సాక్షి, అమరావతి: తాను జన్మించిన ప్రాంతమంటే సహజంగానే ఎవరికైనా కాస్తంత ప్రేమ ఉంటుంది. ఎంతదూరంలో ఉన్నా ఆ మమకారం పోదు. వీలైతే సొంతగడ్డకు సేవ చేసి రుణం తీర్చుకోవాలి. పోనీ అది కుదరలేదనుకుంటే కనీసం అపకారం తలపెట్టకూడదు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధినే అడ్డుకుంటున్నారు. తాను చేయకపోగా ఇతరులు సంకల్పిస్తే సహించలేకపోతున్నారు. లక్ష ఎకరాలకుపైగా సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తాజాగా ఎన్జీటీలో ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషనే ఇందుకు నిదర్శనం.
ప్రాజెక్టును ఆపాలంటూ టీడీపీ పిటిషన్..
గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రిజర్వాయర్లతో కూడిన ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు ఆ పార్టీకే చెందిన 13 మంది నేతలతో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ), చెన్నై బెంచ్‌లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టును నిలుపుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్జీటీని అభ్యర్థించారు.
కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల్ శక్తి శాఖకూ ఫిర్యాదులు చేశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తోందని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశించాలని ఎన్జీటీలో గత నెల 27న రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు జిల్లాలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో 1.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. దుర్భిక్ష పశ్చిమ మండలాల రూపురేఖలను సమూలంగా మార్చేసే ఈ ప్రాజెక్టును అడ్డుకునే యత్నం చేయడం ద్వారా చివరకు సొంత జిల్లా ప్రజలకూ చంద్రబాబు అన్యాయం చేశారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
అనుసంధానంతో...
హంద్రీ– నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీళ్లు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేయడం ద్వారా ఎనిమిది టీఎంసీలను తరలించి చిత్తూరు జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కండలేరు నుంచి నీటిని తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు. తద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సొంత ప్రాంతం అభివృద్ధినే అడ్డుకుంటూ కేసులు దాఖలు చేయిస్తున్నారు. ఇది పూర్తిగా దిగజారుడుతనానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ ప్రాజెక్టు..
►వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలుగా వ్యవహరిస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు. మిగతా 1,550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు.
►అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 2 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు.
►పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు.
►పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఈ పనులకు ఆగస్టులో టెండర్లు నిర్వహించిన ప్రభుత్వం మూడేళ్లలోగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది.
ఆది నుంచి అదే నైజం..
1995 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కృష్ణా బేసిన్‌లో ఎగువన కర్ణాటక అక్రమంగా ఆల్మట్టి ప్రాజెక్టును నిర్మిస్తుంటే నోరు మెదపకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కర్ణాటక ప్రభుత్వం చిత్రావతిపై పరగోడు.. పెన్నాపై నాగలమడక బ్యారేజీలను నిర్మిస్తూ దుర్భిక్ష అనంతపురం జిల్లా ప్రజల నోళ్లు కొడుతుంటే నిర్లిప్తంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ఎత్తిపోతల సహా ఎనిమిది అక్రమ ప్రాజెక్టులను చేపట్టి 178.93 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా తరలిస్తుంటే ఓటుకు కోట్లు కేసుల భయంతో నోరు విప్పలేదు. ఇప్పుడు సొంత జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టును స్వాగతించకుండా అడ్డుపుల్లలు వేయడం ద్వారా తన వైఖరిని మరోసారి రుజువు చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment