council of Scientific and Industrial Research
-
Diwali 2022: పండుగ పచ్చగా.. గ్రీన్ క్రాకర్స్‌కు పెరిగిన ఆదరణ
దీపావళి వచ్చేసింది. అమావాస్య చీకటి రోజున దివ్వెల కాంతులతో పాటు కాకరపువ్వొత్తుల చిటపటలు, మతాబుల వెలుగులు, చిచ్చుబుడ్ల మెరుపులు, లక్ష్మీబాంబుల మోతలు లేకుండా పండుగకి కళే రాదు. మరి ఈ బాణాసంచాతో పర్యావరణం, వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బ తింటోంది. అందుకే ఇప్పుడు అందరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండగ సరదా తీర్చుకోవాలంటే గ్రీన్ క్రాకర్స్ మార్గం కావడంతో వాటికి ఆదరణ పెరుగుతోంది. ఏమిటీ గ్రీన్ క్రాకర్స్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)–నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం తక్కువ షెల్ సైజుతో, రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తున్నారు. మామూలుగా వాడే హానికరమైన సల్ఫర్ నైట్రేట్స్, సోడియం, లెడ్, మెగ్నీషియం, బేరియం, అత్యంత హానికరమైన బ్లాక్ పౌడర్‌ను వీటిలో వాడరు. అందుకే వీటితో కాలుష్యం 30% తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యమూ తక్కువే. సాధారణ బాణసంచా 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ శబ్దం చేస్తాయి. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు మాత్రమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతినిచ్చింది. గ్రీన్ క్రాకర్స్‌ని గుర్తించడం ఎలా ? ఎన్ఈఈఆర్ఐ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రఖ్యాత బాణాసంచా కేంద్రమైన శివకాశీలోనే తయారు చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి వీలుగా సీఎస్ఐఆర్–ఎన్ఈఈఆర్ఐ ఆకుపచ్చ రంగు లోగోను బాణాసంచా బాక్సులపై ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా ఈ బాక్సులపై ఉంటుంది. గ్రీన్ క్రాకర్స్ మూడు రకాలున్నాయి. స్వాస్: వీటిని కాల్చినప్పుడు నీటి ఆవిరి కూడా విడుదలై గాల్లో ధూళిని తగ్గిస్తుంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు 30% తగ్గుతాయి స్టార్: వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వాడరు వాయు కాలుష్యానికి కారణమైన పర్టిక్యులర్ మేటర్ (పీఎం)ని తగ్గించడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి సఫల్: ఈ రకమైన గ్రీన్ క్రాకర్స్‌లో మెగ్నీషియమ్కు బదులుగా అల్యూమినియమ్ తక్కువ మోతాదులో వాడతారు.సంప్రదాయ బాణాసంచాతో పోలిస్తే శబ్ద కాలుష్యం తక్కువ. కేంద్రం లైసెన్స్ ఇచ్చిన కేంద్రాల్లోనే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాదే ఆదరణ ఎందుకు ? పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుని గుర్తించిన సుప్రీం కోర్టు బాణాసంచాను నిషేధిస్తూ అక్టోబర్ 23, 2018 దీపావళికి ముందు సంప్రదాయ బాణాసంచాపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. గ్రీన్ క్రాకర్స్‌కి మాత్రమే అనుమతినిచ్చింది. 2019లో దీపావళి సమయంలో గ్రీన్ క్రాకర్స్‌పై గందరగోళంతో బాణాసంచా పరిశ్రమ భారీగా నష్టపోయింది. వేటిని గ్రీన్ అనాలో వేటి కాదో తెలీక, తయారీదారులకే వీటిపై అవగాహన లేకపోవడంతో ఆ ఏడాది దీపావళి పండగ కళ తప్పింది. ఆ తర్వాత వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం పండగపై పడింది. 2021లో సుప్రీం కోర్టు ఆకుపచ్చ రంగుని వెదజల్లే బేరియమ్ను వాడే టపాసులకి అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు వచ్చి నాలుగేళ్లు కావడంతో ఇప్పుడు వీటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ బాణాసంచా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గిపోయిందని శివకాశీలో తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎలా? కాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో జనవరి 1 దాకా అన్ని రకాల బాణసంచాపై నిషేధముంది. కొన్ని రాష్ట్రాలు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చాయి. పశ్చిమ బెంగాల్లో దీపావళి రోజు మాత్రం క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చు. పంజాబ్ రాత్రి 8 నుంచి 10 వరకే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతించింది. హరియాణా కూడా గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతినిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎస్ఐఆర్కు తొలి మహిళా డీజీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధనలు చేసే 38 సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయ్యారు. సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్విను సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇథియమ్ అయాన్ బ్యాటరీలు రూపొందించడంలో కలైసెల్వి గతంలో మంచి ప్రతిభ కనబరిచారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కలైసెల్వి తమిళనాడులోని కరైకుడిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ అభివృద్ధిపై గత 25 ఏళ్లుగా ఆమె పరిశోధనలు చేస్తున్నారు. -
ఏడాదిలోపే కోవిడ్ ఆయుధాలు సిద్ధం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దాడి ప్రారంభమై సంవత్సరం గడవకముందే దానిపై పోరాటానికి ఆయుధాలను సిద్ధం చేసిన భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశీయంగా కరోనా టీకాను రికార్డు సమయంలో రూపొందించారని ప్రశంసలు కురిపించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) సంస్థ శాస్త్రవేత్తలతో ప్రధాని శుక్రవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. సీఎస్ఐఆర్కు ప్రధాని ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. గతంలో విదేశాల్లో రూపొందించిన వాటిని పొందేందుకు భారత్ సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు. విదేశీ శాస్త్రవేత్తలతో కలిసి, సరిసమానంగా భారతీయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారన్నారు. ఈ శతాబ్దంలో మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా అని ప్రధాని పేర్కొన్నారు. అయితే, మానవాళి ఏదైనా సంక్షోభం ఎదుర్కొన్న ప్రతీసారి.. సైన్స్ దాన్ని ఎదుర్కోవడానికి మార్గం చూపిందని మనకు చరిత్ర చెబుతోందని వివరించారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్నే కాకుండా, దేశీయంగా కరోనా టెస్టింగ్ కిట్స్‌ను, కోవిడ్ చికిత్సకు ఔషధాలను రికార్డు సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించి, ‘ఆత్మనిర్భర్ భారత్’ను నిజం చేశారని ప్రశంసించారు. భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా కోవాగ్జిన్ కోవిడ్ టీకాను తయారుచేసిన విషయం తెల్సిందే. ఆక్సిజన్ ఉత్పత్తిని కూడా రికార్డు సమయంలో భారీగా పెంచామని గుర్తు చేశారు. ‘మీ కృషి, మీ అద్భుతమైన మేథ కారణంగానే ఈ భారీ యుద్ధాన్ని చేయగలుగుతున్నాం’అని సైంటిస్ట్లకు కృతజ్ఞతలు తెలిపారు. స్వయం సమృద్ధ భారత్, సుదృఢ భారత్ తమ లక్ష్యాలని, అయితే, ఈ కరోనా మహమ్మారి కారణంగా ఆ లక్ష్యసాధన కొంత ఆలస్యమవుతోందని వివరించారు. అయితే, కచ్చితంగా వాటిని సాధిస్తామన్నారు. ‘మన లక్ష్యాలెప్పుడూ భవిష్యత్తు కన్నా రెండడుగులు ముందుండాలి’అన్నారు. సుస్థిరాభివృద్ధి, స్వచ్ఛ విద్యుత్ తదితర అంశాల్లో భారత్ ప్రపంచ దేశాలకు మార్గం చూపుతోందని, సాఫ్ట్వేర్, శాటిలైట్ టెక్నాలజీలతో చాలా దేశాల అభివృద్ధిలో భాగం పంచుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పు మహమ్మారిని ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తల బృందం ఇప్పటినుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2016లో ప్రారంభించిన ‘అరోమా మిషన్’విజయంలో సీఎస్ఐఆర్ పాత్రను ప్రధాని గుర్తు చేశారు. -
‘హెర్డ్ ఇమ్యూనిటీ’ ఆలోచన సరికాదు
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఏ దేశమైనా ‘సామూహిక రోగ నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ)’పై ఆధారపడడం ప్రమాదకరమని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ శేఖర్ మందే అభిప్రాయపడ్డారు. ‘జనాభాలో దాదాపు70% మంది ఆ వ్యాధిన పడి కోలుకుంటే ఇది సాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితి ఏ దేశానికైనా ప్రమాదమని నా ఉద్దేశం. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడమే సరైంది’ అన్నారు. ‘కోవిడ్దశలు, దశలుగా వ్యాప్తి చెందే అవకాశముంది. ప్రజలు అందుకు సిద్ధంకావాలి’ అన్నారు. -
దీపావళికి పర్యావరణహిత టపాసులు
న్యూఢిల్లీ: సాధారణ టపాసుల కంటే 30 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరించే పర్యావరణహిత టపాసులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ప్రజల మనోభావాలను పరిగణనలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించని టపాసులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. వీటిని శాస్త్రీయ పరిశ్రమల పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) తయారు చేసింది. 2018లో దీపావళి పండుగను పర్యావరణహిత టపాసులతోనే జరపాలని సూచిస్తూ కాలుష్యాన్ని కలిగించే టపాసుల తయారీ పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణహిత టపాసులు తయారు చేయాలని సూచించింది. -
మత్స్య సంపదను గుర్తించే వ్యవస్థ
పణజీ: సముద్రజలాల్లో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి(సీఎస్ఐఆర్)– నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐవో) డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలతోపాటు నీటి అడుగున పరికరాలను అమర్చి పరిశోధన చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్కాయిస్) అందించే సమాచారంపైనే ఇప్పటి వరకు మత్స్యకారులు ఆధారపడుతున్నారని, ఇది కొన్ని ప్రాంతాల్లోనే సాయపడుతోంది చెప్పారు. సముద్ర నీటిలో ఒక నెల కంటే ముందుగానే మత్స్య సంపద రాకను అంచనా వేయటంతోపాటు ఏ ప్రాంతంలో ఎలాంటి మత్స్య సంపద ఉంటుందో తెలియజెప్పే విధానాన్నీ రూపొందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వం మత్స్యకారులకు సాయపడే విధానాన్ని రూపొందించే వీలంటుంది. -
సీఎస్ఐఆర్ నెట్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నిర్వహిస్తున్నాయి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పరిశోధనలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. తాజాగా ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది... నెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీఎస్ఐఆర్, యూజీసీలు సంయుక్తంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) పేరిట ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. పీహెచ్‌డీకి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సంవత్సరానికి రూ.20,000 కంటింజెన్సీ ఫండ్‌తోపాటు నెలకు రూ.25 వేలు జేఆర్ఎఫ్ లభిస్తుంది. అర్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 55శాతం మార్కులతో ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ బీఎస్-లుగేళ్లు/బీఈ/బీటెక్/బీఫార్మా/ఎంబీబీఎస్ (ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు 50 శాతం). వయసు: 2015, జూలై 1 నాటికి గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ప్రత్యేక కేటగిరీ, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. రఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులకు రూ.1000, నాన్ క్రీమీలేయర్ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250. ఓబీసీ అభ్యర్థులు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తే వారిని జనరల్ అభ్యర్థులుగానే పరిగణిస్తారు. పరీక్షా విధానం: ప్రశ్నపత్రం 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం 3 విభాగాలుగా ఉంటుంది. సబ్జెక్టులు: కెమికల్ సెన్సైస్; ఎర్త్, అట్మాస్పియరిక్, ఓషన్, ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్ పార్ట్-ఎ: ఇది అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు కామన్‌గా ఉంటుంది. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 30 మార్కులు ఉంటాయి . ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ ముఖ్యంగా లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిలీ, క్వాంటిటేటివ్ కంపారిజన్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. పార్ట్-బి: ఈ విభాగంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు సంబంధించి 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులు. పార్ట్-సి: ఇందులో మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఏవైనా 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు. పరిశోధనాత్మక అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సైంటిఫిక్ నాలెడ్జ్‌తో ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తారనే కోణంలో ప్రశ్నలుంటాయి. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 25, 2015. దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ: ఆగస్టు 24, 2015. ఆన్లైన్ దరఖాస్తు హార్డ్‌కాపీ పోస్ట్ ద్వారా సీఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ యూనిట్‌కు చేరేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 3, 2015. పరీక్ష తేదీ: డిసెంబర్ 20, 2015. పరీక్షా కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్. వెబ్సైట్: www.csirhrdg.res.in -
ప్రతిభావంతులను శోధించే..సీఎస్ఐఆర్-నెట్
పరిశోధనలు చే స్తూ ప్రతి నెల ఫెలోషిప్ పొందాలన్నా..యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలన్నా రాయాల్సిన పరీక్ష.. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్). దీన్ని ఏటా రెండు సార్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ నిర్వహిస్తుంది..దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు,ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్.. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష ఆరు సబ్జెక్ట్‌లలో జరుగుతుంది. అవి.. కెమికల్ సెన్సైస్; ఎర్త్- అట్మాస్పియరిక్-ఓషియన్-ప్లానెటరీ సెన్సైస్; లైఫ్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్; ఇంజనీరింగ్ సెన్సైస్. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 200 మార్కులకు ఉండే ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా పార్ట్-ఎ, బి, సిగా విభజించారు. సమాధానాలను గుర్తించడానికి 3 గంటల సమయం కేటాయించారు. ఒకేరకంగా పార్ట్-ఎ: రాత పరీక్షలో మొదట ఉండే పార్ట్-ఎ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిషన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ అంశాల నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఈ విభాగానికి మార్కులు 30. సబ్జెక్టివ్గా పార్ట్-బి: పార్ట్-బీలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌ల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున మొత్తం 75 మార్కులు ఉంటాయి. ఫిజికల్ సెన్సైస్‌లో 25 ప్రశ్నల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి మొత్తం 70 మార్కులు. నైపుణ్యాధారితం పార్ట్-సి: పార్ట్-సీలో ప్రధానంగా నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా సబ్జెక్ట్‌ల్లోని శాస్త్రీయ అనువర్తనాలకు అభ్యర్థి ఏమేరకు అన్వయించే నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు? అనే అంశాన్ని పరీక్షిస్తారు. ఇందులో కూడా అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సెన్సైస్‌లో 75 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. ఎర్త్ సెన్సైస్‌లో 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ఈ విభాగానికి 100 మార్కులు. లైఫ్ సెన్సైస్‌లో 75 ప్రశ్నలకుగాను 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. మ్యాథమెటికల్ సెన్సైస్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 4.75 మార్కుల చొప్పున ఈ విభాగానికి 95 మార్కులు. ఫిజికల్ సెన్సైస్‌లో 30 ప్రశ్నలకుగాను 20 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కుల చొప్పున ఈ విభాగానికి 100 మార్కులు. లైఫ్ సెన్సైస్:గత రెండేళ్ల సరళిని పరిశీలిస్తే.. అధిక శాతం ప్రశ్నలు బయోకెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి వచ్చాయి. బయోకెమిస్ట్రీ నుంచి 20-25 మార్కులకు; అమైనో ఆమ్లాలు, వాటి రసాయనిక నిర్మాణం, తత్వం, ప్యూరిఫికేషన్ నుంచి ఎనిమిది మార్కులకు ప్రశ్నలు అడిగారు. సెల్ బయాలజీ మెంబ్రాన్ నుంచి నాలుగు నుంచి ఎనిమిది, సెల్ సైకిల్ నుంచి నాలుగు నుంచి ఆరు, సెల్ సిగ్నలింగ్ నుంచి 16 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. జెనెటిక్స్‌లో కూడా 20-25 మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మెండీలియన్ జెనెటిక్స్, పాపులేషన్ జెనెటిక్స్ మీద దృష్టి సారించాలి. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి తప్పకుండా 20-25 మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు. కిరణజన్య సంయోగక్రియ, ఫైటో హార్మోన్, ఫోటో ఫిజియాలజీ, నైట్రోజన్, మెటబాలిజమ్ నుంచి కనీసం 20 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. ఎకాలజీలో బిహేవిరియల్ ఎకాలజీ, పాపులేషన్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఎకాలజీ నుంచి 25-30 మార్కులకు ప్రశ్నలు ఉంటున్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇమ్యూనాలజీ నుంచి 12-16, పరిణామ క్రమ శాస్త్రం, డవలప్మెంట్ బయాలజీ నుంచి 25 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి పరిశీలిస్తే.. మౌలిక శాస్త్రాలైన బోటనీ, జువాలజీ నుంచి అడిగే ప్రశ్నల సంఖ్య పెరిగింది. బోటనీలో వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి, జువాలజీ నుంచి ఫైలా క్యారెక్టరిస్టిక్స్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి బోటనీ, జువాలజీ అభ్యర్థులకు ప్రిపరేషన్ సులభమేనని చెప్పొచ్చు. వీరు బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ అంశాల్లో కొంత కష్టపడితే విజయం సాధించవచ్చు. ఎంఎస్సీ (బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ) విద్యార్థులు జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ఎకాలజీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజనీరింగ్, సెల్ బయాలజీకి సంబంధించి కాన్సెప్ట్ మ్యాప్‌లను, వివిధ అంశాల సారూప్యత, వైవిధ్యాలను తెలిపే టేబుల్స్‌ను రూపొందించుకోవాలి. ఎస్క్యూ3ఆర్ (సర్వే, క్వొశ్చన్, రీడ్, రీసైట్, రీకాల్) పద్ధతిని ప్రిపరేషన్లో ఉపయోగించాలి. ఈ విభాగానికి సంబంధించి 13 యూనిట్లలో కనీసం ఏడు యూనిట్లను సమగ్రంగా ప్రిపేర్ కావాలి. పరీక్షకు అందుబాటులో ఉన్న ఐదు నెలల్లో మొదటి నాలుగు నెలలు ఈ ఏడు యూనిట్ల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఇందులో మూడు నెలలు క్లిష్టమైన, పీజీ సిలబస్‌లో లేని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగో నెలలో పీజీ సబ్జెక్ట్స్ చదవాలి. ఐదో నెలను పునశ్చరణకు, గత ప్రశ్నపత్రాల ప్రాక్టీస్‌కు కేటాయించాలి. కెమికల్ సెన్సైస్: ఇందులో మెరుగైన స్కోర్‌కు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అంశాలపై బీఎస్సీ (ఆనర్స్) స్థాయి ప్రిపరేషన్ సాగించాలి. పార్ట్-సి కోసం ఏదో ఒక స్పెషలైజేషన్‌లో మాత్రమే ప్రిపేర్ కావడం సముచితం కాదు. మిగతా విభాగాలపై కూడా దృష్టి సారించాలి. ఈ క్రమంలో ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ.. ఇనార్గానిక్ విభాగంలో గ్రూప్ థియరీ, స్పెక్ట్రోస్కోపి, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ అంశాలను బాగా ప్రిపేర్ కావాలి. గత రెండేళ్ల నుంచి ఈ విభాగంలో మన రాష్ట్ర విద్యార్థులు తక్కువ స్కోర్ చేస్తున్నారు. కారణం ఎక్కువ మంది విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఎంఎస్సీ చేయడమే. వీరు ఫిజికల్ కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి సారిస్తే మెరుగైన మార్కులు సాధించవచ్చు. ఫిజికల్ సెన్సైస్: ఈ విభాగంలో పార్ట్-బిలో క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ, మ్యాథమెటికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అంశాల నుంచి సమాన సంఖ్యలోనే ప్రశ్నలు ఇస్తున్నారు. ఒక్కోసారి క్వాంటమ్ మెకానిక్స్, ఈఎమ్ థియరీ నుంచి ఒకటి రెండు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి. పార్ట్-సి కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది. ఇందులో రాణించాలంటే సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ ఫిజిక్స్, అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ ఫిజిక్స్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇంజనీరింగ్ సెన్సైస్:ఇందులోని పార్ట్-బీలో మ్యాథ్స్, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో లీనియర్ అల్జీబ్రా, కాలిక్యులస్, కాంప్లెక్స్ వేరియబుల్స్, వెక్టర్ కాలిక్యులస్, ఆర్డినరీ డిఫెరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రోబబిలిటీ, సాలిడ్ బాడీ అండ్ ఫ్లూయిడ్ మిషన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రోమాగ్నటిక్స్ వంటి అంశాల నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున ఈ విభాగానికి కేటాయించిన మా ర్కులు 70. పార్ట్-సిలో సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎలక్ట్రికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, సాలిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ప్రతి అంశం నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 70 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇందులో ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు ఈ విభాగానికి కేటాయించారు. ఈ విభాగంలో అభ్యర్థి తన బ్రాంచ్ కాకుం డా అదనంగా మరో సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. అవి.. ఈసీఈ: ఎలక్ట్రానిక్స్-సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్-మెటీరియల్ సైన్స్. సీఎస్ఈ: సీఎస్ఈ-ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ-థర్మోడైనమిక్స్. సివిల్: సాలిడ్ మెకానిక్స్-ఫ్ల్లూయిడ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. మెకానికల్: ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. కెమికల్/ఎన్విరాన్మెంటల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్. ఏరోనాటికల్/ఆటోమొబైల్: థర్మోడైనమిక్స్-మెటీరియల్ సైన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్-థర్మోడైనమిక్స్. ఈఈఈ:ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్. జనరల్ టిప్స్: స గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా లాభిస్తుంది. స సిస్టర్ ఎగ్జామ్స్‌గా వ్యవహరించే డీ బీటీ-జేఆర్ఎఫ్, ఐసీఎంఆర్-జేఆర్ఎఫ్, ఐసీఏఆర్-జేఆర్ఎఫ్, జెస్ట్, బార్క్, డీఆర్డీఓ వంటి పరీక్షలు రాయడం ఉపయోగకరం. స పరీక్షలో మొదట పార్ట్-సితో ప్రారంభించండి. ఎందుకంటే ఇది స్కోర్ చేయగలిగిన విభాగం. తర్వాత పార్ట్-బి, చివరగా పార్ట్-ఎను సాధించండి. పార్ట్-బిలో ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం కేటాయించాలి. పార్ట్-సిలో ప్రతి ప్రశ్నను మూడు/నాలుగు నిమిషాల్లో సాధించడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ).. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా నియామకాలను చేపట్టడానికి యూజీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు గతేడాది యూజీసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు లేఖ కూడా రాసింది. ఐఓసీఎల్ బాటలోనే ఇతర పీఎస్‌యూలు నడిచే అవకాశం ఉంది. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు సీఎస్ఐఆర్ పరిశోధనశాలలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రెండేళ్లపాటు నెలకు రూ. 16 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ. 20 వేలు చెల్లిస్తారు. ఈ క్రమంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూడో ఏడాది నుంచి ప్రతి నెలా రూ. 18 వేల ఫెలోషిప్ అందుకోవచ్చు. జేఆర్ఎఫ్లో అత్యంత ప్రతిభావంతులకు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఫెలోషిప్ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ. 20 వేల ఫెలోషిప్, ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ. 70 వేలు చెల్లిస్తారు. తర్వాత ప్రతిభ ఆధారంగా మూడేళ్లపాటు పొడిగింపు లభిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ. 24 వేల ఫెలోషిప్ లభిస్తుంది.సీఎస్ఐఆర్-యూజీసీ నెట్లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షకు హాజరు కావాలంటే నెట్/సెట్లో అర్హత సాధించాలి.