
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన సంఘటనను జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందగా, వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక నష్టపరిహారం కింద రూ.50 కోట్లను జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఎన్జీటీ ఆదేశించింది. అలాగే ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ పీసీబీ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. (ఏం జరిగింది పెద్దాయనా?)
ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘటనకు దారి తీసిన కారణాలపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ వి.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పులిపాటి కింగ్, సీపీసీబీ సభ్య కార్యదర్శి, నీరి హెడ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. (గ్యాస్ లీకేజీ ఘటన : హైపవర్ కమిటీ ఏర్పాటు)
పర్యావరణ నిబంధనలు, ప్రమాదకర రసాయనాలు నిబంధనలు లేదని స్పష్టమవుతోందని, భారీ మొత్తంలో విషవాయువులు వెలువడడానికి ఖచ్చితంగా ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని ఎన్టీటీ స్పష్టం చేసింది. ఫ్యాక్టరీని నియంత్రించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే వారు కూడా బాధ్యులేనని, ఈ ఘటనకు దారితీసిన కారణాలు, లోపాలు, నష్టం, తదుపరి చర్యలపై దృష్టి పెట్టామని పేర్కొంది. తదుపరి కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష)
- గ్యాస్ లీక్ ఘటనల క్రమం,
- వైఫల్యాలకు గల కారణాలు, బాధ్యులు,
- ప్రజలు, జీవాల ప్రాణాలకు కలిగిన నష్టం, గాలి నీరు భూమికి జరిగిన నష్టం అంచనా
- బాధితులు, పర్యావరణానికి నష్టపరిహారం చెల్లింపు కు తీసుకున్న చర్యలు
- మళ్లీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు
- ఐదు అంశాలపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశం