బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ డబ్బులు
కలెక్టర్ ఇలంబరిది
నిర్మల్‌టౌన్ : వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు కోర్ బ్యాంకింగ్ సిస్టం, బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛన్లు చెల్లించాలని కలెక్టర్ ఇలం బరిది అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు, వ్యవసాయశాఖ, పోస్టల్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, ఎంపీడీవోలతో ఆసరా పింఛన్లు, పంట రుణాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల వరకు పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లు సంబంధిత గ్రామాల్లోని పోస్టాఫీసుల ద్వారా నగదుగా చెల్లించి, వచ్చే నెల నుంచి బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లించాలన్నారు. జిల్లాలో లక్షా36వేల269 ఆసరా పింఛన్ దారులకు ప్రతీ నెల రూ.16.84 కోట్ల చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 40,438 మందికి రూ.4.55కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇంకా 94,619 మందికి రూ.12కోట్ల 10లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిని సంబంధిత గ్రామాల పోస్ట్ ఆఫీస్‌ల నుంచి లబ్ధిదారులకు నగదు రూపంలో చెల్లించాలన్నారు.
కొత్తగా మంజూరైన 2,746 అభయహస్తం పింఛన్ల లబ్ధిదారులు, ఆసరా పింఛన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు తెరిచి, ఏటీఎం కార్డులుండేలా చూడాలన్నారు. ఖాతాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకుల వారీగా బ్యాంక్ లింకేజీ ఇవ్వడానికి అర్హత ఉన్న సంఘాల వివరాలు తెలుపాలన్నారు. 2016 ఖరీఫ్‌లో 77బ్యాంకుల ద్వారా 78,808 మంది రైతులకు రూ.39,746.47 లక్షల రుణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద 31,173 రైతుల నుంచి 437.5 లక్షల ప్రీమియం వసూలు చేసినట్లు చెప్పారు. గ్రామాలు, బ్యాంక్‌ల వారీగా సర్వే చేసి ఏటీఎం కార్డులు లేని వారి వివరాలు సేకరించాలన్నారు. ఫర్టిలైజర్ షాపులలో స్వైపింగ్ మిషన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
కొత్తగా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, డీపీవో నారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లేశం, డీడీ వ్యవసాయ శాఖ గంగారాం, సీనియర్ బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.