భారీ అవకాశాలు: డిజిటల్‌ హబ్‌గా విశాఖ | Growing Digital Sector With The Online Market | Sakshi
Sakshi News home page

భారీ అవకాశాలు: డిజిటల్‌ హబ్‌గా విశాఖ

Published Mon, Sep 27 2021 4:49 AM | Last Updated on Mon, Sep 27 2021 4:49 AM

Growing Digital Sector With The Online Market - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో రోజురోజుకీ ఆన్‌లైన్‌ మార్కెట్‌ వ్యాపారం గణనీయంగా పెరుగుతోంది. కొన్నాళ్ల కిందటి వరకూ క్రమంగా ఒక పద్ధతిలో విస్తరిస్తూ వచ్చిన ఆన్‌లైన్‌ రంగం... కోవిడ్‌తో ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిపోయింది. ఆన్‌లైన్‌ వ్యవస్థే సమూలంగా మారిపోయింది. ఇంట్లో సరుకులు మొదలు... ఇతరత్రా వస్తువులు... తినే భోజనం... కాఫీ, టీ కూడా ఆన్‌లైన్లోనే ఆర్డరు చేసే పరిస్థితులు బాగా పెరిగిపోయాయి. మరోవంక సోషల్‌ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచార వ్యూహాన్నీ మార్చాయి. పెద్ద ఎత్తున డిజిటల్‌ ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్‌ వినియోగదారుల అభిరుచులను కనుక్కోవడంతో పాటు ఎటువంటి ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు?

ఎలాంటి ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్నారు? వంటి డేటా కంపెనీలకు ఇంధనంగా మారుతోంది. సరిగ్గా ఈ అవసరమే ఇప్పుడు డిజిటల్‌ మార్కెటింగ్‌కు.. సాఫ్ట్‌వేర్‌ భాషలో చెప్పాలంటే ‘మార్కెట్‌ ప్లేస్‌ మేనేజ్‌మెంట్‌’కు డిమాండ్‌ను  పెంచుతోంది. రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖపట్నంలో ఇప్పటికే పలు కంపెనీలు డిజిటల్‌ మార్కెటింగ్‌ సేవలందిస్తున్నాయి. ఈ రంగానికి సంబంధించిన మానవ వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తుండటంతో విశాఖలో రాబోయే రోజుల్లో ఈ రంగం మరింతగా విస్తరిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఐదేళ్లలో ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌
ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ వార్షిక కార్యకలాపాలు 300 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే ఐదేళ్లలో డిజిటల్‌ మార్కెటింగ్‌ కార్యకలాపాల విలువ ఏకంగా ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని పలు సంస్థలు అంచనాలు వేశాయి. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశాలూ లేకపోలేదన్నది నిపుణుల మాట. దీంతో ఐటీ ఆధారిత సేవలందిస్తున్న సంస్థలు కూడా డిజిటల్‌ మార్కెటింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి.  రాష్ట్రంలో మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖలోనే ఐటీ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయనే అంశం నిర్వివాదం. గతంలో ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించినా... ఆ తరవాత నిపుణుల కొరత వంటి పలు కారణాలతో తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. డిజిటల్‌ మార్కెటింగ్‌కు వచ్చేసరికి మాత్రం ఇప్పటికే ఇక్కడ పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

రిటైల్, హెల్త్, టెక్స్‌టైల్‌ బిజినెస్‌ రంగాల్లోని కంపెనీలకు సేవలందిస్తున్నాయి. వీటిలో హెల్త్‌టెక్, హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌ రంగంలో విస్తరిస్తున్న పల్సస్‌ గ్రూపు ఇప్పటికే ఇక్కడ 2,500 మందికి ఉపాధి కల్పించింది. ఈ సంస్థకు దేశంలో గుర్గావ్, చెన్నై, హైదరాబాద్‌లో కేంద్రాలున్నా విశాఖ కేంద్రంలో 65 శాతం మహిళలే ఉండటం గమనార్హం. ఇక డబ్ల్యూఎన్‌ఎస్, ఏజీఎస్‌ హెల్త్‌టెక్, ఏసీఎస్‌ హెల్త్‌కేర్‌ వంటి ఇతర కంపెనీలూ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విశాఖలో ఇప్పటికే 4 వేల మందికి పైగా డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో ఉపాధి పొందుతుండగా... వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 20వేలకు చేరవచ్చనే అంచనాలున్నాయి. ‘‘వచ్చే ఐదేళ్లలో డిజిటల్‌ రంగ మార్కెట్‌ ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. దీన్లో కనీసం 2 శాతంపై ఏపీ దృష్టి సారించినా ఇక్కడ కనీసం 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది’’ అనేది నిపుణుల మాట.. తద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌కు విశాఖ కేంద్రంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ అన్ని విధాలా అనుకూలం
ఐటీ సేవల రంగమైతేనే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలం. దీనికి శిక్షణ పొందిన మానవ వనరులు కావాలి. డిజిటల్‌కూ అంతే. కొన్నాళ్లుగా మేం శిక్షణనిస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ 2,500 మంది పనిచేస్తున్నారు. నగరంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణుల లభ్యత కూడా పెరిగింది. పలు ఇతర కంపెనీలూ వచ్చాయి. నిజానికి ఏపీ ఐటీ నిపుణుల సంఖ్య లక్షల్లో ఉన్నా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఐటీకి ప్రాధాన్యమివ్వటం, విశాఖ సహా 3 చోట్ల ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు ప్రతిపాదించటం రాష్ట్రంలో ఈ రంగానికి ఊతమిస్తాయి. డిజిటల్‌పై ప్రభుత్వం దృష్టి పెడితే ఇక్కడి విద్యార్థులకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. 
– గేదెల శ్రీనుబాబు, పల్సస్‌ గ్రూపు సీఈవో

విశాఖలో అపార అవకాశాలు
డిజిటల్‌ మార్కెటింగ్‌కు విశాఖలో చాలా అవకాశాలు ఉన్నాయి. కోవిడ్‌ వల్ల ప్రాధాన్యం  పెరిగింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉంది. ఇక్కడి నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్‌ బయటకు వస్తున్నారు. ఇక్కడ మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ రంగంలో కొన్ని కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరిన్ని కంపెనీలకు అవకాశం ఉంది.
– ఆర్‌ఎల్‌ నారాయణ, చైర్మన్, ఐటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఐటాప్‌) ఇన్వెస్ట్‌మెంట్‌ బ్రాండింగ్‌ కమిటీ

డేటా చాలా కీలకం
ఆన్‌లైన్‌ వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలకు వినియోగదారుల అభిరుచులపై డేటా చాలా కీలకం. వారి అభిరుచులకు అనుగుణంగా వారు తమ వద్ద ఆయా ప్రొడక్ట్స్‌ను స్టాక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  ఇందుకు వినియోగదారుల డేటా చాలా కీలకం. దీన్ని విశ్లేషించడం అంత సులువు కాదు. నిపుణులు కావాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడాలి. ఇందుకోసం  మా ఉద్యోగులకు మేమే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మార్కెట్‌ ప్లేస్‌ మేనేజ్‌మెంట్‌ రంగం చాలా కీలకంగా మారనుంది. 
– చమన్‌ బేడ్, ఏసీఎస్‌ హెల్త్‌టెక్‌ సీఈవో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement