సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం వైఖరి ఏమిటో తెలపాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం తన వైఖరి వెంటనే చెప్పాలని ఏజీ శ్రీరామ్ కోరారు. కేంద్రం వైఖరి ఏమిటో చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీకి చెందిన రైతులు డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు ఆరు నెలల కాల పరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించరాదని పేర్కొన్నారు. ఏపీ రైతుల పిటిషన్ ప్రవేశ సమయంలోనే విచారణకు నిరాకరించాలన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసి కూడా ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు తెలిపారు.
కేవలం తాగునీటి కోసమే అయితే అంతంత సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు? సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్టుంది కదా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణా నదిలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోందని రాంచందర్‌రావు తెలిపారు.
ప్రాజెక్టు సమీప 13 మండలాల్లో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలున్నాయని, భూగర్భ జలాల వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలోనే భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలుత అండర్ టేకింగ్ ఇచ్చినట్టుగా తాగునీటి కోసమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామనిస్పష్టం చేశారు. ఈ కేసులో కేంద్రం వైఖరి చెప్పాలన్న అంశంపై కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రాథమిక దశలోనే విచారణ ఉందని తుది విచారణలో తప్పకుండా వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం వింటామన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
పాలమూరు–రంగారెడ్డిపై కేంద్రం వైఖరి తెలపాలి
Published Thu, Oct 7 2021 5:19 AM | Last Updated on Thu, Oct 7 2021 5:19 AM
Comments
Please login to add a commentAdd a comment