న్యూఢిల్లీ: అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను స్విఫ్ట్‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ విధమైన అనుసంధానం లేకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు నీరవ్‌మోదీ కంపెనీలకు ఎల్‌వోయూల జారీ అంశాన్ని కోర్ బ్యాంకింగ్ (సీబీఎస్) దృష్టికి వెళ్లకుండా స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే.
ఎల్‌వోయూల జారీ వివరాలను వారు సీబీఎస్‌లో నమోదు చేయలేదు. దీంతో ఈ మోసం చాలా కాలం పాటు బయటపడకుండా కొనసాగింది. ఇక సైబర్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని నిర్ణయం జరిగింది. రిస్క్ నిర్వహణపై జరిగిన ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రోజుల ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. అనంతరం ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ఎంఎస్ శాస్త్రి మీడియాతో మాట్లాడారు.
స్విఫ్ట్ లావాదేవీలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతీ ప్రభుత్వరంగ బ్యాంకు ఎల్‌వోయూలు, లెటర్ ఆఫ్ కంఫర్ట్ (ఈ రెండూ రుణ హామీ పత్రాలే) లావాదేవీలపై ఆడిట్ నిర్వహించిన నేపథ్యంలో వీటికి సంబంధించి ఇక ఏ మాత్రం మోసపూరిత లావాదేవీలు ఉండవని శాస్త్రి పేర్కొన్నారు. ఈ రెండు రకాల పత్రాల ఆధారంగా వాణిజ్యం నిర్వహించే వారు ఇకపై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ బ్యాంకు గ్యారంటీలకు మళ్లాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పారు. దీంతో రుణాల వ్యయం పెరుగుతుందన్నారు.
రిస్కులు తగ్గించుకునేందుకు భారీ వ్యవస్థ
వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ తరహా కుంభకోణాలను ఆరికట్టేందుకు భారీ రిస్కు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులు యోచిస్తున్నాయి. ఆరు నెలల్లోగా దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ డిఫ్యూ టీ ఎండీ ఎంఎస్ శాస్త్రి ఈ విషయాలు తెలిపారు. ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తప్ప మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) అన్నీ అధికారికమైనవేనని, నకిలీవేవీ లేవని ఆయన పేర్కొన్నారు.
ఆయా బ్యాంకులన్నీ కూడా వీటిని పరిశీలించుకుని, ధృవీకరించుకున్నాయని శాస్త్రి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల సంఖ్యలో శాఖలున్నాయని, తాజాగా రూ. 13,000 కోట్ల కుంభకోణం ఒకానొక శాఖలో చోటు చేసుకున్న ఓ అసాధారణ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య రుణాలు, రిస్కులు, సైబర్ దాడుల ముప్పు మొదలైన వాటిపై ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ రిస్క్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు మూడు రోజులపాటు చర్చలు జరిపారు.
ఆయా రిస్కులను ఎదుర్కొనేందుకు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను తమ తమ బోర్డులకు సమర్పించి, మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఒక్కోటి అమలు చేయనున్నట్లు శాస్త్రి తెలిపారు. మరోవైపు, వాణిజ్య రుణాలకు సంబంధించి స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా పంపే సందేశాల నిబంధనలను కఠినతరం చేయాలని, దాన్ని కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కి ఏప్రిల్ 30 లోగా అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment