న్యూఢిల్లీ: భారతీయ తపాలా శాఖతో బ్లూడార్ట్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో బ్లూడార్ట్ డిజిటల్ లాకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల పార్సిల్ పొందాల్సిన వ్యక్తి రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా డిజిటల్ లాకర్ వద్దకు వెళ్లి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని బ్లూడార్ట్ ప్రకటించింది. ఎలాంటి సంతకాలతో పనిలేదని పేర్కొంది.
పోస్టాఫీస్‌తో వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఆటోమేటెడ్ డిజిటల్ పార్సిల్ లాకర్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. లాకర్లలో పార్సిల్స్ సురక్షితంగా ఉంటాయని, తమకు కేటాయించిన కోడ్‌ను నమోదు చేయడం ద్వారా సులభంగా ప్యాకేజ్‌ను పొందొచ్చని వివరించింది.
కేవలం గుర్తింపు ఉన్న వ్యక్తే వీటిని పొందగలరని తెలిపింది. కస్టమర్లు తమ వీలు ప్రకారం ప్యాకేజ్‌లను పొందే అవకాశం కల్పించడమే ఇందులోని ఉద్దేశంగా బ్లూడార్ట్ ఎండీ బాల్‌ఫోర్ మాన్యుయేల్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment