core banking system
-
కోర్ బ్యాంకింగ్‌తో స్విఫ్ట్ అనుసంధానం
న్యూఢిల్లీ: అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను స్విఫ్ట్‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ విధమైన అనుసంధానం లేకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు నీరవ్‌మోదీ కంపెనీలకు ఎల్వోయూల జారీ అంశాన్ని కోర్ బ్యాంకింగ్ (సీబీఎస్) దృష్టికి వెళ్లకుండా స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. ఎల్వోయూల జారీ వివరాలను వారు సీబీఎస్‌లో నమోదు చేయలేదు. దీంతో ఈ మోసం చాలా కాలం పాటు బయటపడకుండా కొనసాగింది. ఇక సైబర్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని నిర్ణయం జరిగింది. రిస్క్ నిర్వహణపై జరిగిన ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రోజుల ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. అనంతరం ఎస్బీఐ డిప్యూటీ ఎండీ ఎంఎస్ శాస్త్రి మీడియాతో మాట్లాడారు. స్విఫ్ట్ లావాదేవీలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతీ ప్రభుత్వరంగ బ్యాంకు ఎల్వోయూలు, లెటర్ ఆఫ్ కంఫర్ట్ (ఈ రెండూ రుణ హామీ పత్రాలే) లావాదేవీలపై ఆడిట్ నిర్వహించిన నేపథ్యంలో వీటికి సంబంధించి ఇక ఏ మాత్రం మోసపూరిత లావాదేవీలు ఉండవని శాస్త్రి పేర్కొన్నారు. ఈ రెండు రకాల పత్రాల ఆధారంగా వాణిజ్యం నిర్వహించే వారు ఇకపై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ బ్యాంకు గ్యారంటీలకు మళ్లాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పారు. దీంతో రుణాల వ్యయం పెరుగుతుందన్నారు. రిస్కులు తగ్గించుకునేందుకు భారీ వ్యవస్థ వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ తరహా కుంభకోణాలను ఆరికట్టేందుకు భారీ రిస్కు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులు యోచిస్తున్నాయి. ఆరు నెలల్లోగా దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ డిఫ్యూ టీ ఎండీ ఎంఎస్ శాస్త్రి ఈ విషయాలు తెలిపారు. ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తప్ప మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ) అన్నీ అధికారికమైనవేనని, నకిలీవేవీ లేవని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులన్నీ కూడా వీటిని పరిశీలించుకుని, ధృవీకరించుకున్నాయని శాస్త్రి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల సంఖ్యలో శాఖలున్నాయని, తాజాగా రూ. 13,000 కోట్ల కుంభకోణం ఒకానొక శాఖలో చోటు చేసుకున్న ఓ అసాధారణ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య రుణాలు, రిస్కులు, సైబర్ దాడుల ముప్పు మొదలైన వాటిపై ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ రిస్క్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు మూడు రోజులపాటు చర్చలు జరిపారు. ఆయా రిస్కులను ఎదుర్కొనేందుకు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను తమ తమ బోర్డులకు సమర్పించి, మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఒక్కోటి అమలు చేయనున్నట్లు శాస్త్రి తెలిపారు. మరోవైపు, వాణిజ్య రుణాలకు సంబంధించి స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా పంపే సందేశాల నిబంధనలను కఠినతరం చేయాలని, దాన్ని కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కి ఏప్రిల్ 30 లోగా అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. -
బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ డబ్బులు
కలెక్టర్ ఇలంబరిది నిర్మల్‌టౌన్ : వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు కోర్ బ్యాంకింగ్ సిస్టం, బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛన్లు చెల్లించాలని కలెక్టర్ ఇలం బరిది అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు, వ్యవసాయశాఖ, పోస్టల్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, ఎంపీడీవోలతో ఆసరా పింఛన్లు, పంట రుణాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల వరకు పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు సంబంధిత గ్రామాల్లోని పోస్టాఫీసుల ద్వారా నగదుగా చెల్లించి, వచ్చే నెల నుంచి బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లించాలన్నారు. జిల్లాలో లక్షా36వేల269 ఆసరా పింఛన్ దారులకు ప్రతీ నెల రూ.16.84 కోట్ల చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 40,438 మందికి రూ.4.55కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇంకా 94,619 మందికి రూ.12కోట్ల 10లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిని సంబంధిత గ్రామాల పోస్ట్ ఆఫీస్‌ల నుంచి లబ్ధిదారులకు నగదు రూపంలో చెల్లించాలన్నారు. కొత్తగా మంజూరైన 2,746 అభయహస్తం పింఛన్ల లబ్ధిదారులు, ఆసరా పింఛన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు తెరిచి, ఏటీఎం కార్డులుండేలా చూడాలన్నారు. ఖాతాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకుల వారీగా బ్యాంక్ లింకేజీ ఇవ్వడానికి అర్హత ఉన్న సంఘాల వివరాలు తెలుపాలన్నారు. 2016 ఖరీఫ్‌లో 77బ్యాంకుల ద్వారా 78,808 మంది రైతులకు రూ.39,746.47 లక్షల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద 31,173 రైతుల నుంచి 437.5 లక్షల ప్రీమియం వసూలు చేసినట్లు చెప్పారు. గ్రామాలు, బ్యాంక్‌ల వారీగా సర్వే చేసి ఏటీఎం కార్డులు లేని వారి వివరాలు సేకరించాలన్నారు. ఫర్టిలైజర్ షాపులలో స్వైపింగ్ మిషన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కొత్తగా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, డీపీవో నారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లేశం, డీడీ వ్యవసాయ శాఖ గంగారాం, సీనియర్ బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ హనుమాన్‌జంక్షన్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, సత్వర బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో కోర్ బ్యాంకింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటిని అనుసంధానం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ తెలిపారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళుతూ మార్గమధ్యంలో హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసును మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తొలుత పోస్టాఫీసు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రాజెక్టు యూరో పథకంలో భాగంగా ఆధునీకరించిన హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసులో అందిస్తున్న వివిధ సేవలను గురించి ఆరా తీశారు. టచ్ స్క్రీన్ కియోస్కో పనితీరు, తపాలా శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. పోస్టల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దాదాపు ఏడాదికి రూ.కోటి నష్టాలతో నడుస్తున్న హనుమాన్‌జంక్షన్ సబ్‌పోస్టాఫీసును లాభాల బాటలోకి నడిపించటానికి సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. తపాలా శాఖ అమలు చేస్తున్న ఇ-పోస్ట్, ఇ-మనియార్డర్, నాణ్యత, జీవితబీమా, లాజిస్టిక్ సర్వీసు వంటి పథకాలు, సేవలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చొరవ చూపాలని చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా హనుమాన్‌జంక్షన్ నుంచి కేవలం రూ.22లకే విజయవాడకు సరకు ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయనతో పాటు పోస్టుమాస్టర్ జనరల్ ఎం.సంపత్, డెరైక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎం.సోమసుందరం, గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై.రామకృష్ణ, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.శివనాగరాజు, హనుమాన్‌జంక్షన్ పోస్టుమాస్టర్ ఎల్.వి.సుబ్బారావు పాల్గొన్నారు.