
న్యూఢిల్లీ: ఇటీవలే ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ(NSE SME) ప్లాట్‌ఫాం ఎమర్జ్‌లో లిస్టయిన కాలాహరిధాన్ ట్రెండ్జ్‌పై (KTL) నిబంధనల ఉల్లంఘనకుగాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ కంపెనీతో పాటు ప్రమోటర్లు నిరంజన్ డి అగర్వాల్, ఆదిత్య ఎన్ అగర్వాల్, సునీత నిరంజన్ అగర్వాల్‌ను ఆదేశించింది. అలాగే వారిని పూర్తిగా నిషేధిస్తూ ఎందుకు ఉత్తర్వులు ఇవ్వరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడంలో విఫలమైందంటూ కేటీఎల్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ఫిర్యాదు రావడంతో సెబీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. 2024 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 15 వరకు సాగిన విచారణలో.. ఈ డిఫాల్ట్ వివరాలను కంపెనీ వెల్లడించకుండా డిస్‌క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. పైగా బంగ్లాదేశ్‌లోని ఒక కల్పిత సంస్థ నుంచి భారీ ఆర్డరు వచ్చిందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరిస్తున్నామని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. దీన్ని కప్పి పుచ్చేందుకు ఈమెయిల్స్ సృష్టించినట్లు వివరించింది.
ఇదీ చదవండి: మార్కెట్‌లోకి కొత్త ఐపీవోలు
మొత్తం మీద కంపెనీపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచి షేర్లలో ట్రేడ్ చేసేలా ఇన్వెస్టర్లను పురిగొల్పి, షేర్లను అమ్ముకుని లబ్ధి పొందేందుకే కేటీఎల్ నిర్దిష్ట కార్పొరేట్ ప్రకటనలను చేసినట్లు సెబీ పేర్కొంది. పైపెచ్చు రైట్స్ ఇష్యూ ద్వారా మరో విడత నిధుల సమీకరణ కూడా కంపెనీ తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 23న ఇష్యూ ధర రూ.45తో పోలిస్తే రూ.47.15 వద్ద లిస్టయిన కేటీఎల్ షేరు ప్రస్తుతం రూ.20 స్థాయిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment