online shoppers
-
ఆ ‘క్లిక్కే’ వేరు!
సాక్షి, స్పెషల్ డెస్క్: మనతోని అట్లుంటది.. అవును ఆటైనా, పాటైనా.. ఆఖరుకు రిటైల్ అయినా రికార్డులు సృష్టించడంలో ఆ ‘క్లిక్కే’వేరు. ప్రపంచ ఆన్లైన్ రిటైల్ రంగంలో కస్టమర్ల సంఖ్య పరంగా అమెరికాను దాటి రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. 28 కోట్ల మంది ఆన్లైన్ షాపర్స్‌తో రిటైల్ మార్కెట్‌ను మన దేశం షేక్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ సహకారంతో బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 92 కోట్ల మంది ఈ–రిటైల్ షాపర్స్‌తో చైనా తొలి స్థానంలో కొనసాగుతోంది. 27 కోట్ల ఆన్లైన్ షాపర్లతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. క్విక్ కామర్స్, ట్రెండ్–ఫస్ట్ కామర్స్, హైపర్–వాల్యూ కామర్స్ భారత్‌లో తదుపరి ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి అధ్యాయాన్ని నిర్వచించనున్నాయి.ఐదు మించి ప్లాట్‌ఫామ్స్.. ఈ–రిటైల్ షాపర్స్‌లో జెన్–జీ తరం (1997–2012 మధ్య పుట్టినవారు) సంఖ్య దాదాపు 40% ఉంది. ప్రత్యేక షాపింగ్ అలవాట్లు వారి సొంతం. వారిలో సగం మంది ఏటా ఐదు, అంతకంటే ఎక్కువ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ బ్రాండ్లపై ఇతర కస్టమర్లతో పోలిస్తే జెన్–జీ తరం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. హైపర్ వాల్యూ కామర్స్ (అతితక్కువ ధరగల ఉత్పత్తులు) సామాన్యులను ఆకర్షిస్తోంది. ఈ–రిటైల్‌లో 2021లో 5% వాటా కలిగి ఉన్న ఈ విభాగం ఇప్పుడు 12% మించిపోయింది. కిరాణా, జీవనశైలి, సాధారణ వస్తువులు ఈ–రిటైల్ మార్కెట్లో 55% వాటా కలిగి ఉన్నాయి. ఇవి 2030 నాటికి మూడింట రెండు వంతులకు చేరనున్నాయి. తోడైన క్విక్ కామర్స్.. భారత్‌లో తలసరి జీడీపీ రూ. 2,99,950 కంటే ఎక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, తమిళనాడు ఇప్పటికే ఈ–రిటైల్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 1.2 రెట్లు అధికంగా వ్యాప్తి చెందాయి. దేశంలోని ఈ–రిటైల్ రంగంలో ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ గ్రామాల వరకు వ్యాపారాన్ని విస్తరించాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తదితర క్విక్ కామర్స్ కంపెనీలు మొత్తం ఈ–కామర్స్ జోరుకు సహాయపడుతున్నాయి.క్విక్ కామర్స్ యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. స్వల్పకాలిక స్థూల ఆర్థిక ఎదురుగాలులు ఉన్నప్పటికీ భారత ఈ–రిటైల్ మార్కెట్లో దీర్ఘకాలిక అవకాశాలు బలంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ (సరసమైన ధరలకు ట్రెండీ కలెక్షన్) ఒక్కటే నాలుగు రెట్లు పెరిగి 2028 నాటికి సుమారు రూ. 68,560–85,700 కోట్లకు చేరుకోనుంది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ ఆదాయంలో సగానికిపైగా ఆన్లైన్ అమ్మకాల ద్వారానే రానుంది. పెద్ద నగరాలతో సమానంగా..⇒ ఈ–రిటైల్‌లో 2020 నుంచి ఇప్పటివరకు నమోదైన కొత్త కస్టమర్లలో దాదాపు 60% మంది తృతీయ శ్రేణి పట్టణాలు, చిన్న నగరాలకు చెందినవారే. అలాగే 2021 నుంచి ఈ–రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో చేరిన నూతన విక్రేతలలో 60% కంటే ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల నుంచి ఉన్నారు. మొత్తం ఆర్డర్స్‌లో తృతీయ, ఆ తర్వాతి స్థాయి పట్టణాల వాటా 45% పైగా ఉంది. ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో వినియోగదార్ల ఈ–రిటైల్ ఖర్చు మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలతో సమానంగా ఉంది. అంతేగాక వివిధ వస్తు విభాగాలలో సగటు అమ్మకపు ధరలు సమానంగా లేదా కొంచెం తక్కువగా ఉన్నాయి.పదింటిలో ఒకటి ఈ–రిటైల్‌కు..ఈ–రిటైల్ (ఆన్లైన్ కొనుగోళ్లు) విపణి భారత్‌లో 2019– 2024 మధ్య ఏటా 20% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. 2024లో ఈ రంగంలో రూ. 5,14,200 కోట్ల వ్యాపా రం జరిగింది. ఏటా 18% వృద్ధితో 2030 నాటికి ఇది రూ. 14,56,900–16,28,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా. స్థూల ఆర్థిక కారకాలు, వినియోగం క్షీణించిన కారణంగా దేశీయ ఈ–రిటైల్ వృద్ధి గతేడాదిలో 10–12 శాతానికి మందగించినప్పటికీ తాజాగా రికార్డు సృష్టించడం విశేషం. ఒకానొక దశలో ఈరంగం 20% పైగా వృద్ధి సాధించింది.2030 నాటికి దేశంలో తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) రూ. 2,99,950– 3,42,800లకు చేరనున్న నేపథ్యంలో కస్టమర్లు రిటైల్‌లో 10 డాలర్లు (రూ. 857) వెచి్చస్తే ఒకటి ఈ–రిటైల్ కోసం ఖర్చు చేస్తారట. అనవసర ఖర్చుల పెరుగుదల అందుకు ఆజ్యం పోయనుందని నివేదిక వివరించింది. -
Flipkart Big End of Season Sale 2024: రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్ సీజన్సేల్.. ఆఫర్లు ఇవే..
ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ జూన్ 1 నుంచి ‘బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ సేల్‌లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది.బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ 12,000 బ్రాండ్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్‌లో అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా తమ కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్‌లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్స్టాంట్ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్‌లో ఫస్ట్ బర్త్డేఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..‘మార్కెట్లో పేరున్న బ్రాండ్లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్‌ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్లు, పార్టీ డ్రెస్‌లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు. -
ఆన్లైన్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్, మింత్రా.. వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో భారీ డిస్కౌంట్ల కోసం వేచిచూస్తున్నారా? ఈ సారి డిస్కౌంట్ ఆఫర్లో ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయాలని ప్లాన్ వేసుకున్నారా? అయితే ఇది మీకు కచ్చితంగా నిరాశ కలిగించే వార్తనే. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఆఫర్ చేసే మెగా డిస్కౌంట్ ఆఫర్లకు ఇక త్వరలోనే కళ్లెం పడబోతుంది. భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకు ప్రొడక్ట్‌లను విక్రయించే వాటిపై ఓ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను కూడా ప్రతిపాదించింది. ఈ ముసాయిదాలో వినియోగదారులను ఆకర్షించేందుకు, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్లను నిలిపివేయాల్సి ఉందని ప్రతిపాదించారు. ఈ ముసాయిదా విధానాన్ని సోమవారం స్టేక్‌హోల్డర్స్‌కు కూడా షేర్ చేసింది. ఈ ప్రతిపాదిత చట్టంలోకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ విక్రయ సంస్థలతో పాటు స్విగ్గీ, జొమాటో లాంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సైట్లు, ఆర్థిక లావాదేవీలు అందించే పేటీఎం, అర్బన్‌క్లాప్, పాలసీ బజార్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రానున్నాయి. ఈ ముసాయిదా ఈ-కామర్స్ విధానాన్ని కేంద్రం, డేటా ప్రైవసీపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అందించిన ప్రతిపాదనల మేరకు రూపొందించింది. వ్యక్తిగత వివరాల భద్రత బిల్లు- 2018 ముసాయిదాను జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కీలక సమాచారాన్ని భారత్‌లో ఉన్న కేంద్రాల్లోనే నిక్షిప్తం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ-కామర్స్ విధాన ముసాయిదాను కూడా ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే రూపొందించినట్లు వాణిజ్య కార్యదర్శి- డిజిగ్నేట్ అనుప్ వాదవాన్ తెలిపారు. ఈ-కామర్స్ విధాన ముసాయిదా రూపకల్పన నిమిత్తం ఓలా, స్నాప్‌డీల్, మేక్ మై ట్రిప్, అర్బన్ క్లాప్, జస్ట్‌డయల్ ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీని కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారత్ ఈ-కామర్స్ రంగం 25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఈ దశాబ్దంలో 200 బిలియన్ డాలర్లను తాకనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈ-కామర్స్ రంగం భారీగా బలపడింది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు వినియోగదారులను క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు అక్రమ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఫిజికల్ రిటైల్ స్టోర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ అమ్మకాల్లో అక్రమ డిస్కౌంట్లకు చెక్ పెట్టడానికి ఇప్పడివరకు ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేదు. కొన్ని బ్రాండులు సైతం తమ ఉత్పత్తులను ఆన్లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్ విక్రయిస్తున్నాయని వాపోతున్నాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భావించిన ప్రభుత్వం, ముసాయిదా ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. -
ఆన్లైన్ షాపర్లు పెరుగుతున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక సేవల రంగ సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో 1.03 కోట్ల మంది ఆన్లైన్ షాపర్లు ఉన్నారు. 2015 నాటికి వీరి సంఖ్య 3.8 కోట్లకు చేరుతుందని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అధ్యయనంలో తేలిం ది. ఇంటర్నెట్ను వినియోగిస్తున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా 7.4 కోట్లుంది. ఇంటర్నెట్ యూజర్ల పరంగా గతేడాది ఆగస్టులో జపాన్ను వెనక్కినెట్టి మూడవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. చైనా, అమెరికాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. క్రెడిట్ కార్డుతో ఆన్లైన్ కొనుగోళ్లను చూస్తే ఫ్లిప్‌కార్ట్‌పై రెండింతలు, జబాంగ్ 1.6 రెట్లు, ఇన్ఫిబీమ్ ఆరింతలు లావాదేవీలు పెరిగాయి. గూగుల్ ఇటీవల చేపట్టిన గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన రావడంతో ఆన్లైన్ రిటైలర్లకు, క్రెడిట్ కార్డు సంస్థలకు ప్రయోజనం చేకూరింది. క్రెడిట్‌కార్డుదారుల సంఖ్య 2013-14లో 4% పెరిగిందని చెల్లింపులు, లావాదేవీ సేవలందించే వరల్డ్‌లైన్ అంటోంది. మొత్తం క్రెడిట్ కార్డుల్లో 54% ప్రైవేటు బ్యాంకులు జారీ చేసినవే. కాగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోందని, అదే విధంగా ఆన్లైన్ షాపింగ్ కూడా పెరుగుతోందని నిపుణులంటున్నారు. సమయం ఆదా కావడం, ట్రాఫిక్ చిక్కుల్లేకుండా కోరుకున్న వస్తువు లభ్యమవుతుండడం, ధర అందుబాటులో ఉండడం, సొమ్ము చెల్లింపులు సులభంగా ఉండడం, కొన్ని సంస్థలు నెలవారీ సమాన వాయిదాలు (ఈఎంఐ)లు ఆఫర్ చేస్తుండడం తదితర కారణాల వల్ల ఆన్లైన్ షాపింగ్ పెరుగుతోందని వారంటున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా మహిళలతో సహా పలువురు ముఖ్యంగా యువ ఉద్యోగులు ఆన్లైన్ షాపింగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.