breaking news
Chief Postmaster General
-
ఇంటికే పుష్కర జలం
⇒ శుద్ధి చేసి సీసాలో నింపి సరఫరా ⇒ ప్రైవేటు సంస్థతో తపాలా శాఖ ఒప్పందం ⇒ గోదావరి పుష్కరాలకువెళ్లలేనివారికి వెసులుబాటు ⇒ 500 ఎంఎల్ సీసా ఖరీదు రూ.20 సాక్షి, హైదరాబాద్: ఊరూరికి గోదావరి జలాలు... తపాలా శాఖ తాజా నినాదమిది. పుష్కరాల సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానం చేయాలన్న తపన ఉండి వెళ్లలేకపోయేవారి ఇంటికి గోదావరి నీటిని సరఫరా చేస్తామంటూ తపాలా శాఖ ముందుకొచ్చింది. వృద్ధాప్యం, అనారోగ్యం, పేదరికం, పని ఒత్తిడి తదితర కారాణాలతో పుష్కర నదీ స్నానానికి వెళ్లలేకపోయినవారు తమకు ఆర్డర్ ఇస్తే మెరుగైన పద్ధతిలో శుద్ధి చేసిన గోదావరి జలాన్ని ఇంటికే బట్వాడా చేస్తామంటోంది. ఇందుకోసం రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ సంస్థతో తపాలా శాఖ ఒప్పందం చేసుకుంది. సీసా ఖరీదు రూ.20 మనుగడే ప్రశ్నార్థకమైన తరుణంలో నిలదొక్కుకునేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న తపాలాశాఖ ఇప్పుడు గోదావరి పుష్కరాల వేళ ‘గాడ్ జల్’ (ఆంగ్లంలో గోదావరి సంక్షిప్తరూపం గాడ్(జీఓడీ)) పేరుతో నీటి సీసాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. కావాల్సిన వారు స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి సీసాకు రూ.20 చొప్పున చెల్లించి చిరునామా అందజేసి టికెట్ కొనాల్సి ఉంటుంది. బుకింగ్స్‌ను బుధవారం నుంచే మొదలు పెట్టారు. పుష్కరాలు మొదలయ్యే జూలై 14 వరకు బుకింగ్స్‌కు అవ కాశం. పుష్కరాలు జరిగే జూలై 14 నుంచి 25 వరకు రాజమండ్రిలోని గోదావరి నది నీటిని సేకరించి వాటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి 500 మిల్లీలీటర్ల పరిమాణంలో సీసాల్లో నింపి ఆయా చిరునామాలకు చేరుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని 95 హెడ్ పోస్టాఫీసులు, 2,360 సబ్‌పోస్టాఫీసులు, 13,611 బ్రాంచి పోస్టాఫీసుల్లో ఈ వెసులుబాటు కల్పించారు. విదేశాలకూ సరఫరా పోస్టాఫీసుకు వెళ్లకుండా ఆన్లైన్ (www.appost.in/eshop) ద్వారా కూడా ఆర్డర్ చేసే వెసులు బాటు కల్పించారు. విదేశాల నుంచి వచ్చే ఆర్డర్లను కూడా తీసుకునే ఏర్పాటు చేశారు. అయితే నగదు మార్పిడి వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనస్ క్రెడిట్ కార్డులకే అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదాయం రూ. 57 లక్షలు ఏడు లక్షల సీసాల సరఫరాకు మొత్తం రూ.1.50 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో తపాలా శాఖకు రూ.57 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా. పుష్కరాల సమయంలో గోదావరి నది ప్రవహించే జిల్లాల్లోని ప్రత్యేకతలకు సంబంధించి రోజుకో ఇతి వృత్తంతో పోస్ట్ కవర్‌ను విడుదల చేయనున్నారు. స్టాంపులపై మన ఫొటో ముద్రించి విక్రయించే ‘మై స్టాంప్’ పథకంలో పుష్కరాల సమయంలో పూల బొమ్మ బదులు గోదావరి బొమ్మను ముద్రించనున్నారు. 12 స్టాంపులకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నీటి సేకరణ దృశ్యాలు రాజమండ్రిలోని సఫైర్ అన్న ఐఎస్ఐ గుర్తింపు ఉన్న సంస్థతో తొలుత 7 లక్షల సీసాల సరఫరాకు ఒప్పందం చేసుకున్నాం. కానీ 20 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. వీలైనంత వరకు అందరికీ సరఫరా చేసే ప్రయత్నం చేస్తాం. మేం అందజేసే నీళ్లు కచ్చితంగా పుష్కరాల సమయంలో గోదావరి నుంచే సేకరిస్తాం. ఆ దృశ్యాలను చిత్రీకరించి ఎప్పటికప్పుడు మా వెబ్సైట్లో, పోస్టాఫీసులో అందుబాటులో ఉంచుతాం. - సుధాకర్, చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ -
పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ హనుమాన్‌జంక్షన్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, సత్వర బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో కోర్ బ్యాంకింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటిని అనుసంధానం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ తెలిపారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళుతూ మార్గమధ్యంలో హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసును మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తొలుత పోస్టాఫీసు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రాజెక్టు యూరో పథకంలో భాగంగా ఆధునీకరించిన హనుమాన్‌జంక్షన్ సబ్ పోస్టాఫీసులో అందిస్తున్న వివిధ సేవలను గురించి ఆరా తీశారు. టచ్ స్క్రీన్ కియోస్కో పనితీరు, తపాలా శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. పోస్టల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దాదాపు ఏడాదికి రూ.కోటి నష్టాలతో నడుస్తున్న హనుమాన్‌జంక్షన్ సబ్‌పోస్టాఫీసును లాభాల బాటలోకి నడిపించటానికి సిబ్బంది చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. తపాలా శాఖ అమలు చేస్తున్న ఇ-పోస్ట్, ఇ-మనియార్డర్, నాణ్యత, జీవితబీమా, లాజిస్టిక్ సర్వీసు వంటి పథకాలు, సేవలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చొరవ చూపాలని చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా హనుమాన్‌జంక్షన్ నుంచి కేవలం రూ.22లకే విజయవాడకు సరకు ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయనతో పాటు పోస్టుమాస్టర్ జనరల్ ఎం.సంపత్, డెరైక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎం.సోమసుందరం, గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వై.రామకృష్ణ, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.శివనాగరాజు, హనుమాన్‌జంక్షన్ పోస్టుమాస్టర్ ఎల్.వి.సుబ్బారావు పాల్గొన్నారు.