సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసుకు సంబంధించి చెన్నైలోని జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ)లో ఇరువైపుల వాదనలు ముగిశాయి. మంగళవారం జరిగిన కోర్టు విచారణలో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే తమకు వాటాగా రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇది పాత పథకమేనని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలపాలని కోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. (కరువు సీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదమెందుకు?)
కాగా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 20న విచారణ చేపట్టిన ఎన్జీటీ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని స్టే ఇచ్చింది. అయితే తన వాటా జలాలను వినియోగించుకునేందుకు ఈ పథకం చేపట్టామని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నివేదించింది. దీనిపై జూలై13న విచారించిన ఎన్జీటీ ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. (పర్యావరణ అనుమతి అక్కర్లేదు)
Comments
Please login to add a commentAdd a comment