేహితుడైన కేజేపురం గ్రామానికి చెందిన పుట్టా ప్రసాద్ బాబుతో హల్వా రప్పించి పంపిణీ చేస్తుంటారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, భద్రాచలం, చెన్నై లాంటి నగరాల్లో కార్తీక ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, కోటి దీపాలంకరణ సమయాల్లో ఇక్కడ నుంచి హల్వా తీసుకెళ్లి వందలాది మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తుంటారు.
హల్వా టర్నోవర్
సాధారణ రోజుల్లో ఒక్కో షాపులో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు విక్రయిస్తారు. పండగ, పర్యాటకుల రద్దీ ఉన్న సమయాల్లో రూ.4 వేలకు పైగా వ్యాపారాలు జరుగుతాయి. ఈ ఒక్కో షాపు నెలకు రూ.5లక్షలకు పైగానే వ్యాపారం సాగిస్తోంది.
5 వేల మందికి ఉపాధి
మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు ఎగుమతి చేస్తున్నారు. హల్వా సృష్టి కర్త దంగేటి ధర్మారావు నుంచి అతని కుమారుడు, మనుమలు, ముని మనవళ్లు హల్వా తయారీలో నిష్ణాతులు. తరాలు మారుతున్న హల్వా రుచి ఏ మాత్రం తగ్గలేదు. మాడుగుల నుంచి ఢిల్లీ తదితర ప్రాంతాలకు ప్రతి రోజు హల్వా విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. అరకు షూటింగ్‌కు వచ్చిన అల్లు అర్జున్, విజయశాంతి, రాజకీయ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సైతం నాటి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారని వ్యాపారులు దంగేటి మోహన్ , దాసరి ప్రసాద్ చెబుతున్నారు. అలాగే నాటి ప్రధాని ఇందిరా గాంధీ గత 40 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు హల్వా రుచి చూసి..ఢిల్లీకి పంపాలని అప్పటి సీనియర్ నాయకుడు వేమరవపు వెంకటరమణకు చెప్పారట. అంతలా మాడుగుల హల్వా రుచి అందరి మనసు గెలుచుకుంది.
పోస్టల్ కవర్ పై ..
విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసే హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మాడుగుల వాసులు తయారు చేసే ఈ రకమైన హల్వాకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉందని అంతర్జాతీయంగా కూడా ప్రచారం జరిగింది. గోధుమ పాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి వాటితో మాడుగుల వాసులు తయారు చేసే హల్వా కూడా తపాలా శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ల పై ఉండటంతో విస్తృత ప్రచారం జరుగుతోంది.
మాడుగుల టు ప్యారిస్
మాది విశాఖ జిల్లా మాడుగుల మండలం సత్యవరం గ్రామం. ఉద్యోగరీత్యా ప్యారిస్‌లో 8 ఏళ్లుగా స్థిరపడ్డాం. మాడుగుల ఎప్పుడు వచ్చినా హల్వా తీసుకెళ్లి ప్యారిస్‌లో ఉన్న స్నేహితులకు ఇస్తుంటా..ఇండియా వచ్చినప్పుడు హల్వా మర్చిపోవద్దు అంటూ స్నేహితులు పదేపదే చెబుతుంటారు.
–గోపిశెట్టి వెంకటేష్, మెకానికల్ ఇంజనీర్, ప్యారిస్
తరాలుగా ఒకటే రుచి
తాతలు నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, బాదం జీడి పలుకులు, గోధుమ పాలతో చేసే హల్వా రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుబాటు «ధరల్లో విక్రయాలు జరుపుతున్నాం. హల్వా తయారీలో మా ముత్తాత ధర్మారావు టెక్నిక్ అనుసరిస్తున్నాం.
అందుకే రుచిలో ఒకలా ఉంటుంది.
–దంగేటి మోహన్,హల్వా తయారీదారుడు మాడుగుల
Comments
Please login to add a commentAdd a comment