Postal Logistics Service
-
పోస్టాఫీసుల్లో బ్లూడార్ట్ డిజిటల్ లాకర్ సేవలు!
న్యూఢిల్లీ: భారతీయ తపాలా శాఖతో బ్లూడార్ట్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో బ్లూడార్ట్ డిజిటల్ లాకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల పార్సిల్ పొందాల్సిన వ్యక్తి రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా డిజిటల్ లాకర్ వద్దకు వెళ్లి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని బ్లూడార్ట్ ప్రకటించింది. ఎలాంటి సంతకాలతో పనిలేదని పేర్కొంది. పోస్టాఫీస్‌తో వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఆటోమేటెడ్ డిజిటల్ పార్సిల్ లాకర్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. లాకర్లలో పార్సిల్స్ సురక్షితంగా ఉంటాయని, తమకు కేటాయించిన కోడ్‌ను నమోదు చేయడం ద్వారా సులభంగా ప్యాకేజ్‌ను పొందొచ్చని వివరించింది. కేవలం గుర్తింపు ఉన్న వ్యక్తే వీటిని పొందగలరని తెలిపింది. కస్టమర్లు తమ వీలు ప్రకారం ప్యాకేజ్‌లను పొందే అవకాశం కల్పించడమే ఇందులోని ఉద్దేశంగా బ్లూడార్ట్ ఎండీ బాల్ఫోర్ మాన్యుయేల్ ప్రకటించారు. -
గొల్లభామ చీరలు.. ఇంటి నుంచే కొనేయచ్చు
సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాల్లో సిద్దిపేట గొల్లభామ చీరలది ప్రత్యేకమైన స్థానం. ఇకపై ఆ చీరలు కొనాలంటే సిద్దిపేటకు వెళ్లక్కర్లేదు. మరేషాప్కి పోనక్కర్లేదు. ఇంట్లో ఉండే ఏంచక్కా ఆ చీరలను పొందవచ్చు. పోస్టల్ శాఖకు చెందిన ఈ షాప్ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ చీరలను బుక్ చేసుకుని హోం డెలివరీ పొందవచ్చు. ఈ షాప్ జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్కలిగిన తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్లతోపాటు ఆ శాఖ ఈ కామర్స్ వెబ్‌పోర్టల్ ‘ఈ–షాప్’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణలోని హస్తకళల ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తుల విక్రయాల కోసం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఏచ్పాటు చేసిన ప్రత్యేక ఈ కామర్స్ పోర్టల్ (www.eshop.tsposts.in) ను గవర్నర్ తమిళసై ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ చేసిన కృషిని గవర్నర్ అభినందించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు, వరంగల్ రగ్గులు, నారాయణపేట చేనేత చీరలు, హైదరాబాద్ హలీమ్, సిద్దిపేట గొల్లభామ చీరలపై రూపొందించిన పోస్టల్ కవర్లను గవర్నర్ తాజాగా ఆవిష్కరించారు. ప్రస్తుతం జీఐ ట్యాగ్‌కి సంబంధించి గొల్లభామ చీరలు ఈ షాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ కవర్లు భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరహక్కుల పరిరక్షణ కోసం వాటికి జీఐ ట్యాగ్ హోదాను కల్పిస్తున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన 13 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ హోదా లభించగా, ఇందులో ఐదు ఉత్పత్తులపై ప్రత్యేక పోస్టర్ కవర్లను పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. -
పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ హనుమాన్‌జంక్షన్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, సత్వర బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో కోర్ బ్యాంకింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటిని అనుసంధానం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ తెలిపారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళుతూ మార్గమధ్యంలో హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసును మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తొలుత పోస్టాఫీసు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రాజెక్టు యూరో పథకంలో భాగంగా ఆధునీకరించిన హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసులో అందిస్తున్న వివిధ సేవలను గురించి ఆరా తీశారు. టచ్ స్క్రీన్ కియోస్కో పనితీరు, తపాలా శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. పోస్టల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దాదాపు ఏడాదికి రూ.కోటి నష్టాలతో నడుస్తున్న హనుమాన్‌జంక్షన్ సబ్‌పోస్టాఫీసును లాభాల బాటలోకి నడిపించటానికి సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. తపాలా శాఖ అమలు చేస్తున్న ఇ-పోస్ట్, ఇ-మనియార్డర్, నాణ్యత, జీవితబీమా, లాజిస్టిక్ సర్వీసు వంటి పథకాలు, సేవలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చొరవ చూపాలని చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా హనుమాన్‌జంక్షన్ నుంచి కేవలం రూ.22లకే విజయవాడకు సరకు ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయనతో పాటు పోస్టుమాస్టర్ జనరల్ ఎం.సంపత్, డెరైక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎం.సోమసుందరం, గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై.రామకృష్ణ, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.శివనాగరాజు, హనుమాన్‌జంక్షన్ పోస్టుమాస్టర్ ఎల్.వి.సుబ్బారావు పాల్గొన్నారు.