‘ట్రింగ్.. ట్రింగ్ ’ అని బెల్ మోగిస్తూ ఒక పోస్ట్‌మ్యాన్ ఆ కుగ్రామంలోనికి సైకిల్ మీద వచ్చాడు. ఒక ఇంటి ముందు ఆగిన ఆయన.. ‘కమలా.. పట్నం నుంచి నీ భర్త మనీ ఆర్డర్ పంపించాడు’ అని పెద్దగా చెప్పాడు. వెంటనే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి.. ‘సారూ మా ఆయన ఎంత పంపించాడు?’ అని అడిగింది. దీనికి ఆయన 250 రూపాయలు అని చెబుతూ, ఆ మెత్తాన్ని ఆమె చేతిలో పెట్టి, తన దగ్గరున్న రిజిస్ట్రర్‌లో ఆమె చేత వేలిముద్ర వేయించుకున్నాడు’
ఇది ఒకప్పటి కథ. నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. పాత సినిమాల్లోనూ ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. నాడు పట్టణంలో ఉద్యోగం చేసే భర్త ప్రతినెలా పంపే డబ్బు కోసం భార్య ఎదురు చూసేది. ‘మనీ ఆర్టర్’ తీసుకుని పోస్ట్‌మ్యాన్ ఎప్పడు వస్తాడా అని మహిళలు ఇళ్ల ముందు కాపలా కాసేవారు.
నేటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చిచేరింది. డబ్బుతో లావాదేవీలు చేసేందుకు ఈ-బ్యాంకింగ్‌తో పాటు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్‌లు మన మొబైల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. నేడు మనం ఈ యాప్‌ల సాయంతో ప్రపంచంలోని ఏ మూలకైనా ఇన్‌స్టంట్‌గా డబ్బును పంపవచ్చు. అయితే మునుపటి కాలంలో డబ్బును పంపేందుకు మనీఆర్డర్ ఆధారంగా ఉండేది.
ఉత్తరాల బట్వాడా కోసం భారత ప్రభుత్వం 1854లో పోస్టల్ శాఖను నెలకొల్పింది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత పోస్టల్ డిపార్ట్‌మెంట్ 1880, జనవరి ఒకటిన మనీ ఆర్డర్(Money order) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైనా సరే తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేసి, వారు పంపించాలనుకుంటున్న చోటుకు నగదును పంపించవచ్చు. ఆ నగదు చేరాల్సిన పోస్టాఫీసు రాగానే, అక్కడి పోస్ట్‌మ్యాన్స్ సంబంధిత చిరునామాకు ఆ మొత్తాన్ని అందజేసేవాడు. నాటి కాలంలో పోస్టల్‌శాఖలో ఇదొక విప్లవం అని చెబుతుంటారు.
మనీ ఆర్డర్ ద్వారా ఉత్తరాల మాదిరిగానే డబ్బును కూడా పంపగలగడం నాటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఉపాధి కోసం నగరాల్లో ఉన్నవారికి.. గ్రామాల్లో ఉంటున్న వారి సంబంధీకులకు ఇదొక వారధిలా మారింది. అంతకుముందు వరకూ ఇతరులకు డబ్బు పంపడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. అయితే మనీ ఆర్డర్ రాకతో ఈ సమస్యకు చెక్ పడింది. తొలినాళ్లలో పెళ్లి వేడుకలకు వెళ్లే అవకాశం లేనివారు నూతన దంపతులకు కానుకల రూపంలో మనీ ఆర్డర్ ద్వారా డబ్బును పంపేవారట.
పోస్టల్‌శాఖ(Postal Department)లో మనీ ఆర్డర్ సేవ దశాబ్దాల కాలం పాటు సాగింది. ప్రజల నుంచి ఎంతో ఆదరణను కూడా పొందింది. అయితే కాలానుగుణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్‌స్టంట్ పేమెంట్ యాప్‌లు రావడంతో మనీ ఆర్డర్‌కు ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణామాల దరిమిలా 2015లో ఇండియన్ పోస్ట్ మనీ ఆర్డర్ సేవలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత పోస్టల్ శాఖ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఈఎంఓ), ఇన్‌స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)సేవలను ప్రారంభించింది. త్వరిత గతిన డబ్బును అందించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్‌స్టంట్ మనీ ఆర్డర్ సర్వీస్ కింద రూ.1,000 నుండి రూ.50,000 వరకు నగదు బదిలీ చేసే సదుపాయం ఉంది. ఐఎంవో సదుపాయం కలిగిన ఏదైనా పోస్టాఫీసు నుండి, ఒక గుర్తింపు రుజువుతో పాటుగా ఇ-ఫారమ్‌ను పూరించి, ఇంటర్నెట్ ఆధారిత తక్షణ సేవ ద్వారా డబ్బును పంపవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట పోస్టాఫీసుల నుండి మాత్రమే డబ్బును పంపేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్లినప్పటికీ, గతానికి సంబంధించిన అనేక విషయాలు మన మదిలో జ్ఞాపకాలుగా తారాడుతుంటాయి. మన ఇంట్లోని పెద్దలను అడిగితే, మనీ ఆర్డర్‌కు సంబంధించి వారికున్న అనుభవాలను చెబుతారు.
ఇది కూడా చదవండి: ‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో..
Comments
Please login to add a commentAdd a comment