న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్‌కి చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి... తాజాగా ఆన్‌లైన్ మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. సంస్థకు ఇప్పటికే పతంజలి ఆయుర్వేద్‌డాట్‌నెట్ పేరిట సొంత పోర్టల్ ఉన్నప్పటికీ.. మరిన్ని ఈ–కామర్స్ సంస్థలతో చేతులు కలపడం ద్వారా కార్యకలాపాలు మరింత విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 8 ఈ–కామర్స్ సంస్థలతో జట్టు కట్టేందుకు కసరత్తు మొదలెట్టింది.
స్వదేశీ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాల కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్, 1ఎంజీ వంటి సంస్థలతో త్వరలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పతంజలి ప్రతినిధి ఎస్.కె.తిజారావాలా ఇటీవలే మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్‌లో చేసిన ట్వీట్ ఇందుకు ఊతమిస్తోంది. ఆన్‌లైన్‌లో భారీగా విస్తరించే దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ–కామర్స్ కంపెనీలతో త్వరలో జట్టు కట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దీంతో అనేక పోర్టల్స్‌లో పతంజలి ఉత్పత్తులు లభ్యం కాగలవని, కంపెనీ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం కాగలదని తిజారావాలా తెలిపారు. ఈ భాగస్వామ్యాలతో తమ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రాగలవన్నారు. ఆన్‌లైన్ కంపెనీలన్నింటితో భేటీ అయ్యే దిశగా పతంజలి ఈ నెల 16న భారీ కార్యకమ్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ ఆచార్య బాలకృష్ణ కూడా హాజరుకానున్నారు.
కొంగొత్త వ్యూహాలతో వృద్ధి..
బ్రోకింగ్ సంస్థల అంచనాల ప్రకారం.. పతంజలి బ్రాండ్ ఆహారోత్పత్తులు ప్రస్తుతం 26 శాతం కుటుంబాలకు, వ్యక్తిగత సౌందర్య సాధనాల ఉత్పత్తులు 53 శాతం కుటుంబాలకు చేరుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది వంద శాతం వృద్ధి. కార్యకలాపాల విస్తరణ కోసం పతంజలి ఆయుర్వేద సంస్థ కొన్నాళ్లుగా వ్యాపార వ్యూహాలకు మరింత పదును పెడుతూ వస్తోంది.
ప్రారంభం నుంచి అనుసరిస్తూ వస్తున్న బ్రాండెడ్ ఫ్రాంచైజీ విధానం నుంచి.. ఎఫ్‌ఎంజీసీ కంపెనీలు అనుసరించే చానల్ డిస్ట్రిబ్యూషన్ మార్గానికి కూడా మళ్లింది. 2020 నాటికల్లా రూ. 1 లక్ష కోట్ల వార్షిక అమ్మకాలు సాధించాలని పతంజలి నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 2019 నాటికల్లా పంపిణీదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 5,000 నుంచి 25,000కు పెంచుకోవాలని పతంజలి భావిస్తోంది.
అలాగే, ఆన్‌లైన్ వ్యాపార ప్రణాళికలు సైతం వ్యాపార వృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఏడో స్థానంలో ఉన్న పతంజలి.. తాజా వ్యూహాలతో మరింత భారీ మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు.. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 20,000 కోట్ల టర్నోవరు లక్ష్యాన్ని సాధించేందుకు ఆన్‌లైన్ ప్రణాళికలు దోహదపడే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment