ఆన్‌లైన్‌ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌ | Big Blow To Online Shoppers As Govt May Look To Curb Deep Discounting | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌

Published Wed, Aug 1 2018 11:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Big Blow To Online Shoppers As Govt May Look To Curb Deep Discounting - Sakshi

ఆన్‌లైన్‌ షాపింగ్‌ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూఢిల్లీ : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం, స్నాప్‌డీల్‌, మింత్రా.. వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో భారీ డిస్కౌంట్ల కోసం వేచిచూస్తున్నారా? ఈ సారి డిస్కౌంట్‌ ఆఫర్‌లో ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయాలని ప్లాన్‌ వేసుకున్నారా? అయితే ఇది మీకు కచ్చితంగా నిరాశ  కలిగించే వార్తనే. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు ఆఫర్‌ చేసే మెగా డిస్కౌంట్‌ ఆఫర్లకు ఇక త్వరలోనే కళ్లెం పడబోతుంది. భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకు ప్రొడక్ట్‌లను విక్రయించే వాటిపై ఓ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఈ-కామర్స్‌ పాలసీ ముసాయిదాను కూడా ప్రతిపాదించింది.

ఈ ముసాయిదాలో వినియోగదారులను ఆకర్షించేందుకు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన భారీ డిస్కౌంట్‌ ఆఫర్లను నిలిపివేయాల్సి ఉందని ప్రతిపాదించారు. ఈ ముసాయిదా విధానాన్ని సోమవారం స్టేక్‌హోల్డర్స్‌కు కూడా షేర్‌ చేసింది. ఈ ప్రతిపాదిత చట్టంలోకి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలతో పాటు స్విగ్గీ, జొమాటో లాంటి ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సైట్లు, ఆర్థిక లావాదేవీలు అందించే పేటీఎం, అర్బన్‌క్లాప్‌, పాలసీ బజార్‌ లాంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు రానున్నాయి. ఈ ముసాయిదా ఈ-కామర్స్‌ విధానాన్ని కేంద్రం, డేటా ప్రైవసీపై జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ అందించిన ప్రతిపాదనల మేరకు రూపొందించింది.  

వ్యక్తిగత వివరాల భద్రత బిల్లు- 2018 ముసాయిదాను జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కీలక సమాచారాన్ని భారత్‌లో ఉన్న కేంద్రాల్లోనే నిక్షిప్తం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ-కామర్స్‌ విధాన ముసాయిదాను కూడా ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే రూపొందించినట్లు వాణిజ్య కార్యదర్శి- డిజిగ్నేట్ అనుప్‌ వాదవాన్‌ తెలిపారు. ఈ-కామర్స్‌ విధాన ముసాయిదా రూపకల్పన నిమిత్తం ఓలా, స్నాప్‌డీల్‌, మేక్‌ మై ట్రిప్‌, అర్బన్‌ క్లాప్‌, జస్ట్‌డయల్‌ ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీని కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది. 

ప్రస్తుతం భారత్‌ ఈ-కామర్స్‌ రంగం 25 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది ఈ దశాబ్దంలో 200 బిలియన్‌ డాలర్లను తాకనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈ-కామర్స్‌ రంగం భారీగా బలపడింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు వినియోగదారులను క్యాష్‌ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు అక్రమ డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తూ.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అక్రమ డిస్కౌంట్లకు చెక్‌ పెట్టడానికి ఇప్పడివరకు ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేదు. కొన్ని బ్రాండులు సైతం తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ సంస్థలు భారీ డిస్కౌంట్‌ విక్రయిస్తున్నాయని వాపోతున్నాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భావించిన ప్రభుత్వం, ముసాయిదా ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement