దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది.
ఏమిటీ గ్రీన్ క్రాకర్స్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు.
మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతినిచ్చింది.
గ్రీన్ క్రాకర్స్‌ని గుర్తించడం ఎలా ?
ఎన్‌ఈఈఆర్‌ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్‌ఐఆర్–ఎన్‌ఈఈఆర్‌ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి.
స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి
స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి
సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్‌కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ.
కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ?
పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్‌కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్‌పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది.
ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్‌ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏయే రాష్ట్రాల్లో ఎలా?
కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతినిచ్చింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment