సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో స్వచ్ఛమైన వర్షపు నీటితో కళకళలాడాల్సిన చెరువులు కబ్జాల చెరలో చిక్కిశల్యమవుతున్నాయి. ఒకవైపు మురుగు ముప్పు.. మరోవైపు ఆక్రమణలు ఆయా జలాశయాల ఉసురు తీస్తున్నాయి. మహానగరం పరిధిలో మొత్తంగా 185 చెరువులుండగా వీటిలో ఇప్పటివరకు 134 చెరువులు కబ్జాలకు గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు నివేదించడం గమనార్హం.
ఇందులో పలు జలాశయాల ఫుల్‌ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లలో ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపింది. మొత్తంగా 134 జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధిలో 8,718 .. బఫర్‌జోన్‌లో 5,343 అక్రమ నిర్మాణాలున్నట్లు పేర్కొంది. సదరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం నివేదికలో స్పష్టంచేసింది.
51 చెరువులకు ఊరట..
మహానగరం పరిధిలో కేవలం 51 చెరువులు మాత్రమే కబ్జాలకు గురికాకుండా ఉన్నాయని ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక 30 చెరువులు 85 శాతం ఆక్రమణకు గురైనట్లు తేల్చింది. మరో 104 జలాశయాలు 15 శాతం కబ్జాకు గురైనట్లు నివేదికలో పేర్కొంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 185 జలాశయాలకు సంబంధించి ఎఫ్‌టీఎల్ హద్దులను సిద్ధం చేసి హెచ్‌ఎండీఏ పరిధిలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సమర్పించినట్లు తెలిపింది.
ఇప్పటికే 157 చెరువుల ఎఫ్‌టీఎల్ బౌండరీలకు సంబంధించి తుది నోటిఫికేషన్ హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తున్నామని పేర్కొంది. నూతనంగా ఆయా జలాశయాల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ విభాగాల సహకారంతో సంబంధిత వ్యక్తులపై ఇరిగేషన్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించింది.
న్యాయపరమైన చిక్కులతో సాగని పనులు..
నగరంలో పలు చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఇరిగేషన్ శాఖ ఆయా జలాశయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యపడడం లేదని నివేదికలో తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేని చోట ఆక్రమణలను తొలగించి ఎఫ్‌టీఎల్ బౌండరీల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశామని పేర్కొంది. నగరంలో 63 జలాశయాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుకు ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ రూ.94 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుతోపాటు ఆయా జలాశయాల చుట్టూ సీసీటీవీలను ఏర్పాటు చేసి అక్రమార్కులపై నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment