సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనంత వరకు ఆ నిర్ణయంలో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోలేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) స్పష్టం చేసింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేసేందుకు నిరాకరించింది. అనుమతులు రద్దుకు సహేతుక కారణాలు లేవని స్పష్టంచేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిందని తెలిపింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నీటి వనరుల విషయంలో మాత్రమే తాము జోక్యం చేసుకుంటున్నామంది. తాము నిర్దేశించిన పరిమితికి మించి నీరు అవసరమైతే పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని నిబంధనల్లో మార్పు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్‌జీటీ చెన్నై బెంచ్ జుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్ సభ్యుడు డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటితో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నం రాంనగర్‌కు చెందిన దాట్ల శ్రీదేవీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది.
ప్రభుత్వం తరఫున సయ్యద్ నూరుల్లా షరీఫ్, దొంతిరెడ్డి మాధురీరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. భోగాపురం విమానాశ్రయానికి ఎంత భూమి అవసరమన్న వివరాలను దాచిపెట్టారన్న పిటిషనర్ వాదనను ఎన్‌జీటీ తోసిపుచ్చింది. ‘పౌర విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉండకూడదన్న నిషేధం ఏదీ లేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఎయిర్‌పోర్టు భోగాపురం విమానాశ్రయానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుత విమానాశ్రయం నావికాదళానికి సంబంధించింది. పౌర విమానాశ్రయంగా దానిని నిర్వహించే విషయంలో కొన్ని పరిమితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఓ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకుంది.’ అని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది.
‘భోగాపురం’ అనుమతులు సరైనవే
Published Fri, Dec 10 2021 4:28 AM | Last Updated on Fri, Dec 10 2021 8:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment