పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు | rural in bank servies | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు

Published Wed, Jul 9 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

rural in bank servies

చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్
హనుమాన్‌జంక్షన్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, సత్వర బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో కోర్ బ్యాంకింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటిని అనుసంధానం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ తెలిపారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళుతూ మార్గమధ్యంలో  హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసును మంగళవారం ఆయన తనిఖీ చేశారు.

తొలుత  పోస్టాఫీసు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రాజెక్టు యూరో పథకంలో భాగంగా ఆధునీకరించిన హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసులో అందిస్తున్న వివిధ సేవలను గురించి ఆరా తీశారు.  టచ్ స్క్రీన్ కియోస్కో పనితీరు, తపాలా శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలతో కూడిన డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు. పోస్టల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

దాదాపు ఏడాదికి రూ.కోటి నష్టాలతో నడుస్తున్న హనుమాన్‌జంక్షన్ సబ్‌పోస్టాఫీసును లాభాల బాటలోకి నడిపించటానికి సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. తపాలా శాఖ అమలు చేస్తున్న ఇ-పోస్ట్, ఇ-మనియార్డర్, నాణ్యత, జీవితబీమా, లాజిస్టిక్ సర్వీసు వంటి పథకాలు, సేవలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చొరవ చూపాలని చెప్పారు.

కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా హనుమాన్‌జంక్షన్ నుంచి కేవలం రూ.22లకే విజయవాడకు సరకు ట్రాన్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు.    ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు.
 
ఆయనతో పాటు పోస్టుమాస్టర్ జనరల్ ఎం.సంపత్, డెరైక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎం.సోమసుందరం, గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై.రామకృష్ణ, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.శివనాగరాజు, హనుమాన్‌జంక్షన్ పోస్టుమాస్టర్ ఎల్.వి.సుబ్బారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement