ఈ-కామర్స్ సైట్స్‌కే టోకరా | Tokara to E-commerce sites | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్ సైట్స్‌కే టోకరా

Published Thu, Mar 17 2016 8:17 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఈ-కామర్స్ సైట్స్‌కే టోకరా - Sakshi

ఈ-కామర్స్ సైట్స్‌కే టోకరా

♦ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇస్తూ దర్జాగా చోరీలు
♦ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లను దోపిడీ చేసిన చోర సోదరులు
♦ అరెస్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
 
 సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో ఆర్డర్లు ఇవ్వడం.. వస్తువులకు బదులు రాళ్లు, సబ్బుబిళ్లలు పొంది మోసపోవడం.. ఈ తరహా నేరాలను మనం వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకే టోకరా వేశారు ఇద్దరు చోర సోదరులు. చివరకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిద్దరినీ బుధవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇషాకీ, మహ్మద్ షర్ఫరోజ్ అన్సారీ వరుసకు సోదరులు. కుటుంబంతో నగరానికి వలస వచ్చిన ఈ ద్వయం గోల్కొండ ఠాణా పరిధిలోని ధన్కోట ప్రాంతంలో నివసిస్తోంది. ఇషాకీ జూబ్లీహిల్స్‌లోని ఇగ్నోలో సైకాలజీ చదువుతుండగా.. అన్సారీ జవహర్‌నగర్‌లోని కళాశాలలో బీబీఏ అభ్యసిస్తున్నాడు. ఇషాకీ అమేజాన్ వెబ్‌సైట్‌లో పుస్తకాల విక్రేతగా రిజిస్టర్ చేసుకుని ఆన్‌లైన్ ఆర్డర్స్‌పై కొన్ని రకాలైన పుస్తకాలను విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయా ఈ-కామర్స్ సంస్థలు వస్తువుల్ని ప్యాక్ చేసే విధానం, చెల్లింపులపై పూర్తి అవగాహన ఉండటంతో అన్సారీతో కలసి ఆన్‌లైన్ సైట్స్‌ను మోసం చేయాలని కుట్ర పన్నాడు.

 వస్తువులు తీసి ఇసుక నింపి..
 ఈ ద్వయం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్స్‌లో క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, డీవీడీ ప్లేయర్లను ఆర్డర్ చేసేది. ఆయా వస్తువుల్ని తీసుకువచ్చిన డెలివరీ బాయ్స్‌ను గోల్కొండలోని తన ఇంటి వద్దే కలిసేది. వారి నుంచి పార్శిల్‌ను తీసుకునే ఇషాకీ.. నగదు చెల్లించేందుకు డెబిట్ కార్డ్ తీసుకువస్తానంటూ లోపలికి వెళ్లేవాడు. డెలివరీ బాయ్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు అన్సారీ అక్కడే ఉండి అతడితో మాటలు కలిపేవాడు. ఇంట్లోకి వెళ్లిన ఇషాకీ.. చాకచక్యంగా పార్శిల్‌ను తెరిచి అందులోని వస్తువు తీసేసేవాడు. ఆ వస్తువుకు సమాన బరువు ఉండే ఇసుకను ప్యాక్ చేసి బాక్సులో ఉంచేవాడు. సీలింగ్ మిషన్ సాయంతో సీలు వేసే వాడు.

 ‘డమ్మీ’ డెబిట్‌కార్డ్ తీసుకువచ్చి..
 అలా రీ-ప్యాక్ చేసిన ‘విలువైన వస్తువు’లతో పాటు బ్యాలెన్స్ లేని డెబిట్ కార్డును తీసుకుని బయటకు వచ్చే ఇషాకీ.. కార్డును డెలివరీ బాయ్‌కు ఇచ్చేవాడు. స్వైపింగ్ మిషన్‌లో స్వైప్ చేసిన డెలివరీ బాయ్స్ అందులో బ్యాలెన్స్ లేదని చెప్పేవారు. దీంతో ‘సారీ’ చెప్పేసి.. అన్సారీ పార్శిల్‌ను తిరిగి వారికి అప్పగించేసేవాడు. ఈ పంథాలో ఫ్లిప్‌కార్ట్‌ను ఎనిమిదిసార్లు మోసం చేశారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి కాజేసిన మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, ఓ కెమెరా, ల్యాప్‌టాప్, డీవీడీ ప్లేయర్‌ను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనాన్నీ చోరీ చేసినట్లు తెలియడంతో దాన్నీ రికవరీ చేశారు. తాము అమేజాన్‌నూ ఇదే తరహాలో మోసం చేశామని నిందితులు వెల్లడించారు. ఆ సంస్థ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement