భారీగా డార్క్ స్టోర్లను ఏర్పాటు చేస్తున్న క్విక్ కామర్స్ సంస్థలు
జోరుగా సిబ్బంది నియామకాలు..
అధిక వేల్యుయేషన్లు, పెట్టుబడుల వెల్లువతో జోష్
కిరాణాతో పాటు కార్ట్‌లోకి ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ ప్రొడక్టులు
క్విక్ కామర్స్ కంపెనీలకు దండిగా నిధులు లభిస్తుండటంతో విస్తరణ జోరు పెంచాయి. నగరాల్లో ఈ మోడల్ మంచి సక్సెస్ సాధించడంతో జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. కిరాణాతో మొదలు పెట్టిన కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మేకప్, టాయ్స్ వంటి ఇతర ప్రొడక్టులను కూడా కార్ట్‌లోకి చేర్చుతున్నాయి. అయితే, బడా నగరాల్లో ఈ మైక్రో వేర్‌హౌస్‌ల కోసం స్థలాల వేట కష్టతరంగా మారుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
సమీపంలోని ప్రాంతాలకు 30 నిమిషాల్లోపే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసే చిన్న స్థాయి గోడౌన్లను డార్క్ స్టోర్లుగా పేర్కొంటారు. కిక్కిరిసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహరం. అయినప్పటికీ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. మరోపక్క, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, క్విక్ డెలివరీ విషయంలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో సిబ్బంది నియామకాలతో ఈ రంగంలో హైరింగ్ కళకళలాడుతోంది.
చిన్న నగరాల్లో స్పీడ్...
నగరాల్లోని కిక్కిరిసిన ప్రాంతాల్లో డార్క్ స్టోర్ల ఏర్పాటు సవాలుగా మారుతోందని జెప్టో సీఈఓ ఆదిత్ పలీచా చెబుతున్నారు. గత రెండు నెలల్లోనే బిలియన్ డాలర్లను (దాదాపు రూ.8,400 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, చండీగఢ్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా స్థలాలు దొరుకుతుండటంతో అక్కడ విస్తరణ స్పీడ్ పెంచుతున్నామని పలీచా పేర్కొన్నారు. ‘ఈ రంగంలోకి నిధులు పుష్కలంగా వస్తున్నాయని పసిగట్టిన స్థిరాస్తి యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.
కొన్నిచోట్ల పోటీ కారణంగా బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది’ అని పలీచా వివరించారు. జొమాటో బ్లింకిట్ సైతం భటిండా, హరిద్వార్, విజయవాడ వంటి నగరాల్లో అడుగుపెట్టింది. కస్టమర్లకు వేగంగా సేవలదించేలా డార్క్ స్టోర్ల సైజును కంపెనీలు పెంచుతున్నాయి. గతంలో సగటున 2,500 చదరపు అడుగులున్న ఈ స్టోర్ సైజు 4,000–5,000 చ.అ.కు పెరిగింది. కొన్నిచోట్ల 10,000 చ.అ., మరికొన్ని చోట్ల ఏకంగా 25,000 చ.అ. డార్క్ స్టోర్లు కూడా ఏర్పాటవుతుండటం ఈ రంగంలో జోరుకు నిదర్శనం.
‘అమ్మతోడు అరగంటలోపే డెలివరీ చేసేస్తాం’ క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో స్లోగన్ ఇది!
ఇందుకు తగ్గట్టుగానే శరవేగంగా దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగంలో కంపెనీలు నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి. బంపర్ వేల్యుయేషన్లతో ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో సేవలను ‘క్విక్’గా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. సిబ్బంది నియామకాలతో పాటు డార్క్ స్టోర్ల సంఖ్య, సైజును కూడా భారీగా పెంచుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు లభించడంతో పాటు మరింత వేగంగా సేవలు లభించేందుకు దోహదం
చేస్తోంది.
రూ. 300-500 : సగటు ఆర్డర్ విలువ (గతంలో ఇది 200–250గా ఉండేది)
4,000 చ. అ. : డార్క్ స్టోర్ ప్రస్తుత సగటు సైజు (అంతక్రితం 2,500 స్థాయిలో ఉండేది). కొన్ని ఏరియాల్లో 10,000 చ. అ. స్టోర్లు కూడా ఉన్నాయి.
హైరింగ్.. ఫుల్ స్వింగ్
‘క్విక్’ విస్తరణ నేపథ్యంలో సిబ్బంది డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ‘ఈ రంగంలో అన్ని విభాగాల్లోనూ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఐదు ప్రధాన కంపెనీలు అగ్ర స్థానం కోసం పోటీ పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా లాజిస్టిక్స్ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇతర కంపెనీల్లోని నిపుణులైన ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి’ అని ఒక క్విక్ కామర్స్ సంస్థ చీఫ్ వెల్లడించారు. ‘మినిట్స్’ పేరుతో లేటుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల వేగం పెంచేందుకు బిగ్‌బాస్కెట్ వంటి ఇతర కంపెనీల నుంచి చాలా విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసుకుంటున్నట్లు పరి
శ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బిగ్‌బాస్కెట్ సైతం పూర్తి స్థాయి క్విక్ కామర్స్ మోడల్‌లోకి మారే ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేశ్ ఝా ఇటీవలే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓగా చేరారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మధ్య స్థాయి మేనేజర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ–కామర్స్‌లోని మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్, ఫైనాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ వలసలు జోరందుకోవడం గమనార్హం. జెప్టో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్లీ, ఓలా, అర్బన్ కంపెనీ తదితర కంపెనీల నుంచి కీలక సిబ్బందిని భారీగా నియమించుకుంటోంది. కంపెనీ ప్రధాన కేంద్రాన్ని బెంగళూరు నుంచి మంబైకి మార్చే సన్నాహాల్లో ఉన్న జెప్టో.. 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేటలో ఉన్నట్లు పలీచా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment